ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,916 మందికి కరోనా పాజిటివ్ రాగా, ఈ ఒక్క రోజులో 43 మంది కరోనా కారణంగా మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. తాజా నమోదైన కేసుల్లో 1,908 మంది లోకల్స్ కాగా, 8 మంది ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,019కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,424 మంది, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు 432 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,467 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 15,144 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నాలుగు రోజుల్లో 100 మరణాలు
ఏపీలో క్రమంగా కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కారణంగా 43 మంది మరణించారు. అనంతరపురం జిల్లాలో పది మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, చిత్తూరు, కడప, తూర్పు గోదావరి జిల్లాలో ఐదుగురు చొప్పున కరోనాతో మృతిచెందారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 408కి చేరింది. గట్టిగా నాలుగు రోజుల్లోనే కరోనా మరణాల సంఖ్య దాదాపు 100 పెరగడం ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ నెల 11న ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 309గా ప్రకటించింది. ఇవాళ (14న) ఉదయం 10 గంటల బులిటెన్‌లో ఈ మరణాల సంఖ్య 408కి చేరింది.