నగరంలోపెరుగుతోన్న కేసులు.. కారణం ఇదే

నగరంలోపెరుగుతోన్న కేసులు.. కారణం ఇదే
  • మాస్ గ్యాదరింగ్​తో నగరంలోపెరుగుతోన్న కేసులు
  • న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి వరకు వందల్లో ప్రోగ్రామ్​లు 
  • రూల్స్​ పాటిస్తున్నామంటూ నిర్వాహకుల వరుస కార్యక్రమాలు
  • న్యూ ఇయర్ పేరిట ప్రభుత్వ రంగ సంస్థల ఈవెంట్లు
  • ఒక్క వారంలోనే 10  రెట్లు పెరిగిన కేసులు

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఈవెంట్లు,  ప్రోగ్రామ్స్​​లే కరోనా హాట్​స్పాట్​ కేంద్రాలుగా మారిపోయాయి. డిసెంబర్ రెండో వారంలో వందలోపే నమోదైన కేసులు, వరుసగా జరుగుతున్న ప్రోగ్రామ్ ల కారణంగా వెయ్యికి చేరాయి. వేగంగా విస్తరించే కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తో సిటీలో పరిస్థితి ప్రమాదకరంగా మారేలా కనిపిస్తోంది. ఈవెంట్లు, ప్రోగ్రామ్​లతో తోనే  మాస్ గ్యాదరింగ్ పెరిగి వైరస్ ​స్పీడ్​గా  విస్తరిస్తుండగా,  వారం నుంచి భారీగా కేసులు వస్తున్నాయి.  ఇయర్ ఎండ్ ప్రోగ్రామ్​లతో ఈ సంఖ్య మరింత  అధికమైంది.  ఇప్పటికే షెడ్యూల్ తో రెడీ అయిన ఈవెంట్ ఆర్గనైజర్లు, సంక్రాంతి ఫెస్టివల్​ సందర్భంగా  ఎగ్జిబిషన్లు, షాపింగ్ మేళాలతో సందడిగా మారనుంది. మరోవైపు కొవిడ్​ రూల్స్ ​పాటించాలని హెల్త్ సిబ్బంది హెచ్చరిస్తున్నా,  ప్రోగ్రామ్స్​ నిర్వహించేవారు, వాటికి వెళ్లేవారు లైట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇయర్ ఎండ్ ప్రోగ్రామ్​లను అట్టహాసంగా ప్లాన్ చేస్తుండగా,  కరోనా కేసులకు మరింత అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వరుస ఈవెంట్ల కారణంగా.. 
ఇయర్ ఎండింగ్ ​వస్తే వరుస ఈవెంట్లతో సిటీ సందడిగా ఉంటుంది.  కరోనా కారణంగా గతేడాది మినహా,   గత నవంబర్ నుంచి  ప్రోగ్రామ్స్​ పెరిగాయి. రవీంద్ర భారతి, శిల్పారామం, హైటెక్స్ ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఇతర ప్రైవేటు ఈవెంట్లతోపాటు, మతపరమైన ప్రోగ్రామ్​లు, టూరిస్ట్ ​ప్రాంతాల్లోనూ జనాల రద్దీ పెరిగింది. ఇప్పటివరకు సిటీలో దాదాపు 18కి పైగా బడా ఎగ్జిబిషన్లు జరిగినట్లుగా ఈవెంట్ ఆర్గనైజర్లు చెప్పారు. ఇందులో దాదాపు మూడు నుంచి 5లక్షల మంది పాల్గొని ఉంటారని పేర్కొన్నారు. దీంతో  డిసెంబర్ 17 నాటికి 84 కేసులు నమోదైతే, జనవరి 1 తర్వాత సిటీలో వచ్చిన కేసులు 217కు చేరాయి. ఐదు రోజుల వ్యవధిలోనే ఏకంగా 917 కేసుల బల్దియా పరిధిలోనే నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాల్లో పదుల్లో వచ్చే కేసులు, ఏకంగా 174కు పెరిగితే,  మేడ్చల్ పరిధిలో 132 మంది వైరస్​ బారినపడ్డారు. 

ప్రార్థనా స్థలాలు, పార్కులు, టూరిస్టు స్పాట్లలో రద్దీ
డిసెంబర్ నెలాఖరులో జరిగిన క్రిస్మస్, థర్టీ ఫస్ట్ ఈవెంట్స్, న్యూ ఇయర్ కారణంగా పార్కులు, టూరిస్టు స్పాట్లతో పాటు ప్రార్థనా స్థలాలకు జనాలు అధికంగా వెళ్లారు. ఇక ఫ్యామిలీతో కలిసి టూరిస్టు స్పాట్లకు వెళ్లిన వారు ఎక్కువగానే ఉన్నారు.  హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని ఎన్టీఆర్ గార్డెన్ ను దాదాపు 25 వేల మంది విజిట్ చేశారు.  ట్యాంక్ బండ్ పై కనీసం 10 వేల మంది ఫ్యామిలీతో కలిసి సంబురాలు చేసుకున్నారు. జూ పార్కు, పర్యాటక ప్రాంతాలకు అధికంగానే వెళ్లారు.  

ప్రభుత్వమే ఆడంబరంగా ప్రోగ్రామ్స్​
ఓమిక్రాన్ వేరియంట్​పై జాగ్రత్తలు చెప్పడం వరకే ప్రభుత్వం పరిమితమైంది.  మరోవైపు ప్రభుత్వమే ప్రోగ్రామ్స్​ ఆడంబరంగా  చేపడుతుంది. గ్రేటర్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్న ప్రోగ్రామ్​లు జనాల రద్దీ మధ్యనే సాగాయి. గత డిసెంబర్ 16న ఓఆర్ఆర్ సెంట్రల్ లైటింగ్ ను కేటీఆర్ ప్రారంభించగా మూడు వేల మంది వరకు పాల్గొన్నారు. న్యూ ఇయర్ ​రోజు షేక్ పేట్ ఫ్లై ఓవర్ ను ఓపెన్ ​చేయగా భారీగానే జనాలు వచ్చారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు వరుసగా ఎగ్జిబిషన్లు, మేళాలను నిర్వహిస్తుండగా వేలల్లో జనాలు వెళ్తున్నారు.  ఓ వైపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకలపై హైకోర్టు ఆంక్షలు విధించాలని సూచించినా కరోనా రూల్స్​ పాటిస్తూ  నిర్వహించుకోవాలని ప్రభుత్వం పర్మిషన్​ ఇచ్చింది. దీంతో సిటీలోని ప్రధాన హోటళ్లు, రిసార్ట్​ల్లో  సుమారు 256 ఈవెంట్లు జరిగినట్లు తెలిసింది. అనధికారికంగా మరో 250 పైనే ప్రోగామ్స్​ అయ్యాయని ఈవెంట్ ఆర్గనైజర్లు చెప్పారు. 

వచ్చే 15 రోజుల్లో 65 భారీ ఈవెంట్లు
సంక్రాంతి వరకు సిటీలో వరుసగా ప్రభుత్వ ప్రోగ్రామ్స్​తో పాటు ఇతర ప్రైవేటు ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు ఉన్నాయి. ఇందులో ఏటా టూరిజం డిపార్ట్​మెంట్ నిర్వహించే కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్‌, శిల్పారామంలో జరిగే సంక్రాంతి వేడుకలు, డిసెబుల్డ్ వెల్ఫేర్ శాఖ ఎగ్జిబిషన్లు, హైటెక్స్ లో 4  భారీ ప్రైవేటు ఎగ్జిబిషన్లు జరగనున్నాయి.  ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ట్రైబల్ మేళా, రవీంద్ర భారతిలో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్​లు ఇలా సిటీలో  వచ్చే15 రోజుల్లో 65 భారీ ఈవెంట్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 

స్వీయ నియంత్రణ పాటించాలె
రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు స్వీయ నియంత్రణ పాటించాలి. కరోనాపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అలర్ట్​గా ఉండాలి.  ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోనివారు, రెండు డోసులు పూర్తి కానివారు వెంటనే తీసుకోవాలి. ఫిజికల్​డిస్టెన్స్ పాటించడం, మాస్కులు పెట్టుకోవడంపై అశ్రద్ధగా ఉండొద్దు. 
- స్వరాజ్యలక్ష్మి, రంగారెడ్డి  డీఎంహెచ్ వో

బంద్ పెడితే..
షాపింగ్ మేళాలు, ఎగ్జిబిషన్లు యధావిధిగా కొనసాగుతుండగా జనాలు ఎక్కువగా వెళ్తున్నారు. నిర్వాహకులు కూడా కొవిడ్​ రూల్స్​పాటిస్తున్నారు. అయితే పూర్తిగా ఎగ్జిబిషన్లు, ఈవెంట్లు బంద్​పెడితే సిటీలో దాదాపు 50 వేల మంది ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. 
- సుమిత్ర్, ప్రముఖ ఈవెంట్ కంపెనీ ఎంప్లాయ్​

పర్మిషన్​ వాటికెందుకిచ్చారో.. 
కరోనాపై జాగ్రత్తలు పాటించాలని ఇప్పుడు అధికారులు చెప్తున్నరు. క్రిస్మస్, థర్టీ ఫస్ట్, న్యూ ఇయర్​కు రూల్స్​ఎందుకు పెట్టలేదు.  సిటీలో వందల సంఖ్యలో ఈవెంట్లు జరిగాయి. కేసులు ఎక్కువైతున్నయంటే అవన్నీ కూడా ఈవెంట్లలో పాల్గొన్న వారితోనే వచ్చి ఉంటాయి. వచ్చే రోజుల్లో మరింతగా కేసులు పెరుగుతాయి. 
- ఉమేశ్ ​శ్రీఖండే, సామాజిక కార్యకర్త