డోర్‍ టు డోర్‍ ప్రచారం చేసిన.. నీ కాళ్లు మొక్కుతా బతికించన్నా

‘‘అన్నా.. నీ కాళ్లు మొక్కుతా వినయన్నా.. నావల్ల అయితలేదు అన్న.. ఈ ఒక్కసారి బతికించు అన్న.. కనీసం ఎంజీఎంలో అన్న పడేయ్‍ అన్నా.’’ అంటూ  గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ ఎన్నికల టీఆర్‍ఎస్‍ ప్రచారంలో పాల్గొని కరోనా బారినపడ్డ కార్యకర్త అడ్డగట్ల ఆంజనేయులు ఏడుస్తూ శనివారం రాత్రి సోషల్‍ మీడియాలో పెట్టిన పోస్ట్  వైరలైంది. వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‍ విప్‍ వినయ్‍భాస్కర్‍ సూచన మేరకు ప్రచారంలో పాల్గొంటే తీరా కొవిడ్ ​వచ్చాక ఏ ఒక్కరూ తనను పట్టించుకోవడంలేదని వీడియోలో ఆవేదన చెందారు. ‘‘అన్నా వినయన్నా.. మొన్నటి వరంగల్‍ మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ డివిజన్‍ టీఆర్‍ఎస్‍ క్యాండిడేట్‍ తరఫున డోర్‍ టు డోర్‍ తిరిగిన అన్నా.. ఈ గతొచ్చిందన్నా.. ఎవరి కోసం తిరిగానో ఆ విద్యాసాగర్‍ వస్తనేలేడు.. నా ప్రాణం ఉంటదో పోతదో అర్థం కావట్లేదు.. ఎంజీఎంలో ఒక వెంటిలేటర్‍ ఇప్పియ్యండి.. మీ కాళ్లు మొక్కుతా.. నా భార్య పిల్లలు ఆగమైతాళ్లు.. పదిరోజులబట్టి చస్తున్నా.. అవి ఇవి అమ్మి హాస్పిటల్లో రెండున్నర లక్షలు కట్టినా. ఇప్పుడు నా దగ్గర స్తోమత లేదు.. ట్రీట్‍మెంట్‍ ఆపేసిన్రు.. అన్నా వినయన్న.. వెంటిలేటర్‍ ఇప్పియ్యండన్నా.. జర తొందరగా చేయండన్నా’’ అంటూ వేడుకున్నాడు.


వరంగల్‍ రూరల్‍, వెలుగు: రాష్ట్రంలో కరోనా సెకండ్‍ వేవ్‍ కోరలు చాస్తున్నా పట్టించుకోకుండా నిర్వహించిన మున్సిపల్‍ ఎలక్షన్స్ వేలాది మంది చావుకొచ్చింది. గ్రేటర్‍ ప్రచారంలో తిరిగినవారిలో ఇప్పటికే పలువురు మృతిచెందగా, వేలాది​ కేడర్‍ ఇప్పుడు హాస్పిటల్స్, హోం క్వారంటైన్‍లో ఉన్నారు. బాధితుల్లో అధికార టీఆర్‍ఎస్‍ పార్టీవారే 90 శాతం ఉన్నారు. ఎలక్షన్స్ పూర్తయిన  గ్రేటర్‍ వరంగల్‍, ఖమ్మం కార్పొరేషన్‍తో పాటు మిగతా ఐదు మున్సిపాలిటీల్లో.. వందల మంది ఆసుపత్రుల్లో  బెడ్లు, ఆక్సిజన్‍, వెంటిలేటర్ల కోసం ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. కాగా, నిన్నమొన్నటి వరకు భుజం మీద చేయివేసి ‘నీకు నేనున్నాను..’ అంటూ మాట్లాడిన అలాంటి లీడర్లంతా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. 
పది రోజుల్లో వేలల్లో కేసులు
కరోనా కేసుల విషయం మాట్లాడుకుంటే.. మున్సిపల్‍ ఎన్నికలకు ముందు, తర్వాత అన్నట్లుగా పరిస్థితి ఉంది. వరంగల్‍ సిటీలో.. ఒక్కో డివిజన్​లో ప్రచారానికి ముందు డైలీ ప్రతి 100 టెస్టుల్లో 10 పాజిటివ్‍  కేసులు రాగా, ఇప్పడది 50కి చేరింది. ఈ లెక్కన గడిచిన పది రోజుల్లోనే ఒక్కో డివిజన్​లో 500 పైగా కొవిడ్‍  కేసులు వస్తున్నాయి. టెస్టుల సంఖ్య పెరిగినకొద్దీ  కేసులు పెరుగుతున్నాయి.  గ్రేటర్‍ వరంగల్​కార్పొరేషన్‍లో మొత్తం 66 డివిజన్లున్నాయి. ఖమ్మం కార్పొరేషన్‍లోనూ 60 డివిజన్లు ఉన్నాయి. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు 2 వేల  కేసులు సిటీలోనే పెరిగినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. 
కార్పొరేటర్లు, కమిషనర్‍కు పాజిటివ్‍
గ్రేటర్​వరంగల్‍, ఖమ్మం కార్పొరేషన్‍ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 12 మంది కార్పొరేటర్లు కరోనా బారినపడ్డారు. వరంగల్​లో కార్పొరేటర్లు బొంగు అశోక్‍ యాదవ్‍, విజయలక్ష్మి,  తూర్పాటి సులోచన, గద్దె బాబు,  ఓని స్వర్ణలత,  ఫుర్ఖాన్‍, ఎం.రవి, గుండు చందన,  సర్తాజ్‍బేగం, ఖమ్మంలో  మరో ముగ్గురు కార్పొరేటర్లకు కరోనా అటాక్‍ అయింది. వారంతా వర్చువల్‍ పద్ధతిలో ఆన్ లైన్‍ సిస్టంలో శుక్రవారం ప్రమాణం చేశారు. అధికారులు దీనికి కావాల్సిన ఎల్‍ఈడీ  స్క్రీన్లను ఏర్పాటు చేశారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍ సత్పతి పమేలా ఎన్నికల ఏర్పాటు డ్యూటీల్లో చురుగ్గా పాల్గొన్నారు. తీరా.. ఢిల్లీ పబ్లిక్‍ స్కూల్‍లో పోలింగ్‍ కౌంటింగ్‍ జరుగుతున్న టైంలో ఆమెకు కరోనా పాజిటివ్‍ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె హన్మకొండలోని ఓ ప్రైవేట్‍ హాస్పిటల్ లో ట్రీట్‍మెంట్‍ తీసుకుంటున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‍ సైతం కరోనా కారణంగా హోం ఐసోలేషన్‍లో ఉండి మేయర్‍ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనలేదు.  లైబ్రరీ చైర్మన్‍, కొత్తగూడెం మున్సిపల్‍ చైర్మన్‍ కాపు సీతాలక్ష్మి సైతం కొవిడ్‍ బాధితుల లిస్ట్ లో ఉన్నారు.
దిక్కుతోచని స్థితిలో కేడర్​
 ప్రచారంలో నిన్నమొన్నటి వరకు ‘అంతా నువ్వే తమ్మీ'..అని మాట్లాడిన ఎమ్మెల్యేలు, గెలిచిన కార్పొరేటర్లు.. తమకు కరోనా సోకిందని తెలిశాక స్పందించకపోవడంపై క్యాడర్​ కన్నీరు పెడుతున్నారు. వైరస్‍ ముదరడంతో ఒక్కో డివిజన్​లో 20 నుంచి 30 మందికి హాస్పిటల్స్ లో బెడ్లు దొరకట్లేదు. అందులో 10 మంది వరకు ఆక్సిజన్‍ లేదంటే వెంటిలేటర్‍ అవసరం పడుతోంది. కరోనా బారినపడ్డ గులాబీ లీడర్లు, కార్పొరేటర్లు సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ట్రీట్‍మెంట్‍ తీసుకొంటుండగా.. వారి కోసం పనిచేసిన తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. నిన్నటివరకు వారికివారుగా ఫోన్లు చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తాము ఫోన్‍ చేస్తే కాల్‍ కట్‍ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొవిడ్‍ రూల్స్.. ఉత్త ముచ్చటే
కరోనా సెకండ్‍ వేవ్‍ సీరియస్‍గా ఉన్న నేపథ్యంలో మున్సిపల్‍ ఎలక్షన్స్  వద్దంటూ జనాలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు రిక్వెస్ట్ చేశాయి. అయినా ఈసీ ప్రభుత్వ సూచన మేరకే నడుచుకుంది. హడావుడి నోటిఫికేషన్‍, నామినేషన్ల ప్రక్రియ చేపట్టింది. ప్రచారానికి వారం గడువిచ్చింది. కొవిడ్‍ రూల్స్ ప్రకారం ఐదుగురు మించి జనాలు కాన్వాసింగ్‍లో లేకుండా చూసుకోవాలని ఎలక్షన్​ ఆఫీసర్లు చెప్పారు. కొవిడ్‍ రూల్స్ ఫాలో అయితేనే సభలు, సమావేశాలకు పర్మిషన్‍ ఇస్తామన్నారు. కాగా గ్రౌండ్​లెవల్​లో ఇవేం కనిపించలేదు. ఫైనల్‍గా జనాలు అనుకున్నట్లే కరోనా పబ్లిక్‍ ప్రాణాలతో ఆటాడుకుంటోంది.
కామిద్రి రాజేందర్‍. వరంగల్​లో గులాబీ పార్టీ నియోజక వర్గస్థాయి లీడర్‍. గ్రేటర్‍ కార్పొరేషన్‍ ఎన్నికల్లో టీఆర్‍ఎస్‍ క్యాండిడేట్ల కోసం 10 రోజులు ప్రచారంలో తిరిగాడు. ఒంట్లో కొంత తేడా కనిపించడంతో కరోనా టెస్ట్ చేపిస్తే పాజిటివ్‍ వచ్చింది. బ్రీతింగ్‍ ప్రాబ్లం వచ్చి  స్ట్రోక్‍ అటాక్‍ చేయడంతో కన్ను మూశాడు. కాగా, ఇదే ప్రచారంలో పాల్గొన్నోళ్లు టెస్టులు చేయించుకుంటే సగం కంటే ఎక్కువ మందికి పాజిటివ్‍ వచ్చింది. హన్మకొండ 54 డివిజన్​లో ఓ పార్టీ తరఫున రెగ్యులర్​గా ఓ వంద మంది ప్రచారం చేశారు. నాలుగైదు రోజుల క్రితం ఇందులో ఓ 50 మందికి టెస్టులు చేయగా.. 40 మందికి పాజిటివ్‍ వచ్చింది. డివిజన్​లోని లీడర్లంతా ఇప్పుడు హోమ్‍ క్వారంటైన్​లో ఉన్నారు.