- మసాలాలతో కరోనాకు చెక్
- యూనివర్సిటీల అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు : కరోనా వ్యాప్తి.. మరణాలకు, స్పైసెస్ వినియోగానికి మధ్య సంబంధం ఉందని మన సైంటిస్టులు చేసిన అధ్యయనంలో తేలింది. ఇండియన్ల కంటే తక్కువ స్పైసెస్ వినియోగించే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని ఈ స్టడీ పేర్కొంది. అలాగే ఇండియా కంటే ఎక్కువ స్పైసెస్ వినియోగించే పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ తదితర దేశాల్లో ఇండియా కంటే తక్కువ స్థాయిలో కరోనా ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ముంబైలోని డీవై పాటిల్ ఆయుర్వేదిక్ యూనివర్సిటీ, పుణెలోని భారతీయ విద్యాపీఠ్ యూనివర్సిటీలు కలిసి చేసిన స్టడీ రిపోర్టును ప్రముఖ హెల్త్ జర్నల్ మెడ్రిక్స్ 14న పబ్లిష్ చేసింది. వివిధ దేశాలు, భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో స్పైసెస్ వినియోగాన్ని లెక్కించారు. ఆయా దేశాలు, రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసులు, స్పైసెస్ వినియోగానికి లింక్ చేస్తూ.. స్టడీ చేశారు. స్పైసెస్ వినియోగానికి, కరోనా వ్యాప్తి, మరణాల రేట్, రికవరీ రేటుకు మధ్య సంబంధం ఉందని సైంటిస్టులు చెప్పారు. కరోనా బారినపడకుండా అల్లం అడ్డుకుంటుందని, రికవరీ అయ్యేందుకు ఎల్లిపాయ యూజ్ అవుతుందని పేర్కొన్నారు.
జీలకర్రతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట!
ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్‌గా రెస్పాండ్ (సైటోకైన్ స్టార్మ్) కాకుండా అల్లం, ఎల్లిపాయ వంటివి ఇన్‌ఫ్లమేటరీ మెడిసిన్‌గా పని చేస్తాయని స్టడీలో తేలినట్టు పేర్కొన్నారు. జీలకర్ర ఎక్కువగా వినియోగించిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చింతపండు ఎక్కువగా వాడిన ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఉన్నట్లు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో చింతపండు వాడకం ఎక్కువగా ఉండగా, లక్షద్వీప్‌లో వినియోగించరు. చింతపండు తినే రాష్ట్రాలతో పోలిస్తే లక్షద్వీప్‌లో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడ కరివేపాకు, యాలకులు, లవంగాలు ఎక్కువగా యూజ్ చేస్తారని, అవి కరోనా నుంచి రక్షణ కల్పించి ఉండొచ్చన్నారు. దేశంలో 52 రకాల సుగంధ ద్రవ్యాలు పండిస్తుండగా.. ప్రధానంగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పసుపు, నల్ల మిరియాలు, మిర్చి, చింతపండు వాడకం ఎక్కువగా ఉంటుంది.