ప్రైవేటు ల్యాబుల్లో తప్పుడు రిజల్ట్స్

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాసరావు
ఎట్ల చేస్తున్నరో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నం
ప్రైవేటు హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్యపై ఇన్ఫర్మేషన్ లేదు
వాటిలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు
జనం రూల్స్ పాటించట్లేదు.. ఇంకా కేసులు పెరుగుతాయి
కరోనా కంటే ఆకలితోనే ఎక్కువమంది చనిపోతున్నారని కామెంట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కొన్ని ప్రైవేటు ల్యాబుల్లో కెపాసిటీకి మించి టెస్టులు చేస్తున్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఇది ఎలా సాధ్యమవుతోందో తమకు తెలియదని, అలా చేయడాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. కెపాసిటీకి మించి టెస్టులు చేయడం వల్ల వైరస్ లేకున్నా ఉన్నట్టు, ఉన్నా లేనట్టు రిజల్ట్ వస్తోందన్నారు. హైదరాబాద్లోని కోఠిలో ఉన్న ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డితో కలిసి శ్రీనివాసరావు శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ల్యాబులు చాలా తప్పులు చేసినప్పటికీ.. ప్రజలకు సేవలను దూరం చేయొద్దన్న ఉద్దేశంతోనే వాటిపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. మొత్తం 13 ప్రైవేటు ల్యాబుల్లో అసాధారణంగా టెస్ట్‌‌‌‌ రిపోర్టులు వచ్చాయని.. హిమాయత్‌ నగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ ల్యాబులో అయితే టెస్టు చేసుకున్నవారిలో 70 శాతం మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఇంతపెద్ద మొత్తంలో మరే ల్యాబ్లోనూ పాజిటివ్ రేట్ లేదని చెప్పారు. అందుకే ఆ ల్యాబ్లో పాజిటివ్ వచ్చిన 2,672 కేసులను ప్రకటించకుండా హోల్డ్‌‌‌‌లో పెట్టామని.. వాటిని ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. తప్పులు చేసిన ల్యాబ్లకు నోటీసులు ఇచ్చామని, దాంతో చాలా ల్యాబులు అవసరమైన మార్పులు చేసుకున్నాయని వివరించారు. ఇకపైనా తప్పు చేసే ల్యాబులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

హాస్పిటళ్లలో ఏం జరుగుతోందో తెల్వదు
ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనా కోసం ఎన్ని బెడ్లను కేటాయించారో తమ వద్ద సమాచారం లేదని శ్రీనివాసరావు తెలిపారు. పేషెంట్లు ఫోన్లు వాడేందుకు ప్రైవేటు హాస్పిటళ్లు అనుమతించడం లేదని, అక్కడ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. పేషెంట్లు ఒంటరిగా కుంగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫోన్లు అనుమతిస్తున్నామని చెప్పారు. కరోనా వస్తే ప్రైవేట్‌ ‌‌‌హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఎంత మందికైనా ట్రీట్ మెంట్ అందించేందుకు ప్రభుత్వ హాస్పిటళ్లను సిద్ధం చేశామని తెలిపారు.

ప్రజలు నిబంధనలు పాటించట్లే..
లాక్‌‌‌‌డౌన్ సడలింపుల వల్ల గత నెలలోనే 13,534 కరోనా కేసులు నమోదయ్యాయని శ్రీనివాసరావు అన్నారు. కేసులు ఇలాగే పెరుగుతాయని హెచ్చరించారు. కరోనాను ప్రభుత్వం సృష్టించలేదని, ప్రభుత్వం మాత్రమే దాన్ని కంట్రోల్ చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసేది చేస్తున్నా.. చాలా మంది జనం మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ రూల్స్ పాటించడం లేదని తప్పుపట్టారు. ఇకనైనా జనం జాగ్రత్తలు తీసుకుని, మళ్లీ లాక్‌‌‌‌డౌన్‌ ‌‌‌వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. కరోనాతో కంటే ఆకలితోనే ఎక్కువ మంది చనిపోతున్నారని కామెంట్ చేశారు. కరోనా విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని.. మరణాలు, కేసులు అన్నింటినీ ప్రకటిస్తున్నామని చెప్పారు. టెస్టింగ్ కెపాసిటీ కూడా పెరుగుతోందని, రోజుకు 5 వేల శాంపిల్స్ తీసుకుంటున్నామని చెప్పారు.

పాజిటివ్ ఉంటెనే గాంధీకి రావాలె
కరోనా పాజిటివ్ వ్యక్తులు మాత్రమే గాంధీ హాస్పిటల్‌‌‌‌కు రావాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం గాంధీలో 812 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారని, ఏడుగురు మాత్రమే వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. ఇంకో వెయ్యి బెడ్లకు పైగా ఖాళీగా ఉన్నాయన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు కింగ్ కోఠికి వెళ్లాలని, అక్కడ 350 బెడ్లు సిద్ధం చేశామని చెప్పారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌కు వెళ్లాలన్నారు. సర్కారు దవాఖాన్లు 24 గంటలూ తెరిచే ఉంటాయని, బెడ్లు లేవని వెనక్కి పంపించే ప్రసక్తే ఉండదని తెలిపారు. మంచి ట్రీట్మెంట్ ఇస్తామని, రెండ్రోజుల్లో టిమ్స్‌‌‌‌ను కూడా ప్రారంభిస్తున్నామని చెప్పారు.

For More News..

హైదరాబాద్ విడిచి సొంతూళ్లకు బాట

మావల్లే మీ భర్త చనిపోయాడు.. మమ్మల్ని క్షమించు!

కరోనాపై పోరులో తెలుగు రాష్ట్రాల మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్!