వ్యాక్సిన్ వచ్చే దాకా వైరస్ పోదంటున్న సైంటిస్టులు
లాక్డౌన్ పెట్టకుండానే కొన్ని దేశాల్లో మహమ్మారి కట్టడి
లాక్డౌన్ పెట్టినా పలు దేశాల్లో కంట్రోల్కాని కరోనా
ఎకానమీకి ఇబ్బంది లేకుండా కట్టడి చర్యలుండాలని సూచన
కరోనా వచ్చి తొమ్మిది నెలలయితున్నది. మహమ్మారి సమజ్ అయితున్నట్టే అనిపించినా.. సమజ్ కాని సవాళ్లెన్నింటినో మన ముందుంచుతోంది. రెండేండ్ల దాకా వైరస్ మనతోనే ఉంటదని సైంటిస్టులు అంటున్నరు. వ్యాక్సిన్ ఎప్పుడొస్తదో తెలియదు. అదొచ్చేదాకా వైరస్ పోదంటున్నరు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందే.. కానీ, జనాలకు తక్లీఫ్ రాకుండా ఆ చర్యలుండాలె. ఆ విషయంలో కొన్ని దేశాలు సక్సెస్ అయ్యాయి. కొన్ని దేశాలు నష్టపోయాయి. ఒక్కటా.. రెండా.. ఇట్ల చాలా విషయాల్లో కరోనాపై క్లారిటీ రావట్లేదు. ఆ విషయాలనే బ్రిటన్ సర్కారుకు సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీలో సభ్యుడైన లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ ప్రొఫెసర్ ఆడమ్ కుచాస్కి వివరించారు.
కరోనా మహమ్మారి కోరలు చాచి తొమ్మిది నెలలవుతోంది. దానిని కంట్రోల్ చేయడానికి దేశాలు ఎన్నెన్నో చర్యలు తీసుకున్నాయి. మందులు, వ్యాక్సిన్లపై ముందడుగులు పడ్డాయి. దాంతో పాటే దాని వెనక ఇంకా తెలియని మిస్టరీలున్నాయి. జనాల ప్రాణాలు తీస్తున్న మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. వ్యాక్సిన్ వచ్చినా ఒకేసారి వేసుకోవాలా.. ఏటేటా వేసుకోవాలా అన్న దానిపైనా క్లారిటీ లేదు. ఆ విషయాలపైనే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ ప్రొఫెసర్ ఆడమ్ కుచాస్కి మాట్లాడారు. టెడ్‌టాక్‌లో కరోనా గురించి తెలిసిన ఐదు పాయింట్లు.. తెలియాల్సిన ఇంకో ఐదు విషయాలను వివరించారు.
తెలిసినవి
ఫ్రమ్ చైనా వయా యూరప్.. చాలా దేశాలకు వైరస్ చైనా నుంచి నేరుగా రాలేదు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు ఇటలీ, స్పెయిన్ నుంచి వ్యాపించింది. జెనెటిక్ డేటాతో ఇది తేలింది.
గాలి నుంచీ అంటుతది.. మనిషి నుంచి మనిషికి కరోనా సోకుతుందని ముందుగా అంచనా వేశారు. కానీ గాలి ద్వారా కూడా సోకుతుందని తర్వాతి స్టడీల్లో తేలింది.
లాక్డౌన్ లేకుండానే కట్టడి.. సౌత్‌కొరియా, హాంకాంగ్ వంటి దేశాలు లాక్డౌన్ పెట్టకుండానే వైరస్‌ను కట్టడి చేశాయి. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్తోనే అది సాధ్యమైంది.
పెద్ద దేశాలకూ ముప్పే.. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో అమెరికా, బ్రిటన్ టాప్–2లో ఉండేవి. ఆ రెండు దేశాల్లోనూ కేసులు ఎక్కువగా వచ్చాయి.
కట్టడి చర్యలు లేకుంటే సీన్ రివర్స్.. కరోనా కేసులు తక్కువగా ఉన్న టైంలో చాలా దేశాల్లోని జనం లైట్ తీసుకున్నారు. నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో సీన్ రివర్స్ అయింది.
తెలియాల్సినవి
లక్షణాల్లేనోళ్ల నుంచి సోకుతదా.. సోకదా! పిల్లలు, కొంత మంది యువతలో కరోనా లక్షణాలు ఉండట్లేదు. వాళ్ల నుంచి కరోనా సోకుతుందో లేదో అన్న విషయం ఇప్పటికీ మిస్టరీనే.
కాంటాక్ట్ అయినా సోకట్లె.. ఎందుకు? కరోనా పేషెంట్లను కాంటాక్ట్ అయిన చాలా మందికి వైరస్ సోకట్లేదు. ఎందుకన్న దానిపై క్లారిటీ లేదు. స్టడీ చేస్తేగానీ ఆ విషయం తేలదు.
కొందరికే ఎక్కువ రిస్కా?.. వయసు పరంగా చూసినా, ఆరోగ్యపరంగా చూసినా.. కొందరిలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. మహమ్మారి తీవ్రతను పెంచే జీన్స్ కారణమని అనుమానం.
జనాలకు ఇబ్బంది లేకుండా కట్టడి ఎట్ల!.. లాక్డౌన్ వల్ల పేదలు చాలా ఇబ్బంది పడ్డారు. మరి, ఎకానమీకి నష్టం లేకుండా, జనం ఇబ్బంది పడకుండా కట్టడి ఎట్ల చేయాల్నో ఆలోచించాలి.
ఇమ్యూనిటీ ఎప్పటిదాకా?.. కరోనా సోకినోళ్లలో ఇమ్యూనిటీ ఎప్పటిదాకా ఉంటుందో తెలియట్లేదు. వ్యాక్సిన్ ఒకేసారి వేసుకోవాలా? ఏటేటా వేసుకోవాల్నా అన్న దానిపై క్లారిటీ లేదు.
సైంటిస్టులు తెలుసుకున్నవి
ఫ్రం చైనా వయా యూరప్
మొదట్లో చాలా దేశాలు.. కరోనా వైరస్ చైనా నుంచే అందరికీ అంటిందని అనుకున్నాయి. అయితే చైనాలోనే పుట్టినా.. యూరప్ మీదుగా ప్రపంచమంతా పాకిందని వైరస్ జెనెటిక్ డేటా తేల్చింది. వైరస్ జీన్స్‌ను తీసుకొని అది ఎక్కడి నుంచి వచ్చింది.. ఏయే దేశాల్లో ఉంది.. ఎప్పుడు ఎంటరైందన్న విషయాలను స్టడీ చేశారు. బ్రిటన్‌కు ఆ వైరస్ వచ్చింది ఇటలీ, స్పెయిన్ నుంచి అని తేల్చారు. ఇటలీ, స్పెయిన్‌లో కేసులు బయటపడడానికన్నా ముందే బ్రిటన్‌లో ఫస్ట్ కేసులొచ్చాయి. అంటే, అప్పటికే ఆ రెండు దేశాల్లో పాగా వేసిన మహమ్మారి.. బ్రిటన్ బాట పట్టింది. అమెరికా న్యూయార్క్‌లోనూ అంతే. ఫిబ్రవరి మొదట్లో యూరప్ దేశాల నుంచే అమెరికా లైన్ దాటింది వైరస్. వేటినీ అంచనా వేయకుండానే ఆసియా నుంచే వచ్చిందని అనుకున్నారు.
గాలి నుంచీ అంటుతది
వైరస్ సోకిన మొదట్లో చాలా దేశాల్లో చేతులు కడుక్కోవడం, శానిటైజర్ల వాడకం, ఎడం పాటించడం వంటి వాటిపైనే ఫోకస్ పెట్టాయి. అవన్నీ అవసరమే. మరి గాలి మాటేంటి? ముఖ్యంగా మీటింగ్ రూంలు, కాన్ఫరెన్స్ హాళ్ల పరిస్థితేంటి? అవన్నీ క్లోజ్డ్ పరిసరాలు. ఆ ప్లేస్‌లలో గాలిలో ఉండే ఏరోసోల్స్‌తో వైరస్ సోకుతది. ముందుగా ఎవరూ దానిని ఊహించలేకపోయారు. జర్మనీలో అలాంటి ఒక కేసు బయటపడేదాకా దాన్నెవరూ పట్టించుకోలేదు. కాన్ఫరెన్స్ హాల్లో 13 మందితో సమావేశమైన ఆ వ్యక్తి వల్ల.. 11 మందికి కరోనా అంటింది. అంతేకాదు, గాల్లో వైరస్ 7 నుంచి 17 అడుగుల దాకా వెళుతుందన్న విషయం ఓ హాస్పిటల్ స్టడీలో తేలింది. మొదట్లో ఆరడుగుల ఎడం పాటిస్తే చాలనుకున్నాం. ఇప్పుడు 17 అడుగుల వరకు పోతుందన్నాక జాగ్రత్తగా ఉంటున్నాం.
లాక్డౌన్ లేకుంటనే కట్టడి
కరోనా వచ్చిందని తెలియగానే చాలా దేశాలు లాక్డౌన్లు పెట్టేశాయి. ఇంట్లనే ఉండాలన్న రూల్స్పాస్ చేశాయి. అదే చాలా పెద్ద తప్పు. కానీ, లాక్డౌన్లు ఏమీ లేకుండానే మహమ్మారిని కంట్రోల్ చేయొచ్చని సౌత్‌కొరియా, హాంకాంగ్ వంటి దేశాలు నిరూపించాయి. ఆ దేశాల్లోనూ లాక్డౌన్ పెట్టినా.. ఫుల్‌గా పెట్టలేదు. జనాలు బయట తిరిగారు. మాస్కులు పెట్టుకున్నారు. ఇంట్ల నుంచే పని చేశారు. ఓ టైం ప్రకారం జిమ్ములు, బార్లు, రెస్టారెంట్లు, స్కూళ్లను మూశారు. కరోనాకు ముందు టైమంతా కాకున్నా.. ఆ రెండు దేశాల్లో జనాలు సరదాగా గడిపారు. ఆ దేశాలు తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైంది. ముందు ముందే కేసులను గుర్తించడం, వాళ్లను కాంటాక్ట్ అయిన వాళ్ల జాడ పట్టడం, టెస్టులు చేయడంతో కేసులు ఎక్కువగా పెరగలేదు.
పెద్ద దేశాలకు ఎక్కువ ముప్పు
కరోనాను అధికారికంగా ప్రకటించినప్పుడు చైనాలోనే కేసులు ఎక్కువగా ఉండేవి. కానీ, జస్ట్ మూడు నాలుగు నెలల్లోనే సీన్ రివర్స్ అయింది. పెద్ద పెద్ద దేశాలు చైనాను దాటేశాయి. ప్యాండెమిక్ ప్రిపేర్డ్నెస్పై పోయినేడాది విడుదల చేసిన గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ర్యాంకుల్లో అమెరికా, బ్రిటన్లు ఫస్ట్ రెండు ర్యాంకులను సాధించాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాలు కరోనా కేసుల్లో టాప్ టెన్‌లో ఉన్నాయి. వైరస్ తీరుతో పాటు వివిధ దేశాలు హెల్త్‌కేర్ సెక్టర్పై అమలు చేస్తున్న విధానాలూ దానికి కారణం కావొచ్చు. అమెరికా, బ్రిటన్నే తీసుకుంటే.. పబ్లిక్ హెల్త్ ఫండింగ్‌ను కట్ చేశాయి. దీంతో కరోనా పోరులో వెనకబడ్డాయి. సార్స్, మెర్స్ అనుభవాలతో ముందే అప్రమత్తమైనసౌత్కొరియా, తైవాన్, సింగపూర్ వంటి దేశాలు సక్సెస్ అయ్యాయి.
కట్టడి చర్యలు లేకుంటే రివర్స్
మే, జూన్ నెలల్లో చాలా దేశాల్లో కేసులు, మరణాలు బాగా తగ్గిపోయాయి. మహమ్మారి ఖతం అయిందని జనం అనుకున్నారు. నిర్లక్ష్యం చేశారు. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ప్రవర్తించారు. అదే అన్ని అనర్థాలకు కారణమైందని సైంటిస్టులు తేల్చారు. ప్రపంచం మొత్తం మీద అదే పరిస్థితి ఉందని తేల్చి చెప్పారు. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, అమెరికా, స్పెయిన్.. ఇంకా చాలా దేశాల్లో జనం కరోనాను లైట్ తీసుకున్నారు. గుంపులుగుంపులుగా పార్టీలు చేసుకున్నారు. కనీస జాగ్రత్తలు పాటించలేదు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కరోనా కోరలు చాచింది. కేసులు పెరిగాయి. మరణాలూ ఎక్కువ అవుతున్నాయి. అందుకే కట్టడికి తీసుకుంటున్న చర్యలను కంటిన్యూ చేయాల్సిందే. లేకపోతే
సీన్ రివర్స్ అయితది.
ఇంకా తెలియనివి
లక్షణాల్లేనోళ్ల నుంచి అంటదా?
చిన్న పిల్లల నుంచి టీనేజర్లు, కొంత మంది యువతలో లక్షణాలు ఉండట్లేదు. వాళ్ల నుంచి కరోనా ఎంత వరకు సోకుతుందనే విషయం ఇప్పటికీ మిస్టరీనే. ఆ మిస్టరీని తేల్చాలంటే కరోనా సోకిన వాళ్లను ముందు గుర్తించాలి. వాళ్లకు వైరస్ ఎలా సోకిందన్నది తేల్చాలి. వాళ్లకు లక్షణాలు లేకుంటే గుర్తించడం చాలా కష్టమే అవుతుంది. ప్రపంచ దేశాలన్నింటిలోనూ మహమ్మారి వచ్చిన మొదట్లోనే స్కూళ్లన్నింటినీ బంద్ పెట్టారు. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో స్కూళ్లు తెరుస్తున్నారు. మిగతా దేశాల్లోనూ ఓపెన్ చేయాలనుకుంటే.. స్టూడెంట్లందరికీ రీసెర్చర్లు టెస్టులు చేయాలి. వాళ్లను మానిటర్ చేయాలి. దాని వల్ల ఏం జరుగుతోందో.. స్టూడెంట్లు, టీచర్లు, ఫ్యామిలీ మెంబర్లు, ఇతర క్లోజ్ కాంటాక్ట్స్‌కు వైరస్ వ్యాప్తి ఎలా అవుతోందో తెలుసుకునేందుకు వీలుంటుంది.
కాంటాక్ట్ అయినా సోకట్లె.. ఎందుకు?
కొంత మంది వైరస్ వచ్చిన వాళ్లతో కాంటాక్ట్ అయినా కూడా కరోనా సోకట్లేదు. అలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. దానికి కారణమేంటో ఇప్పటికీ తెలియలేదు. అప్పటికే ఉన్న ఇమ్యూనిటీనే వైరస్‌తో ఫైట్ చేస్తున్నదా.. అన్నదానిపైనా క్లారిటీ లేదు. ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలంటే వివిధ గ్రూపులకు చెందిన జనాల్లో ఇమ్యూనిటీలక్షణాలపై స్టడీ చేయాలి. కరోనా సోకిన వాళ్లు, కరోనా సోకని వాళ్ల నమూనాలను టెస్ట్ చేయాలి. ప్రస్తుతం అలాంటి స్టడీలు జరుగుతున్నాయి. అయితే, కరోనా పేషెంట్లతో కాంటాక్ట్ అయిన కొంతమందికి వైరస్ ఎందుకు సోకట్లేదో తేలాలంటే ఇంకొంత టైం పడుతుంది.
కొందరికే రిస్క్ ఎక్కువా?
ఇప్పటిదాకా ఉన్న కేసులను చూస్తే.. కేసుల తీవ్రత వయసుపైనే ఆధారపడినట్టు తెలుస్తోంది. పెద్ద వయసున్నోళ్లపైనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అయితే, వయసు పరంగా చూసినా.. ఆరోగ్యంగా ఉన్నా.. కొందరిలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. కొందరికి ఉండట్లేదు. దానికి కారణమేందో తెలియలేదు. ఇదివరకే వేరే రకం కరోనా వైరస్‌లకు గురికావడం కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, గుండె జబ్బులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లకు ముప్పు ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇతర వైరస్‌లతో పోలిస్తే.. జెనెటిక్ కారణాలు, బయోలాజికల్ కారణాలూ కొందరికి ముప్పును పెంచుతుండొచ్చు. కొందరిలో కరోనా తీవ్రతను పెంచే జీన్స్ ఉండి ఉండొచ్చు. దాని వల్ల డైరెక్ట్‌గా లేదంటే ఇన్‌డైరెక్ట్‌గా వైరస్ సివియారిటీ పెరుగుతుండొచ్చు.
ఇబ్బంది లేకుండా కట్టడి ఎట్లా?
లాక్‌డౌన్‌తో చాలా దేశాల్లో జనాలపై ఆర్థిక, సామాజిక భారాలు పెరిగిపోయాయి. ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు. మరి, పేదలకు నష్టం కలగకుండా, లాక్డౌన్ పెట్టకుండా ఎకానమీ పుంజుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎప్పటిదాకా తీసుకోవాలి? ఇండియా, సౌతాఫ్రికా వంటి దేశాల్లో రెండు నెలల కిందటే లాక్డౌన్లు ఎత్తేశారు. ఎకానమీ గాడి తప్పడం, ప్రజల ఉపాధి పోతుండడంతో ఆ నిర్ణయం తీసుకోకతప్పలేదు. న్యూజీలాండ్ వంటి ఐసోలేటెడ్ దేశం బార్డర్లను క్లోజ్ చేసినా తట్టుకుని ఎలా నిలబడిగలిగింది.. యూరప్, దక్షిణాసియా లాంటి ఇంటర్నేషనల్ ట్రేడ్, మైగ్రేషన్ మీద ఆధారపడిన దేశాలు ఎందుకు భారీగా ప్రభావితం అయ్యాయి వంటి అంశాలపైనా దృష్టి పెట్టాలి.
ఇమ్యూనిటీ ఎప్పటిదాకా ఉంటది?
జలుబు, సీజనల్ ఫ్లూలు వచ్చి పోతుంటాయి. వాటిపై మన ఇమ్యూనిటీ కొద్ది రోజులే ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? వస్తే సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అన్న దానిపై స్టడీ చేయాలి. ఇప్పటిదాకా రీఇన్ఫెక్షన్ కేసులు వచ్చింది చాలా చాలా తక్కువ. ఇండియా వంటి దేశాల్లో ఇప్పటికే షార్ట్ టర్మ్ ఇమ్యూనిటీ వచ్చింది. దాని వల్ల భవిష్యత్‌లో వచ్చే ప్యాండెమిక్లను ఎదుర్కొనేందుకు వీలుంటుంది. అంతా బాగానే ఉన్నా.. ఆ ఇమ్యూనిటీ ఎన్నాళ్లుంటుందన్న ప్రశ్నకు ప్రస్తుతం జవాబు లేదు. వ్యాక్సిన్ తయారీకి ఈ విషయం కూడా ఇంపార్టెంటేనా? మీజిల్స్ వ్యాక్సిన్లాగా కొన్నేళ్ల పాటు ఇమ్యూనిటీ ఇచ్చే కరోనా వ్యాక్సిన్లు వస్తాయా? లేదా ఫ్లూ వ్యాక్సిన్ లాగా ఏటేటా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనా? వంటి ప్రశ్నలకూ సమాధానాల్లేవు.
For More News..