కరోనాతో ప్రపంచం వణుకుతోంది
10,048 మందిని బలి తీసుకున్న మహమ్మారి
2,45,532 మందికి వైరస్.. 179 దేశాలకు వ్యాప్తి
న్యూఢిల్లీ: ఒక్కదేశంలో నిమ్మలంగ మొదలైన కరోనా వైరస్ దునియాపై వేగంగా కొమ్ములు విధిలించింది. చిన్నోడు పెద్దోడన్న తేడా లేదు.. పేదోడు డబ్బున్నోడన్న చిన్న చూపు లేదు.. అందరినీ చుట్టచుట్టేసింది. ఎక్కడికక్కడ అన్నింటినీ మూసేయించింది. ఎవరిని చూసినా మాస్కులు. ఎక్కడైనా హ్యాండ్ క్లీనింగ్లు. దేశాల షట్డౌన్లు. సిటీల లాక్డౌన్లు. విమానాల గ్రౌండింగ్‌లు. బస్సులు, రైళ్ల హాల్టింగ్‌లు. షాపులు, మాల్స్, స్కూల్స్ అన్నీ క్లోజ్. బోర్డర్లను బంద్ పెట్టించింది. వ్యాపారాలను దెబ్బతీసింది. సామాన్యుడిని ఇంటికి పరిమితం చేసింది. ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసింది. ఒకటి నుంచి పది.. పది నుంచి వంద.. వంద నుంచి వేలు.. ఎక్కడా ఆగకుండా, అడ్డూఅదుపు లేకుండా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. 2 లక్షల మందికి పైగా ఎటాక్ చేసింది. ఇప్పటిదాకా 179 దేశాల్లో 2,45,532 మందికి వైరస్ సోకింది. 10,048 మంది దానికి బలయ్యారు. మొత్తం కేసుల్లో 86,676 మంది కోలుకున్నారు.
యూరప్‌లోనే ఎక్కువ
చైనా తర్వాత కేసులు ఎక్కువగా నమోదైంది యూరప్‌లోనే. యూరప్ దేశాల్లో కేసుల సంఖ్య వేలు దాటేసింది. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే లాక్డౌన్ అయిపోయిన యూరప్, మరిన్ని నెలలు లాక్డౌన్లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనాతో పోరాటానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సుమారు రూ.61.58 లక్షల కోట్లు (82 వేల కోట్ల డాలర్లు) విడుదల చేసింది. 27 దేశాల నుంచి వచ్చే విమానాలకు నో ఎంట్రీ బోర్డులు పెట్టేసింది. బ్రెగ్జిట్ డీల్‌కు లీడర్‌గా ఉన్న మైకేల్ బార్నియర్కూ ఇప్పుడు వైరస్ సోకింది. దేశంలో హాట్‌స్పాట్ అయిన టైరోల్ ప్రావిన్స్‌ను ఏప్రిల్ 5 వరకు బంద్పెట్టింది ఆస్ట్రియా. పబ్లిక్ ప్లేసెస్‌లో ఎవరూ గుమిగూడకుండా ఉండేందుకు స్లొవేనియా ఆదేశాలిచ్చింది. రష్యాలో తొలి డెత్ నమోదైంది. మాస్కోకు చెందిన 79 ఏళ్ల మహిళ వైరస్‌కు బలైంది. నార్నర్న్ ఐర్లాండ్‌లోనూ తొలి కరోనా మరణం నమోదైంది.
జర్మనీలోనూ మాటింటలేరు
ప్రస్తుతం ఇటాలియన్లు చేసిన తప్పులే జర్మనీ జనాలు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో స్కూళ్లు, బిజినెస్‌లు, పబ్లిక్ ప్లేసెస్‌ను బంద్పెట్టింది దేశం. పబ్లిక్ బయటకు రావొద్దని సూచనలూ చేసింది. కానీ, ప్రభుత్వం చెప్పింది జనాలు పట్టించుకోవట్లేదు. ఇష్టమొచ్చినట్టు తిరిగేస్తున్నారు. దీంతో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటిదాకా దేశంలో ఎదురైన అతిపెద్ద సవాల్ కరోనానేనని చెప్పారు. ఇలాంటి టైంలో అందరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. లాక్డౌన్ దాకా పరిస్థితి రాకూడదంటే జనాలు చెప్పిన మాట వినాలని తేల్చి చెప్పారు.
బ్రిటన్‌లో రంగంలోకి ఆర్మీ
దేశంలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నా మరణాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. పబ్లిక్కు సాయం చేసేలా ఆర్మీని రంగంలోకి దించినట్టు ఆ దేశ రక్షణ మంత్రి బెన్ వాలేస్ ప్రకటించారు. పది వేల మందిని ఎక్కడికక్కడ మోహరించారు. అవసరమైతే ఆ సంఖ్యను 20 వేలకు పెంచనున్నారు. ఆర్మీ రిజర్వ్స్ను స్టాండ్బైలో పెట్టారు. దేశం మొత్తం ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకెళ్లేలా 150 మంది ఆర్మీ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. దేశ రాజధాని లండన్‌ను ఈ వారాంతంలో లాక్డౌన్ చేసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. స్పెయిన్‌లో ఒక్కరోజే 165 మంది చనిపోయారు.
అమెరికాలో మెడికల్ సప్లైస్ కొరత
దేశంలో కేసులు పది వేలు దాటాయి. మరణాలు వేగంగా పెరిగిపోతున్నాయి. అక్కడ ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది అమెరికా సర్కార్. మరో 18 నెలల పాటు అమెరికాలో వైరస్ ప్రభావం ఉండే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. హాస్పిటళ్లలో మెడికల్ సప్లైస్ అయిపోవస్తున్నాయని ఆస్పత్రి మేనేజ్మెంట్లు ప్రభుత్వానికి వివరించాయి. ఒక్క రోజులోనే కేసులు 40 శాతం మేర పెరిగిపోవడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని అంటున్నాయి. అయితే, మెడికల్ సప్లైస్ కొరత రాకుండా రెండు హాస్పిటల్ షిప్స్‌ను డిప్లాయ్ చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. వైద్య సదుపాయాల కెపాసిటీని పెంచుతామని పేర్కొంది. వైరస్ మరింత వ్యాపించకుండా అన్ని రాష్ట్రాల గవర్నర్లు రంగంలోకి దిగారు. ప్రజలను ఎక్కడికక్కడ మానిటర్ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం బెడ్ల సంఖ్యను పెంచుతున్నారు. న్యూయార్క్‌లో 1.10 లక్షల బెడ్లు కావాలని గవర్నర్ చెప్పారు. మేరీలాండ్‌లో మరో 6 వేలకు పైగా అవసరమవుతాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్నెన్నో చర్యలు తీసుకుంటున్నా అక్కడ చాలా మందికి వైరస్ గురించి తెలియనే తెలియదని అధికారులు చెబుతున్నారు.
ఇరాన్లో జాగ్రత్తలు పాటించట్లేదు
ఇరాన్లో కరోనా మరణాలు పెరుగుతున్నా డాక్టర్లు జాగ్రత్తలు పాటించట్లేదు. శవాలను హ్యాండ్లింగ్ చేసే విధానాన్ని సరిగ్గా చేయట్లేదు. ఒక్కరోజే 149 మంది దానికి బలయ్యారు. దేశంలో కరోనాకు మూల బిందువైన ఖోమ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి ఆస్పత్రుల్లో డాక్టర్లు కనీస జాగ్రత్తలు లేకుండానే పేషెంట్లను ట్రీట్ చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే శవాలను హ్యాండిల్ చేస్తున్నారు. దీని వల్ల డాక్టర్లకూ వైరస్ సోకే ప్రమాదముందని, అది దేశ హెల్త్ సిస్టమ్‌పై పెద్ద ప్రభావాన్నే చూపించే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లకు సరైన ప్రొటెక్టివ్ గేర్లు లేవని ఆవేదన చెందుతున్నారు.
ఇటలీలో ఇంకా మారలేదు
ఇటలీలో చైనాతో పోలిస్తే కేసులు తక్కువే. కానీ, మరణాలు మాత్రం చైనా కన్నా వేగంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 3 వేల మార్కుకు దగ్గరగా వచ్చింది ఇటలీ. ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఎక్కడికక్కడ లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. అయినా జనాలు మాట వినట్లేదు. లాక్‌డౌన్‌ను కాదని జనాలు బయటకొచ్చేస్తున్నారు. దీంతో ప్రధాని గ్వెసిపి కాంటీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలని మండిపడ్డారు. లాక్‌డౌన్‌ను మరింత పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 3 వరకు లాక్డౌన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడే దేశంలో సాధారణ పరిస్థితులు రావడానికి అవకాశం లేదన్నారు. కరోనా పూర్తిగా పోయినా కూడా దాని ప్రభావం కొన్ని నెలలు ఉంటుందని చెప్పారు. జనాలు మాట వినకపోతుండడంతో అవుట్డోర్ యాక్టివిటీని పూర్తిగా నిషేధించాలని ఓ మంత్రి సూచించారు. కొన్ని చోట్ల మిలటరీని రంగంలోకి దింపారు. శవాలను ఖననం చేయడానికి శ్మశాన వాటికల ముందు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు బారులు తీరుతున్నారు. ఫ్రాన్స్‌లోనూ కేసులు పెరుగుతున్నా జనాలు బయట తిరిగేస్తున్నారు.
For More News..