ఐదుగురి శాంపిల్స్ కలిపి ఒకే టెస్ట్
పాజిటివ్ వస్తే వేర్వేరుగా టెస్టులు
నెగిటివ్ వస్తే.. ఐదుగురికీ నెగిటివ్ వచ్చినట్లే
సీసీఎంబీలో ప్రారంభం..
తొలి రోజు 30 పూల్స్ టెస్టులు
ఈ మెథడ్ తో టెస్టింగ్ కిట్లు, టైం, మనీ ఆదా
హైదరాబాద్, వెలుగు: కరోనా అనుమానితులకు పూలింగ్ మెథడ్లో టెస్టులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమానితుల్లోఎక్కువ మందికి నెగిటివ్ వస్తున్న జిల్లాల్లో తొలుత ఈ మెథడ్ ను అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 12 జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు రాష్ట్ర హెల్త్ మినిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జిల్లాల నుంచి వచ్చిన 150 శాంపిల్స్ ను 30 పూల్స్‌గా మార్చి సోమవారం సీసీఎంబీ వైరాలజీ ల్యాబ్‌లో టెస్టు చేశారు.
ప్రతి వంద టెస్టుల్లో ఐదు లేదా అంతకంటే తక్కువ పాజిటివ్స్ నమోదవుతున్న జిల్లాల్లోనే పూలింగ్ మెథడ్ చేపట్టాలని ఐసీఎంఆర్ సూచించింది. ఇందుకు అనుగుణంగా.. పాజిటివ్‌రేట్ తక్కువగా ఉన్న జనగామ, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట,
యాదాద్రి భువనగిరి, ములుగు, మంచిర్యాల, వరంగల్‌రూరల్, నారాయణపేట జిల్లాల్లో పూల్‌టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జిల్లాల్లో సోమవారం నుంచి పూల్ టెస్టులు మొదలయ్యాయి.
ఏంటీ లాభం..?
పూల్ టెస్టింగ్ తో టెస్టింగ్ కిట్లు, టైం ఆదా అవుతుంది. టెస్టింగ్ ల్యాబ్‌లో పనిచేసే టెక్నీషియన్లు, డాక్టర్లకు శ్రమ తగ్గుతుంది. ప్రస్తుతం ఒక్కో వ్యక్తి శాంపిల్‌ను వేర్వేరుగా టెస్ట్ చేస్తున్నారు. ఒక్కో శాంపిల్ టెస్టు చేయడానికి ప్రభుత్వానికి సుమారు రూ. 3 వేలు ఖర్చు అవుతోంది. అంటే, ఐదుగురి శాంపిల్స్ టెస్ట్ చేయడానికి రూ. 15 వేలు ఖర్చు అవుతాయి. అదే పూలింగ్ మెథడ్‌లో ఐదు శాంపిల్స్ కలిపి టెస్ట్ చేస్తే.. రూ.3 వేలతో పూర్తవుతుంది. ఉదాహరణకు జనగామ జిల్లాలో 150 మందికి టెస్టు చేస్తే ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. 150 మందికి వేర్వేరుగా టెస్టు చేయడం వల్ల ప్రభుత్వానికి రూ. 4.5 లక్షల ఖర్చు అయింది. ఇదే 150 శాంపిల్స్ పూల్‌మెథడ్‌లో 30 పూల్స్‌గా చేసి టెస్ట్ చేస్తే రూ. 90 వేలు మాత్రమే ఖర్చు అయ్యేది. మొత్తం 30 పూల్స్‌లో గరిష్టంగా రెండు మాత్రమే పాజిటివ్ వచ్చే అవకాశముంది. ఈ రెండు పూల్స్‌లోని పది మందికి వేర్వేరుగా టెస్టు చేస్తే, మరో రూ. 30 వేలు ఖర్చు వచ్చేది. మొత్తంగా రూ. 1.2 లక్షల్లో పని అయ్యేది. అలాగే.. 110 కిట్లు ఆదా అయ్యేవి.
ఎట్ల చేస్తరంటే..!
పూల్ టెస్టులు కూడా ఆర్టీ పీసీఆర్(రివర్స్ ట్రాన్స్‌స్ర్కిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్) పద్ధతిలోనే చేస్తారు. ఒక్కొక్కరి శాంపిల్‌ను విడివిడిగా కాకుండా, ఐదుగురి శాంపిల్స్ ను కలిపి ఒకే టెస్టుగా చేస్తారు. అందుకే దీన్ని పూల్‌టెస్టింగ్ మెథడ్ అంటారు. తొలుత అనుమానితుల నుంచి శాంపిల్స్ తీసుకుంటారు. ఇందులో ఐదు శాంపిల్స్ మిక్స్‌చేసి టెస్ట్ చేస్తారు. ఈ టెస్టులో నెగటివ్ వస్తే, ఆ ఐదుగురికి వైరస్ నెగటివ్ ఉన్నట్టు నిర్ణయిస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే.. ఆ ఐదుగురికి మళ్లీ వేర్వేరుగా టెస్టు చేస్తారు. దీంతో ఆ ఐదుగురిలో ఎంత మందికి వైరస్ ఉన్నది తేలిపోతుంది. ఐదు కంటే ఎక్కువ శాంపిల్స్ కలిపి కూడా టెస్ట్ చేయొచ్చు. ఇట్ల చేస్తే ఫాల్స్ నెగటివ్ వచ్చే ప్రమాదముందని, కేవలం ఐదు శాంపిళ్లను కలిపి పూల్ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్ సూచించింది.
For More News..