- కరోనా స్పీడ్‌గా వ్యాపిస్తోంది.. ప్రజలు బాధ్యతగా ఉండాలి
- పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరిక
- రాష్ట్రంలో కొత్తగా 1,914 మందికి కరోనా
- ఐదు జిల్లాల్లో వందకుపైగానే బాధితులు
- దవాఖాన్లలో 4,983 మంది..వెంటిలేటర్‌పై1,344 మంది
- మరో ఐదుగురు మృతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా చాలా వేగంగా స్ర్పెడ్ అవుతోందని, పరిస్థితి ఇట్లనే కొనసాగితే రాబోయే రోజుల్లో హాస్పిటళ్లలో బెడ్లు కూడా దొరకవని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బుధవారం తన ఆఫీసులో మీడియా ప్రతినిధులతో శ్రీనివాసరావు చిట్ చాట్ చేశారు. అసింప్టమాటిక్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని, కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని వెల్లడించారు.ప్రజలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్పాటిస్తూ, ప్రభుత్వానికి, హెల్త్ డిపార్ట్మెంట్కు సహకరించాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. వైరస్ స్పీడ్ను తగ్గించేందుకు టెస్టుల సంఖ్యను పెంచినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ను కూడా స్పీడప్ చేస్తున్నామని, రాబోయే రోజుల్లో రోజూ లక్షన్నర మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా సింప్టమ్స్ ఉన్న వారు టెస్టులు చేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. పాజిటివ్ వ్యక్తులను కలిసినవాళ్లు, సింప్టమ్స్ లేకున్నా టెస్ట్ చేయించుకోవాలని ఆయన అన్నారు.
1,914 కొత్త కేసులు
రాష్ట్రంలో సోమవారం1,498 కేసులు నమోదవగా, మంగళవారం1,914 కేసులు వచ్చాయి. 5 జిల్లాల్లో వందకుపైగా కేసులు నమోదయ్యాయి. పోయిన ఏడాది అక్టోబర్ 7న 2,154 కేసులు వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లకు కేసుల సంఖ్య1,900 దాటింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ 74,274 టెస్టులు చేస్తే, గ్రేటర్ హైదరాబాద్లో 393, మేడ్చల్ మల్కాజ్గిరిలో 205, నిర్మల్లో 104, నిజామాబాద్లో 179, రంగారెడ్డిలో 169 కేసులు నమోదైనట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,16,649కి పెరిగిందని, ఇందులో 3,03,298 మంది కోలుకున్నారని బులెటిన్లో పేర్కొన్నారు. కరోనాతో మరో ఐదుగురు చనిపోయారని, మృతుల సంఖ్య 1,734కు పెరిగిందని చూపించారు.
11,617కు యాక్టివ్ కేసులు
రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 11,617కు చేరింది. గతేడాది నవంబర్ 29న 10,022 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ తర్వాత వెయ్యి కంటే తక్కువకు యాక్టివ్ కేసుల సంఖ్య పడిపోయింది. ఇప్పుడు మళ్లీ పది వేలు దాటింది. ఈ 11,617 మందిలో 6,634 మంది హోమ్ ఐసోలేషన్లో ఉంటే, 4,983 మంది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు బులెటిన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు పెరుగుతున్నా బులెటిన్లో ఐదారు మాత్రమే చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేసులు కూడా రోజుకు 8 నుంచి 10 వేలు వస్తున్నాయని, ప్రజలు భయాందోళనకు గురవుతారనే ఉద్దేశంతో ఇలా తక్కువగా చూపిస్తున్నట్టు ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు.