హెల్త్ సిబ్బందిలో సగం మంది వ్యాక్సినేషన్ డ్రైవ్‌కే..
ఉదయం 11 గంటలకే టెస్ట్ సెంటర్లు క్లోజ్
ఒక్కో పీహెచ్‌సీలో 30 నుంచి 40 టెస్టులు మాత్రమే
లాక్ డౌన్ కు ముందుతో పోలిస్తే 50 శాతం తగ్గిన టెస్టులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో కరోనా టెస్టులు తగ్గుతున్నాయి. లాక్‌డౌన్ వల్ల మొన్నటివరకు టెస్టులు తగ్గితే.. ఐదురోజులుగా మాస్ వ్యాక్సినేషన్ జరుగుతుండడంతో ఈ సంఖ్య ఇంకింత తగ్గింది. టెస్టు సెంటర్లలోని సగానికి పైగా హెల్త్ స్టాఫ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొంటుండడం, చిన్నారులకు రెగ్యులర్ టీకా కార్యక్రమాల్లో ఇంకొందరు బిజీగా ఉండటం, ఫీవర్ సర్వేలో మరికొందరు పాల్గొంటుండడంతో టెస్టులు చేసేందుకు ఒకరిద్దరే మిగులుతున్నారు. పొద్దున 8 గంటల నుంచి 11 గంటల వరకు 3 గంటలే టెస్టులు చేసి మూసేస్తున్నారు. మిగతా వాళ్లను తర్వాత రోజు రమ్మంటున్నారు. దీంతో లాక్‌డౌన్‌కు ముందు ఒక్కో సెంటర్‌లో జరిగే టెస్టుల సంఖ్యలో 50 శాతం వరకు తగ్గింది.
కిట్లు తగ్గించారు
సిటీలో 102 సెంటర్లలో కరోనా టెస్టులు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు సెకండ్ వేవ్ టైమ్‌లో సిటీలో డైలీ 14 వేల టెస్టులు చేయగా ప్రస్తుతం రోజూ 6 వేల లోపే నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి టెస్టులు తగ్గడంతో కేసులూ తగ్గాయి. అంతకు ముందు సిటీలో రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవగా ప్రస్తుతం 500 లోపే వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఒక్కో పీహెచ్‌సీలో వంద, పెద్ద సెంటర్లలో 200లకు పైగా టెస్టులు చేసేవారు. ఇప్పుడు ఇందులో సగం కూడా చేయట్లేదు. టెస్టులను తగ్గించేందుకు పీహెచ్‌సీలకు టెస్టింగ్ కిట్లు కూడా తగ్గించి ఇచ్చారు.
ఆర్టీపీసీఆర్ చేస్తలే
యాంటిజెన్‌లో నెగెటివ్ వచ్చిన కరోనా అనుమానితులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు పక్కాగా చేసేవారు. కానీ ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ చేయాలని అడిగినా చేయట్లేదు. సెంటర్లలో ఆశవర్కర్లే టెస్టులు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ తీసుకొని వాటిని ల్యాబ్‌లకు పంపాలి. ప్రస్తుతం స్టాఫ్ కొరత వల్ల ఈ టెస్టులపై పెద్దగా దృష్టి పెట్టట్లేదు.
సిబ్బంది అంతా..
గ్రేటర్ పరిధిలో 30 సర్కిళ్లలో 32 సెంటర్ల ద్వారా రిస్క్ టేకర్స్‌కు టీకాలు వేస్తున్నారు. ఇందులో 13 సెంటర్లు హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో, మిగతావి గ్రేటర్ పరిధిలోకి వచ్చే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి. ఒక్కో సెంటర్‌లో 10 కౌంటర్లు పెట్టి ఒక్కో కౌంటర్‌లో 100 మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అంటే ప్రతి కౌంటర్‌లో ఓ నర్సు తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలి. ఇలా ఒక్కో సెంటర్‌లో తక్కువలో తక్కువ 20 మంది స్టాఫ్ టీకాలేస్తున్నారు. ఇది కాకుండా ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ స్టాఫ్‌కు వ్యాక్సిన్ వేస్తున్నారు. హైదరాబాద్ వైద్యారోగ్య శాఖ పరిధిలో దాదాపు 300 మంది స్టాఫ్ వ్యాక్సినేషన్ విధుల్లోనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా నర్సులు 221 మందే. వీళ్లలో 150 మంది రిస్క్ టేకర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తున్నారు. మిగిలిన 70 మంది పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు.
జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో హెల్త్ స్టాఫ్
యూపీహెచ్ సీ సెంటర్లు 89
మెడికల్ ఆఫీసర్లు 89
స్టాఫ్ నర్సులు 221
ల్యాబ్ టెక్నిషీయన్లు 107
ఫార్మసిస్టులు 69
ఏఎన్ఎంలు 441
ఆశావర్కర్లు 1503
ఈ ఏడాది కరోనా కేసులు..
జనవరి 1568
ఫిబ్రవరి 788
మార్చి 2346
ఏప్రిల్ 22,883
మే 21,985
రెండు నెలల్లోనే 40 వేల కేసులు
గ్రేటర్ పరిధిలో జనవరి నుంచి మే నెల 31 వరకు కరోనా కేసులు 44 వేలకు పైగా నమోదయ్యాయి. గత రెండు నెలల్లోనే 40 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇది ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టుల సంఖ్య. ఇవికాకుండా ప్రైవేట్ సెంటర్లలో రోజూ 2 వేల టెస్టులు జరుగుతున్నాయి. ఇందులో కూడా వందల్లో పాజిటివ్ కేసులు వస్తున్నా బయటకు తెలియట్లేదు.