పిల్లలకూ కరోనా ముప్పు

పిల్లలకూ కరోనా ముప్పు
  • ఉత్తరాఖండ్​లో 3 వేల మందికి వైరస్​
  • గత పది రోజుల్లోనే వెయ్యికి పైగా కేసులు నమోదు
  • మహారాష్ట్రలో ఒక్క నెలలోనే 51% పెరిగిన కేసులు
  • ముంబైలో రోజూ 20 మంది పిల్లలకు పాజిటివ్​
  • పిల్లల నుంచి కరోనా సోకే ముప్పు తక్కువని కామెంట్​ 

న్యూఢిల్లీ: వృద్ధులు, యువతే కాదు.. పిల్లలనూ కరోనా మహమ్మారి వదలట్లేదు. ఫస్ట్​వేవ్​తో పోలిస్తే సెకండ్​వేవ్​లో ఎక్కువ మంది పిల్లలు దాని బారిన పడుతున్నారు. జనవరి 1 నుంచి ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో 11 శాతానికిపైగా 20 ఏళ్లలోపువారేనని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఉత్తరాఖండ్​లో 10 రోజుల గ్యాప్​లోనే వెయ్యి మందికిపైగా 9 ఏళ్లలోపు చిన్నారులు దాని బారిన పడ్డారు. కొందరు పిల్లలు ట్రీట్​మెంట్​ కోసం ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఏప్రిల్​ మధ్య వారం నుంచి పిల్లల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఫస్ట్​వేవ్​లో 2,131 మంది చిన్నారులు 

కరోనా బాధితులుగా మారారు. ఇప్పుడు సెకండ్​వేవ్​లో ఏప్రిల్​ 1 నుంచి 15 మధ్య 264 మందికి పాజిటివ్​ వస్తే.. ఏప్రిల్​ 16 నుంచి 30 వరకు ఏకంగా 1,053 మంది కరోనా బారిన పడ్డారు. మేలో మొదటి రెండు వారాల్లోనే 1,618 మంది ఎఫెక్ట్​ అయ్యారు. మొత్తంగా ఏప్రిల్​ 1 నుంచి ఇప్పటిదాకా నెలన్నరలో 2,935 మంది పిల్లలకు కరోనా సోకింది. చాలా మంది ఇళ్లు ఇరుకుగా ఉన్నాయని, అలాంటి కుటుంబాల్లోని వ్యక్తులకు పాజిటివ్​ వస్తే సరైన ఐసోలేషన్​ లేక పిల్లలకూ సోకుతోందని ఉత్తరాఖండ్​ డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ హెల్త్​ డాక్టర్​ తృప్తి బహుగుణ చెప్పారు.  

మహారాష్ట్రలో ఒక్క నెలలోనే కరోనా బారిన పడిన పిల్లల సంఖ్య 51 శాతం పెరిగిందని ఆ రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ లెక్కలు చెబుతున్నాయి. అకోలా, అమరావతిలలో ఈ నెల మొదటి వారంలో నమోదైన కేసుల్లో 10 నుంచి 12 శాతం మంది పిల్లలున్నారు. ముంబైలోని బాయి జెర్బాయి వాడియా హాస్పిటల్​ ఫర్​ చిల్డ్రన్‌లో ఫస్ట్​ వేవ్​లో ఏడు నెలల కాలానికిగానూ సగటున నెలకు 21 మంది పిల్లలు కరోనా ట్రీట్​మెంట్​ తీసుకున్నారు. అదే సెకండ్​వేవ్​లో ఇప్పటిదాకా 90 కేసులు నమోదయ్యాయి. ముంబైలో రోజూ సగటున 15 నుంచి 20 మంది పిల్లలకు కరోనా సోకుతోందని ఎస్​ఆర్​సీసీ చిల్డ్రన్‌​ హాస్పిటల్​ పీడియాట్రిక్​ పల్మనాలజిస్ట్​ ఇందూ ఖోస్లా చెప్పారు. మంగళూరు జిల్లాలో సెకండ్​వేవ్​లో ఇప్పటిదాకా 1,455 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారని చెబుతున్నారు. 

70% మందికి లక్షణాల్లేవ్​: యునిసెఫ్​
పిల్లలకు కరోనా సోకే ముప్పుందని, అయితే దాని తీవ్రత మాత్రం తక్కువగానే ఉంటోందని యునిసెఫ్​ వెల్లడించింది. 60 నుంచి 70 శాతం వరకు పిల్లల్లో లక్షణాలు కనిపించట్లేదని తెలిపింది. లక్షణాలున్న పిల్లల్లో కేవలం 1 నుంచి 2 శాతం మందికే ఐసీయూలో ట్రీట్​మెంట్​ అవసరమవుతోందని పేర్కొంది. పిల్లలకు కరోనా వచ్చినా కంగారు పడిపోవద్దని, పిల్లలకు అసలు కరోనా వచ్చిన విషయం తెలియనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. పిల్లలు సూపర్​స్ప్రెడర్లు అన్న మాటలను యునిసెఫ్​ కొట్టిపారేసింది. పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లల నుంచి మహమ్మారి సోకడం చాలా తక్కువని పేర్కొంది.