- లాక్‌డౌన్‌తో జనం ఇబ్బందులు
- నిత్యావసరాలు, నీళ్లు, మందులు దొరకట్లే
- సూపర్ మార్కెట్లలో సరుకులు ఖాళీ..
- జిన్‌పింగ్ సర్కారుపై ప్రజల ఆగ్రహం
బీజింగ్: ఆకలి.. ఆకలి.. ఆకలి.. చైనా సిటీ షాంఘైలో ఎటు చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు కూడా దొరకక రెండున్నర కోట్ల మంది జనం అల్లాడుతున్నరు. లాక్‌డౌన్‌తో ఇళ్లు కదిలే వీలులేదు, ఇంట్లోనేమో సరుకులు నిండుకున్నయి. ఎలాగోలా బయటకు వెళ్లినా సూపర్ మార్కెట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నయి. పిల్లలు, వృద్ధులకు అవసరమైన మందులు కూడా దొరకట్లేదు. దీంతో కరోనా కేసులు పెరుగుతున్నయని సిటీలో లాక్‌డౌన్ పెట్టిన ప్రభుత్వంపై జనం మండిపడుతున్నరు. అవసరమైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ఇండ్లనుంచి బయటికి వచ్చే వీలులేకపోవడంతో కిటికీల దగ్గర, బాల్కనీలలో నిలబడి జిన్‌పింగ్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నరు. ఆవేదనతో పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నరు. వాటిని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అవికాస్తా వైరల్అవుతున్నయి. ఇదంతా చూసి అధికారులు డ్రోన్ల ద్వారా సిటీ ప్రజలకు మెసేజ్చేరవేస్తున్నరు. ‘మీ మనసును కంట్రోల్‌లో ఉంచుకోండి. స్వేచ్ఛ కోసం మీరు పడుతున్న ఆరాటాన్ని నియంత్రించుకోండి. కిటికీలు, బాల్కనీల దగ్గరకు వచ్చి పాటలు పాడకండి. మీరు ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది’ అని అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి షాంఘై సిటీలో లాక్‌డౌన్ విధించారు. ఒమిక్రాన్ వేరియంట్‌తో అక్కడ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో జీరో కొవిడ్ వ్యూహంలో భాగంగా షాంఘై సిటీతో పాటు చాలాచోట్ల లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు.
షాంఘైలో కొత్తగా 24,944 కేసులు
షాంఘైలో ఆదివారం ఒక్కరోజే 24,944 కొత్త కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. 11 వేల మందికి పైగా కోలుకున్నారని చెప్పారు. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు చైనాలో 1,79,000 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
మందులు, సరుకులు దొర్కుతల్లేవ్
కరోనాను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం విధించిన కఠిన చర్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దీని ఎఫెక్ట్‌తో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పి అల్లర్లు చెలరేగాయి. ఆహార పదార్థాల కోసం సూపర్ మార్కెట్లకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి, అందినకాడికి తీసుకుపోయారు. దాదాపు సిటీలోని అన్ని సూపర్ మార్కెట్లలో సరుకులు నిండుకున్నయ్. షాంఘైలో సామూహిక కరోనా పరీక్షలు నిర్వహిస్తుండటంతో డాక్టర్లపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇస్తూ ఓ డాక్టర్ ఐసోలేషన్‌లోనే కుప్పకూలడంతో మిగతా సిబ్బంది అతన్ని మోసుకెళ్తున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. షాంఘైలోని మొత్తం 2.6 కోట్ల మందికి సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించారు. అలాగే కరోనా సోకిన తల్లిదండ్రుల నుంచి వారి చిన్నారులను వేరుగా ఉంచుతున్నారు. పేరెంట్స్‌ను సెపరేట్‌గా క్వారంటైన్ చేస్తున్నారు.