- కరోనా కేసులు, ఆంక్షల భయంతో వాయిదా వేసుకుంటున్న జనం
- ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్స్ క్యాన్సిల్
- వచ్చే నెల 2 నుంచి ముహూర్తాలు
- 50 వేల పెండ్లిళ్లు ఉన్నాయంటున్న పూజార్లు
హైదరాబాద్, వెలుగు: లగ్గాలు చేసుకునేటోళ్లకు, వాళ్ల పేరెంట్స్ కు కరోనా బుగులు పట్టుకుంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే బడులకు సంక్రాంతి సెలవులను ముందే ప్రకటించిన ప్రభుత్వం... వాటిని ఈ నెల 30 దాకా పొడిగించింది. కరోనా కట్టడికి మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. దీంతో చాలా మంది లగ్గాలు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే ఇచ్చిన ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈసారి పెండ్లిళ్లు పెద్ద ఎత్తున ఉండడంతో చాలామంది ఫంక్షన్ హాల్స్, డెకరేషన్, క్యాటరింగ్ తదితర అడ్వాన్స్ బుకింగ్ చేసుకోగా.. ఇప్పుడవన్నీ రద్దు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మళ్లీ ముహూర్తం కుదరకపోతే ఎట్లా? అని, ఎలాగోలా ఇప్పుడే చేసేయాలని భావిస్తున్నారు.
12 రోజులు ముహూర్తాలు...
ప్రస్తుతం పుష్య మాసం నడుస్తోంది. వచ్చే నెల 2 నుంచి మాఘ మాసం మొదలవుతుంది. మాఘ మాసంలో మస్తు పెండ్లిళ్లు జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు ముహూర్తాలు ఉన్నాయి.
ఆ నెల 2, 3, 4 , 5, 6, 10, 11, 12, 13, 16, 17, 18 తేదీల్లో లగ్గాలు ఉన్నాయి. ఈ రోజుల్లో దాదాపు 50 వేలకు పైగా పెండ్లీలు ఉన్నట్లు పూజారులు చెప్పారు. ఇవి దాటిపోతే మళ్లీ మార్చి 18 నుంచి 28 మధ్య మాత్రమే ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత ఉగాది, శ్రీరామనవమి పండుగలయ్యాకే ముహూర్తాలు ఉంటాయని, అంటే నెలన్నర దాకా లగ్గాలు ఉండవని పేర్కొన్నారు.
ఆంక్షల విధింపు!
దేశంలో, రాష్ట్రంలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు పెట్టాయి. వీకెండ్ లాక్ డౌన్, కర్ఫ్యూ విధించాయి. రాష్ట్ర సర్కార్ కూడా ఈ నెల 30 దాకా బడులను బంద్ పెట్టింది. ఫిబ్రవరి నుంచి కేసులు భారీగా నమోదవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తుండటంతో సోమవారం కేబినెట్ సమావేశం కానుంది. దీంతో రాష్ట్రంలో ఆంక్షలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భయంతోనే పేరెంట్స్ అయోమయంలో ఉన్నారు. పిల్లల లగ్గాలు చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. మళ్లీ పోయినేడాది పరిస్థితి వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. పోయినేడాది కరోనా ఆంక్షల కారణంగా పెండ్లీలకు పిల్ల తరఫున 10 మందికి, పిలగాని తరఫున 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.
బిజినెస్ కు మళ్లీ దెబ్బ...
కరోనాతో పోయినేడాది పెండ్లీల పరిశ్రమపై దెబ్బ పడింది. అందరూ లగ్గాలు వాయిదా వేసుకోవ డంతో రూ.కోట్ల నష్టం వచ్చింది. ఫంక్షన్ హాల్స్, డెకరేషన్, ఫొటోగ్రఫీ, క్యాటరింగ్ తదితర విభాగాలకు గిరాకీ లేకుండా పోయింది. షాపింగ్ మాల్స్, బంగారు దుకాణాల బిజినెస్ పడిపోయింది. లగ్గాలకు సంబంధించి వివిధ విభాగాల్లో పని చేసేటోళ్లు ఉపాధి కోల్పోయారు. కూలీ నుంచి మొదలు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, క్యాటరింగ్, డెకరేషన్ సిబ్బంది, ఈవెంట్ మేనేజర్ల వరకు అందరూ ఇబ్బందులు పడ్డారు. ఇటీవల జరిగిన పెండ్లీలతోనే వాళ్లకు కాస్త పని దొరికింది. ఇప్పుడు మళ్లీ పెద్ద ఎత్తున లగ్గాలు ఉండగా, అవి వాయిదా పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.
డైలమాలో ఉన్నరు..
వచ్చే నెల మాఘ మాసం కావడంతో 2 వ తేదీ నుంచి 18 వరకు ముహూర్తాలు ఉన్నాయి. దాదాపు 50 వేలకు పైగా మంది లగ్గాలు పెట్టుకున్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ డైలమాలో పడ్డారు. ఆంక్షలు పెడితే లగ్గాలు వాయిదా వేసుకుంటామని కొందరు అంటున్నారు. మరికొందరు వేచి చూస్తున్నారు.
- డాక్టర్ ఎంఎన్ చార్య, పండితుడు