- గ్రేటర్ హైదరాబాద్‌లో 96,770 మందికి దగ్గు, జ్వరాలు
- మంచిర్యాల, కొత్తగూడెంలోనూ భారీగా నమోదు
- ఆ తర్వాత నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేటలోనే
- 20 రోజుల ఫీవర్ సర్వేలో బయటపడ్డ కేసులు
- దాదాపు లక్ష మందికి ఐసోలేషన్ కిట్లు ఇవ్వని సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇరవై రోజుల్లోనే కరోనా లక్షణాలున్న 6 లక్షల 77 వేల మందిని ప్రభుత్వం గుర్తించింది. హెల్త్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో ఈ కేసులు బయటపడుతున్నాయి. హెల్త్ వర్కర్లు రోజూ వేలాది మందికి సింప్టమ్స్ ఉన్నట్టు గుర్తిస్తున్నారు. దవాఖాన్లలో నిర్వహిస్తున్న ఫీవర్ ఓపీకి కూడా రోజూ వేల మంది సింప్టమ్స్‌తో వస్తున్నారు. ఈ నెల ఆరో తేదీ నుంచి 26 వరకూ 20 రోజుల్లోనే కరోనా సింప్టమ్స్ ఉన్న 6,77,568 మందిని హెల్త్ సిబ్బంది గుర్తించగా.. ఇందులో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వాళ్లు 96,770 మంది ఉన్నారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో అత్యధిక సింప్టమాటిక్ కేసులు ఉన్నట్టు హెల్త్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది.
మంచిర్యాల ఒక్క జిల్లాలో 42,318 మందికి కరోనా సింప్టమ్స్ ఉన్నట్టు గుర్తించి, హోమ్ ఐసోలేషన్ కిట్లు అందజేశారు. ఆ తర్వాత స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఈ ఐదు జిల్లాల్లోనూ ఒక్కో జిల్లాలో ఇరవై వేలకుపైగా కేసులున్నాయి. అతి తక్కువగా వనపర్తి, నిర్మల్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో ఒక్కో జిల్లాలో పది వేల కంటే తక్కువ కేసులను గుర్తించారు. మిగిలిన జిల్లాల్లో పది వేల నుంచి 20 వేల మంది బాధితులున్నారు. ఫీవర్ సర్వే మొదటి దశలో మొత్తం 1,01,28,711 ఇండ్లను, రెండో దశలో 55.05 లక్షల ఇండ్లను హెల్త్ టీమ్స్ విజిట్ చేశాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సెకండ్ రౌండ్ ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటికీ చాలా మంది కరోనా టెస్టు చేయించుకోవడానికి భయపడుతుండడం, ప్రభుత్వం టెస్టులు అరకొరగా చేస్తుండడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య అత్యంత తక్కువగా కనిపిస్తోంది.
లక్ష మందికి కిట్లు ఇయ్యలే
సింప్టమ్స్ ఉన్నవాళ్లందరికీ హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, చాలా మందికి కిట్లు ఇవ్వడం లేదు. మొదటి రౌండ్ ఫీవర్ సర్వేలో 2,41,103 మందికి సింప్టమ్స్ ఉన్నట్టు గుర్తించి, అందులో 2,18,698 మందికే కిట్లు ఇచ్చారు. రెండో రౌండ్‌లో ఇప్పటివరకు 1,57,963 మందికి సింప్టమ్స్ ఉన్నట్టు గుర్తించి, 93,129 మందికి మాత్రమే కిట్లు ఇచ్చారు. హాస్పిటళ్లలో నిర్వహిస్తున్న ఫీవర్ ఓపీకి 2,78,502 మంది సింప్టమ్స్‌తో వస్తే, 2,52,277 మందికే కిట్లు ఇచ్చారు. అంటే, రెండు రౌండ్ల ఫీవర్ సర్వే, హాస్పిటళ్ల ఓపీలో కలిపి 6,77,568 మంది సింప్టమాటిక్ వ్యక్తులను గుర్తించినప్పటికీ, ఇందులో 5,69,104 మందికి మాత్రమే కిట్లు ఇచ్చారు. 1 ,08,464 మందికి కిట్లు ఇవ్వలేదు. ప్రభుత్వ దవాఖాన్లలో టెస్టులు చేయించుకున్న వాళ్లలోనూ చాలా మందికి కిట్లు ఇవ్వడం లేదు. ఇదే అదునుగా ఊళ్లల్లో కొందరు ఆర్‌ఎంపీలు, మెడికల్ షాపులు యజమానులు కిట్ల పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు.