ప్రభుత్వ బడి అయినా, ప్రైవేటు బడి అయినా టీచర్లు చేసే పని ఒక్కటే. కానీ ప్రైవేట్ టీచర్ల జీతాలు ప్రభుత్వ టీచర్ల కంటే చాలా తక్కువగా ఉంటున్నాయి. ఒక్క జీతాల్లోనే కాదు ఇంకా ఎన్నో అంశాల్లో ప్రైవేట్ టీచర్లు చాలా వెనుకబడి ఉన్నారు. చాలా ప్రైవేటు స్కూళ్లు వేసవి సెలవులను మినహాయించి ఏడాదికి పది, పదకొండు నెలలకే జీతం ఇస్తాయి. నెలకు ఒకే క్యాజువల్ లీవ్ తప్ప మరే సెలవులు ఉండవు. ‘ప్రావిడెంట్ ఫండ్’ కు సగం డబ్బులు మేనేజ్ మెంటే కట్టాలి కనుక చాలా యాజమాన్యాలు సిబ్బందికి పీఎఫ్ ను అమలు చేయట్లేదు. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, మెటర్నిటీ/పెటర్నిటీ లీవ్ వంటి ప్రయోజనాలేవీ ప్రైవేట్ టీచర్లకు ఉండవు. అన్నింటికీ మించి ఉద్యోగ భద్రత అసలే ఉండదు. ప్రైవేట్ స్కూళ్లన్నీ ఎలాగైతే ఒకేలా ఉండవో, వారి టీచర్ల జీతాలు కూడా ఒకేలా ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు మూడు వేలకు పనిచేసే టీచర్లు ఉన్నారు. హైదరాబాద్ లో ఇరవై, ముప్పై వేలకు పనిచేసే టీచర్లు ఉన్నారు. ఇంకా మేనేజ్మెంట్ పాలసీ, వారు కలెక్ట్ చేసే ఫీజు, టీచర్ బోధించే సబ్జెక్టులను బట్టి ప్రైవేట్ టీచర్ జీతం ఆధారపడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ లెక్కల ప్రకారం 2019–--20 లో తెలంగాణలో దాదాపు 3 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు.
ప్రైవేట్ టీచర్లపై కరోనా దెబ్బ
రాష్ట్ర ప్రభుత్వం 1994 లో జారీ చేసిన జీవో నం.1 ప్రకారం ప్రైవేట్ బడులకు వచ్చిన ఆదాయంలో 5 శాతామే యాజమాన్యం ‘లాభం’గా తీసుకొని, 50 శాతం ఆదాయాన్ని టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాల కోసం, 15 శాతం టీచర్లకు పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి వాటి కోసం, మిగిలిన 30 శాతం ఆదాయాన్ని పాఠశాల నిర్వహణ, అభివృద్ధికి ఖర్చు చేయాలి. కానీ ఆ జీవో రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అమలు చేయడం లేదు. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేట్ మేనేజ్మెంట్ల లాభాపేక్షే కారణం. ప్రభుత్వం పట్టించుకోక ప్రైవేట్ టీచర్లు చాలీచాలని జీతాలతో భారమైన జీవితాలు గడుపుతున్నారు. ఇక కరోనా ఎఫెక్ట్‌తో వారి బతుకులు మరింత దారుణంగా మారాయి. కరోనాతో ప్రైవేటు స్కూళ్లు మూతపడి ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరోవైపు ఆన్లైన్ పాఠాలు చెప్పే టీచర్లకు సగం జీతమే ఇస్తున్నారు. దీంతో చాలా మంది టీచర్లు కుటుంబ పోషణ కోసం ఏ పని దొరికితే ఆ పని చేస్తున్నారు. మన రాష్ట్రంలో జూన్ 2021 వరకు కరోనా వల్ల ఉపాధి కరువై సుమారు 41 మంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి, ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ప్రైవేట్ టీచర్ కు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం పంపిణీకి పూనుకొంది. అయితే అది 3 నెలల ముచ్చటే అయింది. అయితే ఈ సాయానికి కూడా చాలా మంది నోచుకోవడం లేదు.
జూనియర్ కాలేజీల్లోనూ అంతే
ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2019–-20 రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 70 వేల మంది ప్రైవేట్ జూనియర్, డిగ్రీ లెక్చరర్లుగా, మరో 70 వేల మంది ఇంజనీరింగ్ వంటి వివిధ ప్రైవేట్ వృత్తి విద్యా కాలేజీల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. అధికంగా ఫీజులు వసూలు చేసే కొన్ని కార్పొరేట్ జూనియర్ కాలేజీలు వారి లెక్చరర్లకు కొంత మంచి జీతాలు ఇస్తున్నాయి. ఐఐటీ/నీట్ కోచింగ్ ఇచ్చే వారికి మాత్రం భారీ వేతనాలున్నాయి. ఇక రూరల్, చిన్న కాలేజీల్లో పనిచేసే వారి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. కరోనా వల్ల చాలా మంది లెక్చరర్లు ఉద్యోగాలు కోల్పోయారు. కాలేజీలు కూడా కొద్ది మంది లెక్చరర్లతోనే ఆన్ లైన్ క్లాసులు నడిపించి ఖర్చులు తగ్గించుకున్నాయి.
ఉన్నత విద్యా సంస్థల్లో నో రూల్స్
ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లో పనిచేసే లెక్చరర్లు, ప్రొఫెసర్లకు రూల్స్ ప్రకారం వేతనాలు అందడం లేదు. రూల్స్ అమలును పర్యవేక్షించడంలో యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ, నాక్ వంటి స్వతంత్ర సంస్థలుఫెయిల్ అవుతున్నాయి. చాలా ప్రైవేట్ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ పట్టాతో ఫ్రెషర్ గా జాయిన్ అయ్యే లెక్చరర్లకు రూ.50వేల లోపే వేతనాలు ఉంటున్నాయి. రాష్ట్రంలో చాలా ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజు- రీయింబర్స్ మెంట్ తీసుకుంటూ కూడా స్టూడెంట్ల నుంచి భారీ మొత్తంలో అదనపు ఫీజులు వసూలు చేస్తాయి. అయినా తమ లెక్చరర్లకు మాత్రం సరిగా జీతాలు ఇవ్వడం లేదు. ఇలాంటి వాటిలో రాజకీయ నాయకులు, వారి బంధువులకు సంబంధించినవి ఎక్కువగా ఉండడంతో వాటిపై ఎన్ని ఫిర్యాదులు అందినా ఎలాంటి చర్యలు ఉండడం లేదు. కొన్ని మత సంస్థలు, సేవా సంస్థలు నడిపే కాలేజీలు మాత్రం జీతాలు సరిగా చెల్లిస్తున్నాయి.
గొంతెత్తలేని పరిస్థితి
కరోనా కష్టకాలంలో టీచర్లను/లెక్చరర్లను జాబ్‌లోంచి తీసేయడం, ఉన్న వారికి జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం ప్రైవేట్ యాజమాన్యాల్లో న్యాయం, సామాజిక స్పృహ ఎంతమేరకు ఉన్నాయో ఇట్టే అవగతం అవుతుంది. ప్రైవేట్ యాజమాన్యానికి నిజంగా వారి సిబ్బందిపై ప్రేమ ఉంటే వారికి జీతాలు ఆపకుండా వారి సంక్షేమం కోరుకునేవారు. విలువలు నేర్పే ఆధునిక దేవాలయాలైన విద్యా సంస్థల్లోనే విలువలు కొరవడితే ఇక రాబోయే తరాల నుంచి ఏం ఆశిస్తాం? ఎంతో ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారెందరో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారు ఆ వృత్తిలోకి ప్రవేశించడమే మహాపరాధం అయింది. కరోనా వల్ల వారి పరిస్థితి దుర్భరమైంది. దేశంలో ప్రైవేట్ టీచర్లు/లెక్చరర్లకు విలువే లేకుండాపోయింది. ప్రైవేట్ టీచర్లు/లెక్చరర్లకు ఉద్యోగ భద్రత లేకపోవడం, యూనియన్లు లేకపోవడం, ఏ విధమైన హక్కులు లేకపోవడం వారిని గొంతెత్తకుండా చేస్తున్నాయి.
ప్రభుత్వం ఏం చేయాలంటే..
విద్యా వ్యాపారం తగ్గి, సేవా కోణంలో దాన్ని అందించినప్పుడే ప్రైవేటు టీచర్లకు న్యాయం జరుగుతుంది. ప్రైవేట్ మేనేజ్మెంట్లలో ‘నైతిక బాధ్యత’ పెరగాలి. లేబర్ చట్టాలు టీచర్లకు వర్తించవంటారు. మనసుంటే మార్గముంటుంది. ప్రభుత్వ టీచర్/లెక్చరర్/ప్రొఫెసర్లకు ఆకర్షణీయ వేతనంతోపాటు, పీఎఫ్ లాంటి ఎన్నో ప్రయోజనాలు అందుతున్నప్పుడు, ప్రైవేట్ టీచర్లకు అవి ఎందుకు అందడంలేదు? చేసే పని ఒక్కటే అయినప్పుడు జీతాల్లో తేడాలెందుకు? ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు మంచి వేతనాలు ఇస్తే ‘వాల్యూ బేస్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్’ సాధ్యమవుతుందని విద్యావేత్తలు, మేధావులు, పొలిటికల్ లీడర్లు చెప్పే సాహసం ఎందుకు చేయట్లేదు? ప్రభుత్వం సరిగ్గా వ్యవహరిస్తే ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు వస్తుంది. వివిధ స్థాయిల్లో పనిచేసే ప్రైవేట్ టీచర్లకు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ‘సమాన పనికి సమాన వేతనాలు’ అందించడంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ, నాక్ వంటి వాటికి అధికారాలు ఇవ్వాలి. ప్రైవేట్ టీచర్ ఏ రోజైతే తల ఎత్తుకొని గర్వంగా బతుకుతాడో అప్పుడే టీచర్ల బతుకులకు సార్థకత ఉంటుంది. అప్పుడే ప్రైవేట్ టీచర్లు/లెక్చరర్లు మానసికంగా దృఢంగా ఉండి, మరింత అంకిత భావంతో పనిచేస్తారు.
డా. శ్రీరాములు గోసికొండ, అసిస్టెంట్ ప్రొఫెసర్