- కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆంక్షలు
- దేశంలో ఒక్కరోజే 1.31 లక్షల కొత్త కేసులు
- వైరస్ బారిన పడి మరో 780 మంది మృతి
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ బాట పట్టాయి. ప్రస్తుతం 8 రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో రాత్రి 8 నుంచి పొద్దున 7 గంటల వరకు ఆంక్షలున్నాయి. అలాగే శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం పొద్దున 7 గంటల వరకు వీకెండ్ లాక్‌డౌన్ కూడా ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ఏప్రిల్ 6 నుంచి 30వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ పెట్టారు. రాత్రి 10 నుంచి పొద్దున 5 గంటల వరకు ఆంక్షలు విధించారు.
రాజస్థాన్‌లో ఏప్రిల్ 19 వరకు..
రాజస్థాన్‌లోనూ ఏప్రిల్ 19 వరకు నైట్ కర్ఫ్యూ పెట్టారు. రాత్రి 8 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లను బంద్ చేశారు. పంజాబ్‌లో 12 జిల్లాల్లో రాత్రి 9 నుంచి పొద్దున 5 వరకు కర్ఫ్యూ అమలవుతోంది. రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు పొలిటికల్ కార్యక్రమాలను పూర్తిగా నిషేధించారు. ఒడిశాలోని 10 జిల్లాల్లో రాత్రి 10 నుంచి పొద్దున 5 గంటల వరకు కర్ఫ్యూ పెట్టారు.
గుజరాత్‌లోని 20 సిటీల్లో..
గుజరాత్ ప్రభుత్వం 20 నగరాల్లో ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ పెట్టింది. రాత్రి 8 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పింది. కర్నాటకలోని బెంగళూరు, మరో ఆరు నగరాల్లో కూడా ఏప్రిల్ 10 నుంచి 20వ తేదీ వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఆర్గనైజేషన్లలో నైట్ డ్యూటీలకు అనుమతి ఉందని, అయితే రాత్రి 10 గంటల లోపు ఎంప్లాయీస్ డ్యూటీకి చేరుకోవాలని చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో ఏప్రిల్ 17 వరకు రాత్రి 10 నుంచి పొద్దున 5 గంటల దాకా కర్ఫ్యూ పెట్టారు.
దేశంలో యాక్టివ్ కేసులు 9.79 లక్షలు
దేశంలో వరుసగా మూడో రోజూ లక్షకు పైనే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,31,968 మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 56,286 కేసులు నమోదయ్యాయి. తర్వాత చత్తీస్‌గఢ్‌లో 10,652, యూపీలో 8,474 కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం 9.79 లక్షల యాక్టివ్ కేసులున్నాయని, దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ఇవి 7.5 శాతమని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. రికవరీ రేటు 91.22గా ఉందని చెప్పింది. వైరస్ నుంచి ఇప్పటివరకు 1.19 కోట్ల మంది కోలుకున్నారంది. గత 24 గంటల్లో 61 వేల మంది రికవర్ అయ్యారని తెలిపింది.
ఇప్పటివరకు 25.4 కోట్ల శాంపిల్స్ పరీక్ష
వైరస్ బారిన పడి ఒక్కరోజే 780 మంది చనిపోయారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 376 మంది మరణించారు. ఆ తర్వాత చత్తీస్‌గఢ్‌లో 94, పంజాబ్‌లో 56, ఉత్తరప్రదేశ్‌లో 39, కర్నాటకలో 36, గుజరాత్‌లో 35, మధ్యప్రదేశ్‌లో 27, ఢిల్లీలో 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 1.67 లక్షలకు చేరాయి. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 25.4 కోట్ల శాంపిల్స్ టెస్టు చేశారు. శుక్రవారం 13.64 లక్షల శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు 9.43 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేసినట్టు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో 36 లక్షల మందికి టీకాలు వేశామంది.
లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర
మహారాష్ట్రలో పరిస్థితులు మారకపోతే లాక్‌డౌన్ పెట్టే అవకాశం ఉందని ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపె చెప్పారు. ‘మనం లాక్‌డౌన్ దిశగా వెళ్తున్నాం. కానీ అలాంటి పరిస్థితి రాదనే అనుకుంటున్నా. వైరస్‌ను కట్టడి చేయగలమనే భావిస్తున్నా. సర్కారు చేయ్సాలిందల్లా చేస్తోంది’ అన్నారు. ‘లాక్‌డౌన్‌కు మేం అనుకూలం కాదు. కానీ హాస్పిటళ్లు నిండిపోతే.. మెడిసిన్స్, డాక్టర్ల షార్టేజ్ ఏర్పడితే, పరిస్థితి చేయి దాటి పోతోందనిపిస్తే లాక్‌డౌన్ ఒక్కటే మార్గం’ అని వివరించారు. ‘వైరస్ చైన్‌ను బ్రేక్ చేయడమే లాక్‌డౌన్ ఉద్దేశం. కనీసం 2 నుంచి 3 వారాలు లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి’ అని అన్నారు.