- ఆస్పత్రుల్లో చేరికలు తక్కువున్నయ్: కేంద్రం
- 10 రాష్ట్రాల్లోనే 77 శాతం యాక్టివ్ కేసులు
- కేసులు 6 రాష్ట్రాల్లో పెరుగుతున్నయ్, 6 రాష్ట్రాల్లో తగ్గుతున్నయ్
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొదట్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.1 ఎక్కువగా వ్యాప్తి చెందగా, ఇప్పుడు మరో సబ్ వేరియంట్ బీఏ.2 ఎక్కువగా వ్యాపిస్తోందని తెలిపింది. ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుంటే.. మరో ఆరు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. అయితే వైరస్ తీవ్రత ఎక్కువగా లేదని, 90% మంది ఇంట్లోనే కోలుకుంటున్నారని చెప్పింది. చాలా తక్కువ మందే ఆస్పత్రుల్లో చేరుతున్నారని పేర్కొంది. కరోనా పరిస్థితిపై గురువారం ఢిల్లీలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతమున్న యాక్టివ్ కేసుల్లో 77% 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. గత డిసెంబర్ లో 1,292 ఒమిక్రాన్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా గుర్తించామని, జనవరిలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,672కు చేరిందని వెల్లడించారు.
ఆ మూడు రాష్ట్రాల్లో డెల్టా..
కర్నాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని లవ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, హర్యానా, పశ్చిమ బెంగాల్ లో మాత్రం తగ్గుతున్నాయని చెప్పారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో డెల్టా కేసులు నమోదవుతున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్ చెప్పారు. ఢిల్లీలో కరోనాతో చనిపోయిన వాళ్లలో 64 శాతం మంది టీకా వేస్కోనోళ్లు, కోమార్బిడిటీస్ ఉన్నోళ్లేనని పేర్కొన్నారు.
కొత్త కేసులు 2.86 లక్షలు
దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 4.03 కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వైరస్ తో మరో 573 మంది చనిపోయారని, మొత్తం మృతుల సంఖ్య 4,91,700కు చేరిందని తెలిపింది. యాక్టివ్ కేసులు 22,02,472కు తగ్గాయని, ఇవి మొత్తం కేసుల్లో 5.46 శాతమని చెప్పింది. డైలీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేటు 17.75 శాతానికి పెరిగిందని, రికవరీ రేటు 93.33 శాతానికి తగ్గిందని, డెత్ రేటు 1.22 శాతంగా నమోదైందని వివరించింది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 163.84 కోట్ల టీకా డోసులను వేసినట్లు వెల్లడించింది.