కరోనా టెస్ట్​ జస్ట్​ రూ.850

కరోనా టెస్ట్​ జస్ట్​ రూ.850

హైదరాబాద్​, వెలుగు: ప్రైవేట్​​ ల్యాబుల్లో కరోనా టెస్టుల ధరలను సర్కార్​ తగ్గించింది. ప్రస్తుతం రూ.2200 ఉన్న ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ రేటును రూ.850కి తగ్గిస్తున్నట్టు పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​‌‌ డాక్టర్​ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇంటికెళ్లి శాంపిల్​ కలెక్ట్​ చేస్తే ప్రస్తుతం రూ.2800 చార్జ్​ చేస్తుండగా, దీన్ని రూ.1,200కు తగ్గిస్తున్నట్టు చెప్పారు. ఇంతకుమించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్​ ల్యాబ్​లను ఆయన హెచ్చరించారు. పీపీఈ కిట్లంటూ ఎక్కువ వసూలు చేస్తే.. 9154170960 నంబర్​‌‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లు, టెస్టింగ్​ సెంటర్లలోనూ ఆర్టీపీసీఆర్​ టెస్టులు చేస్తున్నామని, డబ్బులు వృథా చేసుకోకుండా అక్కడికే వచ్చి టెస్టులు చేయించుకోవాలని కోరారు. కరోనా లక్షణాలు ఉండి యాంటీజెన్​ టెస్టులో నెగెటివ్​ వస్తే, కచ్చితంగా ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ చేస్తామన్నారు. టెస్టింగ్​ కిట్ల ధరలు గతంలో రూ.2,500 ఉండగా, ప్రస్తుతం రూ.250కి పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే టెస్టుల ధరలను తగ్గిస్తూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరో 948 మందికి కరోనా

రాష్ట్ర సర్కారు లెక్కల ప్రకారం కరోనా కేసుల సంఖ్య 2.6 లక్షలకు చేరువైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ 42,433 మందికి టెస్టులు చేయగా 948 మందికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. గ్రేటర్‌‌‌‌ పరిధిలో 154, జిల్లాల్లో 794  కేసులు నమోదైనట్టు బుధవారం విడుదల చేసిన బులెటిన్‌‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,59,776కు పెరిగింది. 2,45,293 మంది కోలుకోగా, 13,068 మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నరు. వీరిలో 10,710 మంది హోమ్‌‌, ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్‌‌లో ఉండగా, మరో 2,358 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌‌ దవాఖాన్లలో చికిత్స పొందుతున్నారు. కరోనాతో మంగళవారం మరో ఐదుగురు చనిపోయారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి  సంఖ్య 1,415కు పెరిగింది. ఇప్పటివరకు 49,72,407 మందికి టెస్టులు చేసినట్టు చెప్పింది.