హైదరాబాద్, వెలుగు: కరోనా కేసులు, మరణాల విషయంలో రాష్ట్ర సర్కార్ చెప్తున్న తప్పుడు లెక్కలతో వేలాది కుటుంబాలు మరింత నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. కొవిడ్‌తో పెద్ద దిక్కును కోల్పోయి, ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కుటుంబాలకు సాయం అందకుండా పోయేలా ఉంది. కరోనాతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరిహారం ఎంత ఇస్తారో నిర్ణయించి, ఆరు వారాల్లోగా గైడ్‌లైన్స్ విడుదల చేయాలని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న కరోనా మృతుల లెక్కల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కలిపి సుమారు 50 వేలకు పైగా మరణాలు నమోదైనట్టు డెత్ రికార్డులు చెప్తున్నాయి. కానీ, ఇప్పటివరకూ 3,669 కరోనా మరణాలే నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఒకవేళ ఈ లెక్కల ఆధారంగానే కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తే, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత పడే చాన్స్ ఉంది.
డెత్ సర్టిఫికెట్లు ఇయ్యలే
రాష్ట్రంలో కొన్ని వేల చావులను కరోనా మరణాలుగా సర్కార్ గుర్తించలేదు. 50 వేల మంది కరోనాతో చనిపోతే.. 3,669 మందే చనిపోయినట్టు చెప్తోంది. డెత్ సర్టిఫికెట్లలోనూ కొవిడ్ డెత్ అని గాకుండా.. న్యూమోనియా, హార్ట్ ఎటాక్ అంటూ వేరే కారణాలను పేర్కొంది. వృద్ధులకు నార్మల్ డెత్ అని రాశారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో ‘కార్డియాక్ అరెస్ట్ డ్యూ టు కొవిడ్’, ‘న్యుమోనియా డ్యూ టు కొవిడ్’ అని రాసినా.. మున్సిపాలిటీ వాళ్లు న్యుమోనియా, కార్డియాక్ అరెస్ట్ అని రాసి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇలాంటి వాటితో కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాలను బాధితులు పొందలేకపోతున్నారు. స్మైల్ పథకం కింద కరోనా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సబ్సిడీ లోన్లు ఇవ్వడం కేంద్రం స్టార్ట్ చేసింది. ఈ లోన్లు పొందడానికి కరోనాతో చనిపోయినట్టుగా ఉన్న డెత్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలి. దీంతో డెత్ సర్టిఫికెట్లలో ‘కరోనాతో చనిపోయినట్లు’ లేకపోవడంతో బాధితులు దవాఖాన్లు, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
సరిదిద్దుకునే చాన్స్ ఉంది
కరోనా డెత్స్ లెక్కలను సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ సహా పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోని కరోనా మరణాల లెక్కలను పలుమార్లు సవరించాయి. వేల మరణాలు యాడ్ చేశాయి. ఇందుకు ప్రత్యేకంగా కారణాలేవీ పేర్కొనాల్సిన అవసరం లేదు. ఇదంతా నష్ట పరిహారంపై కేంద్రం గైడ్‌లైన్స్ ఇవ్వడానికి ముందే జరగాలి. గైడ్‌లైన్స్ ఇచ్చిన తర్వాత లెక్క మార్చినా కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవచ్చని ఆఫీసర్లు చెప్తున్నారు. డెత్ సర్టిఫికెట్లలో మార్పులకు అవకాశం ఇవ్వొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోనూ ఈ అంశాన్ని పేర్కొంది. కరోనా వచ్చిన తర్వాత రెండు మూడు నెలలకు చనిపోయినా కరోనా మరణంగానే పేర్కొనాలని సుప్రీం సూచించింది. ఇప్పటికైనా మన సర్కార్ స్పందిస్తే చాలా కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది.
నిరుడు నుంచి పెరిగిన మరణాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో 2017 నుంచి 2019 వరకూ మూడేండ్లలో సగటున ఏడాదికి 55,791 మరణాలు నమోదయ్యాయి. గతేడాది నుంచి మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 2020లో 76,375 మంది చనిపోయారు. ఈ ఏడాది తొలి ఆరునెలల కాలంలోనే 47,472 మరణాలు నమోదైనట్లు జీహెచ్ఎంసీ డెత్ రిపోర్ట్స్‌లో తెలుస్తోంది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 1,55,405 మరణాలు రికార్డు అయితే, గతేడాది 1,87,643 మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది మరణాల సంఖ్య లక్ష దాటినట్టు సమాచారం. అకస్మాత్తుగా ఈ స్థాయిలో మృతుల సంఖ్య పెరగడానికి కరోనా మరణాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఈ లెక్కన రాష్ట్రంలో కరోనాతో 50 వేల నుంచి 57 వేల మంది చనిపోయినట్టు ఒక అంచనా.
కేసీఆర్.. ఇగోను పక్కనపెట్టు
ఎన్ని కోమార్బిడిటీస్ ఉన్నప్పటికీ కొవిడ్ పాజిటివ్‌తో ఎవరు చనిపోయినా, నెగిటివ్ వచ్చి కరోనా లక్షణాలతో చనిపోయినా దానిని కరోనా మరణంగానే చూడాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అతిక్రమించింది. కరోనాతో రాష్ట్రంలో లక్షన్నర మంది చనిపోతే, 3,600 మంది చనిపోయినట్టు దొంగ లెక్కలు చెప్తోంది. దీంతో బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందకుండా పోయేలా ఉంది. కేసీఆర్ తన ఇగోను పక్కనబెట్టి, కొవిడ్ మరణాల అసలు లెక్కలు బయట పెట్టాలి. బాధితులకు న్యాయం జరిగేలా.. కరోనాతో చనిపోయిన వ్యక్తుల డెత్ సర్టిఫికెట్లను వారి కుటుంబ సభ్యులకు అందజేయాలి.
- దాసోజు శ్రవణ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి