దేశంలో 43 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు..

దేశంలో 43 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు..

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. కొద్ది రోజులుగా వ‌రుస‌గా 2 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుద‌లలో రోజుకో పీక్ ట‌చ్ అవుతోంది. ఆదివారం 2478 పాజిటివ్ కేసుల న‌మోదు కాగా, సోమ‌వారం నాడు 2573 మందికి వైర‌స్ సోకిన‌ట్లు నిర్థార‌ణ అయింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా క‌రోనా ప‌రిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 2573 కొత్త కేసులు వ‌చ్చాయ‌ని, 83 మంది మ‌ర‌ణించార‌ని వెల్ల‌డిచింది. అలాగే ఈ ఒక్క రోజులో 875 మంది వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నార‌ని తెలిపింది. ‌దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 42,836 కేసులు న‌మోద‌య్యాయ‌ని చెప్పింది. అందులో 1389 మంది మ‌ర‌ణించ‌గా.. 11,762 మంది డిశ్చార్జ్ అయ్యార‌ని వెల్ల‌డించింది కేంద్ర ఆరోగ్య శాఖ‌. ప్ర‌స్తుతం 29,685 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ ల‌ను దాటేసిన త‌మిళ‌నాడు..

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 12974 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అందులో 548 మంది మ‌ర‌ణించ‌గా.. 2115 మంది కోలుకున్నారు. గుజ‌రాత్ లో 5428, ఢిల్లీలో 4549 కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టి వ‌ర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ ల క‌న్నా త‌క్కువ కేసుల‌తో ఉన్న త‌మిళ‌నాడులో సోమ‌వారం ఒక్క‌సారిగా భారీగా పాజిటివ్ రావ‌డంతో ఆ రెండు రాష్ట్రాల‌ను దాటేసింది. దీంతో త‌మిళ‌నాడులో మొత్తం కేసుల సంఖ్య 3023కి చేరింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 2942, రాజ‌స్థాన్ లో 2886 మందికి వైర‌స్ సోకింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 2742, ఏపీలో 1650, పంజాబ్ లో 1102, తెలంగాణ‌లో 1082, ప‌శ్చిమ బెంగాల్ లో 963, జ‌మ్ము క‌శ్మీర్ లో 701 కేసులు న‌మోద‌య్యాయి.