కరోనా క్లీనింగ్‌కు ఎల్ఈడీ మెషిన్
ఫ్లోర్ శుభ్రత కోసం ఐఐటి- గౌహతి తయారీ
ప్రస్తుతం ఆల్కహాల్ కలిసిన క్లీనర్లతో తుడిపిస్తున్నారు
కొత్త మెషీన్ వస్తే సర్ఫేస్ క్లీనింగ్ ఈజీ
రూ. వెయ్యికే ఇవ్వాలని ప్లాన్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకకుండా ఎవళ్లమూ బయటకు పోకుండా జాగ్రత్తలు పడుతున్నం, మంచిగనే ఉంది. కానీ, మెటల్ మీద, బట్టల మీద, రెయిలింగుల మీద కరోనా వైరస్ పడితే కొన్ని గంటల వరకు పోదు. బతికే ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా కరోనా ఉన్న వస్తువుల్ని, ఇనుప కడ్డీలు, సీకులు, అక్కడి నేలను తాకితే అంటుకుని సతాయిస్తది. ప్రాణం మీదకు తెస్తది. దీనికోసం ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేస్తూ ఉండాలి. వీపుకు పెద్ద సైజ్ బకెట్ లాంటిది తగిలించుకుని యాంటీ వైరస్ ద్రవాల్ని స్రే చేయాలి. మాన్యువల్‌గా ఇది చాలా పెద్ద ప్రాసెస్.
ఈ బెడద లేకుండా గౌహతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)వాళ్లు ఒక మెషీన్ కనిపెట్టారు. దీన్ని వాడడానికి మనుషులు అక్కర్లేదు. రోబోలు నడిపిస్తాయి. ఈ కొత్త మెషీన్‌కి పేటెంట్ కోసం అప్లికేషన్ కూడా పెట్టారు. మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో చెప్పడం లేదుగానీ, చాలా చవకలో వెయ్యి రూపాయలకే అందిస్తామని మాత్రం చెబుతున్నారు.
కర్నాటక ప్రభుత్వం కోరడంతో ఈ మెషిన్ తయారు చేశారు. దీనిలో ఉండే ఎల్ఈడీ లైటు ద్వారా హాస్పిటళ్లను, బస్సులు, ఇతర చోట్లను యాంటీ వైరస్ గా మార్చవచ్చు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ వార్తలే. పరిసరాల్ని శుభ్రంగా ఉంచాలంటే శానిటైజేషన్ తప్పనిసరి. లాక్ డౌన్ ముగిసేనాటికి వైరస్ ప్రభావం తగ్గిపోయినా గానీ, ఒకసారి లాక్ డౌన్ తొలగించినట్లయితే జనాలు మునుపటిలాగే రోడ్లపైకి వచ్చేస్తారు. ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లేవాళ్లతో పరిసరాలన్నీ ఎప్పటిలాగే తయారవుతాయి. వైరస్ పూర్తిగా లేకుండా చేయాలంటే నిరంతరం శానిటైజేషన్ చేస్తుండాలి.
‘ప్రస్తుతానికి గోడలపైనా, రెయిలింగ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లోనే శానిటైజేషన్ జరుగుతోంది. నేలమీద సైంటిఫిక్ పద్ధతిలో డిఇన్ఫెక్షన్ కావడం లేదు. ఆల్కహాల్ కలిసిన క్లీనర్లతో మనుషులతో తుడిపిస్తున్నారు’ అని ఐఐటీ–గౌహతిలోని కెమికల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ సెంథిల్ మురుగన్ సుబ్బయ్య చెప్పారు.
ఈ పద్ధతిలో సరైన ఫలితం రాదని, దీనికోసం తాము అల్ట్రావయొలెట్ క్లీనింగ్ (యూవీసీ) సిస్టమ్ ద్వారా మైక్రోఆర్గాన్లనూ శానిటైజ్ చేయొచ్చని అన్నారు. ‘యూవీసీ సిస్టంలోని అల్ట్రావయొలెట్ లైట్ 200–280 నానోమీటర్ల తరంగాలతో పనిచేస్తుంది. ఇది నీళ్లు, నేల, గాలి, ఆహార పదార్థాల్లో దాగిన హానికారక మైక్రో–ఆర్గానిజంలను నిర్వీర్యం చేసేస్తుంది. యూవీసీ ద్వారా ఎక్కువ కాలం అంటుకుపోయి ఉండే ఎంఎస్–2 కాలిఫేజ్ వైరస్ లాంటిదాన్ని 186 జె డోస్ ద్వారా చంపేయవచ్చు. కొవిడ్–19 వైరసుకి అంత డోస్ అక్కరలేదు. ఇది రోజుల తరబడి ఉండే వైరస్ కాదు. ఇనఫ్లూయెంజా వైరసు లాంటిదే కాబట్టి 36 జె డోస్ సరిపోతుంది’ అన్నారు. ఐఐటీ–గౌహతి టీమ్ తయారుచేసిన యూవీసీ ఎల్ఈడీ సిస్టం ద్వారా 400 జె డోసుని 30 సెకన్ల పాటు వాడొచ్చు. ఎక్కడా రంధ్రాలు లేని ఉపరితలాలపై, ఫ్లోరింగ్ తదితర నున్నటి ప్రదేశాల్లో వైరస్ పడితే అలాగే నిలిచిపోతుంది. దాన్ని తొలగించడానికి అనువుగా యూవీసీ సిస్టంని డిజైన్ చేశారు. ఉపరితలం అంతా ఎల్ఈడీ వెలుగు ప్రసరిస్తుంది.
దీనికి ఇప్పటికే ఇనిస్టిట్యూట్‌లో ల్యాబ్ టెస్టులన్నీ పూర్తి చేశారు. శరీరంపై ఈ లైట్ పడినా హాని కలగకుండా ఆబ్జెక్ట్ మూవ్మెంట్ ఐడెంటిఫికేషన్ ఫీచర్ కూడా అమర్చారు. కదిలే వస్తువులపై ఈ సిస్టమ్ పనిచేయదన్నమాట. ‘కొవిడ్–19 లేకుండా చేయాలంటే చవుకలో ఇది అందరికీ అందుబాటులోకి రావాలి. దాని కోసం ప్రభుత్వ సంస్థలతో, ఇండస్ట్రీలతో కలిసి పనిచేస్తున్నాం’ అని సుబ్బయ్య తెలిపారు.
For More News..