- 3 రోజుల్లో 7 వేల మందికిపైగా పాజిటివ్
- టెస్టుల కోసం జనం బారులు
- వైరస్ బారిన ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీసులు, డాక్టర్లు, ఉద్యోగులు
- సెక్రటేరియట్‌ను కమ్మేసిన కేసులు.. ఇంటి నుంచే సీఎస్ డ్యూటీ
- రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 2,983 మందికి పాజిటివ్
హైదరాబాద్ / నెట్‌వర్క్, వెలుగు: కరోనా మళ్లా కమ్మేస్తున్నది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి మరింతగా ఎక్కువైంది. గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,477 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం 2,047 మందికి, సోమవారం 2,447 మందికి, మంగళవారం 2,983 మందికి పాజిటివ్ వచ్చింది. సెలవులకు సిటీలు, టౌన్ల నుంచి లక్షలాది జనం ఊర్లకు వెళ్లడం, ప్రయాణాల్లో, వేడుకల్లో కరోనా రూల్స్ పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. వైరస్ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో టెస్టుల కోసం జనం బారులు తీరుతున్నారు. మొన్నటిదాకా ఖాళీగా ఉన్న టెస్టింగ్ సెంటర్లు.. థర్డ్ వేవ్ దెబ్బకు ఇప్పుడు నిండిపోతున్నాయి. సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉన్న 2021 ఏప్రిల్, మే తర్వాత ఈ స్థాయి క్యూలైన్లు మళ్లీ ఇప్పుడే కనిపిస్తున్నాయని హెల్త్ స్టాఫ్ చెబుతున్నారు. 17న 80,138 మందికి టెస్టులు చేయగా, హైకోర్టు ఆదేశాలతో 18న లక్షకు పైగా టెస్టులు చేశారు.
తాత్కాలిక సెక్రటేరియట్ బీఆర్కే భవన్‌లో పదుల సంఖ్యలో ఉన్నతాధికారులు, సిబ్బందికి కరోనా సోకింది. పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్అండ్బీ సెక్రటరీ శ్రీనివాసురాజు, వైద్యారోగ్య శాఖ సెక్రటరీ ఎస్‌కే రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాస్ రావుకు పాజిటివ్ వచ్చింది. సీఎస్ సోమేశ్ కుమార్‌కు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన ఇంటి నుంచే వివిధ అంశాలపై రివ్యూ చేశారు. బీఆర్కే భవన్‌లో దాదాపు 42 మంది కరోనా వచ్చినట్లు తెలిసింది. జీఏడీ డిపార్ట్‌మెంట్‌లో ఏడుగురు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో నలుగురు, రెవెన్యూ శాఖలో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. ఎక్సైజ్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్లలోనూ అధిక సంఖ్యలో ఆఫీసర్లు కరోనా బారిన పడ్డారు. మరోవైపు హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వైరస్ సోకింది. దీంతో ఆఫీసుల్లో ఇప్పటికే ‘నో విజిటర్స్’ బోర్డులు పెట్టారు.
ఆఫీసులకు వస్తలే.. జూమ్‌లో మీటింగ్స్
కరోనా కేసులు పెరుగుతుండటంతో కొందరు ఉన్నతాధికారులు ఆఫీసులకు రావడం మానేశారు. ఏదైనా అర్జెంట్ ఫైల్ ఉంటే ఇంటికే తెప్పించుకుంటున్నరు. బీఆర్కే భవన్‌లో పాజిటివ్‌లు పెరగడం, మరికొంత మందికి స్వల్ప లక్షణాలు ఉండటంతో పలు విభాగాల్లో ఆంక్షలు విధించారు. సర్కార్‌కు సంబంధించిన ఇతర అంశాలు చర్చించేందుకు జూమ్‌లోనే మీటింగ్స్ పెడుతున్నరు.
పోలీస్‌శాఖలో 1,400 మందికి..
పోలీస్ శాఖలోనూ చాలా మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 1,400 మందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. భద్రాచలం సీఐతోపాటు 12 మంది పోలీసులకు, యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 12 మందికి, ఖమ్మం జిల్లాలో 15 మంది పోలీసులకు వైరస్ సోకింది. అలాగే కరీంనగర్‌లో పంచాయతీరాజ్ ఈఈతోపాటు పలువురు సిబ్బందికి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి కలెక్టరేట్లలో స్టాఫ్‌కు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీఓకు పాజిటివ్ వచ్చింది.
2,983 కొత్త కేసులు
రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 2,983 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,14,639కి పెరిగిందని హెల్త్ డిపార్ట్‌మెంట్ రిలీజ్ చేసిన బులెటిన్‌లో పేర్కొంది. కాగా, కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4,062కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం మొత్తం 1,07,904 మందికి టెస్టులు చేశామని, 13,895 టెస్టులకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
గాంధీలో 159 మంది.. అందరూ ఐసీయూలోనే
గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. సోమవారం సాయంత్రం దాకా 139 మంది ఉండగా.. మంగళవారం రాత్రికి 159కి చేరింది. ఇందులో 35 మంది ప్రెగ్నెంట్లు, నలుగురు చిన్నారులు, ముగ్గురు బ్లాక్ ఫంగస్ బాధితులు ఉన్నట్లు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. వీరంతా గాంధీలోని ఐసీయూ వార్డుల్లోనే ఉన్నారని, ప్రెగ్నెంట్స్, చిన్నారులు తప్ప మిగతా వారంతా వివిధ రకాల వ్యాధులతో బాధపడుతుతూ, సీరియస్ కండీషన్‌లో ఉన్నారని తెలిపారు. మెడికల్ కాలేజీలోని మైక్రో బయాలజీ ల్యాబ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు.
పాజిటివ్ లెక్కల్లో తేడా!
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో కేసులు, డెత్స్ సంఖ్యను సర్కారు దాచిపెట్టిందనే ఆరోపణలున్నాయి. నమోదైన కేసులు, బులెటిన్‌లో వెల్లడించిన కేసులకు సంబంధమే ఉండటం లేదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు థర్డ్ వేవ్‌లో కూడా సర్కారు కరోనా కేసులు దాస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య శాఖ రోజూ రిలీజ్ చేస్తున్న బులెటిన్‌లోని లెక్కలకు, జిల్లాల్లో నమోదవుతున్న కేసులకు పొంతన ఉండట్లేదు. ఉదాహరణకు నిజామాబాద్‌లో గడిచిన 48 గంటల్లో 866 కేసులు వచ్చినట్లు జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ బులెటిన్‌లో మాత్రం ఈ జిల్లాలో సోమ, మంగళవారాల్లో 131 కేసులు మాత్రమే వచ్చినట్లు చూపారు.----------------