- జూన్‌లో కరోనా కేసులు పెరుగుతయ్!
- ఆరోగ్య శాఖ అంచనా
- అప్రమత్తంగా ఉన్నామన్న డీహెచ్ శ్రీనివాసరావు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వచ్చే జూన్‌లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అంచనా వేసింది. గత 10 రోజుల్లో 0.15 శాతం ఉన్న పాజిటివిటీ రేటు.. 0.3 శాతానికి పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే జూన్ నాటికి కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో వచ్చినట్టుగా వేల సంఖ్యలో కేసులు వచ్చే అవకాశం లేదంటున్నారు. దీనిపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావును వివరణ కోరగా.. ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. జూన్ నాటికి కేసులు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఇప్పటికే అందరూ వ్యాక్సిన్ తీసుకోవడం, సుమారు 93 శాతం మందిలో యాంటిబాడీస్ ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో గురువారం 40 కరోనా కేసులు నమోదయ్యాయని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 14,662 మందికి టెస్టులు చేశామంది. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదని పేర్కొంది.