- మరింత స్పీడ్ అండ్ స్ట్రాంగ్‌గా కొత్త స్ట్రెయిన్
- బీజింగ్‌లోని గ్వాంగ్జౌలో మరోసారి లాక్‌డౌన్ ఆంక్షలు
బీజింగ్: చైనాలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. బీజింగ్‌లోని గ్వాంగ్జౌ సిటీలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు. గడిచిన వారం రోజుల్లో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్వాంగ్జౌలో ప్రజలు ఎవరూ బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కనుగొన్న కొత్త స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమైనదని, స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిని తెలుసుకునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. లివాన్ జిల్లాలోని 5 ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి శనివారం టెస్టులు చేశారు. మార్కెట్లు, శిశు సంక్షేమ కేంద్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రెస్టారెంట్లపై నిషేధం విధించింది. బహిరంగ కార్యక్రమాలను తక్కువ మందితో జరుపుకునేలా చూడాలని నాలుగు జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. చైనాలో ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం విదేశాల నుంచి వెళుతున్న వారివేనని చెబుతోంది. శనివారం నమోదైన కేసుల్లో గాంజావ్‌లో రెండు, చైనాలోని ఇతర ప్రాంతాలలో 14 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివేనని నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. ప్రస్తుత స్ట్రెయిన్ ఇండియాలోనే ముందుగా కనుగొన్నారని రాష్ట్ర మీడియా తెలిపింది. గ్వాంగ్జౌలో శనివారం చేసిన టెస్టుల్లో ఒక కొత్త స్ట్రెయిన్ కేసు, రెండు అసింప్టమాటిక్ కేసులు గుర్తించారని తెలిసింది.