కరోనా గాయాలు వెంటాడుతున్న విషాదాలు


కరోనా విషాదాలు ఎన్నో కుటుంబాలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గడిచిన రోజులు.. గడుస్తున్న క్షణాలు.. మనుషుల మనసులను గాయపరుస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారి వల్ల మొదటి వేవ్ లో కంటే రెండో వేవ్​లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. మొదట్లో వృద్ధులు, పలురకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారిలో మరణాలు ఎక్కువగా ఉన్నా.. రెండో వేవ్​లో నడివయస్కులు, యువకులు బలవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మరోవైపు చనిపోయిన వారి శవాలకు అంత్యక్రియల్లో కూడా సంప్రదాయం ప్రకారం కనీస గౌరవ మర్యాదలు దక్కడం లేదనే ఆవేదనలు, అలాగే కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకులు లేకుండా దిక్కులేని శవాల్లాగా దహన సంస్కారాలు జరగడం మనసుల్ని కలచివేస్తున్నాయి. కరోనా చావులు సంభవించిన కుటుంబాల్లో చాలా మంది దాని గురించే పదేపదే ఆలోచిస్తూ సోషల్ మీడియా, టీవీలకు అతుక్కుపోయి విపరీతంగా భయాలకు గురవుతున్నారు. వీరిలో కొంత మంది కొత్త సమస్యల కోరల్లో చిక్కుకుంటున్నారు. ఈ అనవసరపు భయాలతో మరణాలు మరింత పెరుగుతున్నాయి. మానసిక సమస్యలు ఎక్కువైతున్నాయి. కొద్ది రోజుల్లో మూడో వేవ్​ రానుందని... చిన్నారులపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే వార్తలు, ప్రచారాలతో తల్లిదండ్రుల్లో విపరీతమైన ఆందోళన నెలకొంది.

మనోవ్యథగా కరోనా ఆందోళన (Covid anxiety)

ఈ మధ్య కరోనా భయంతో మానసిక నిపుణులను కలుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సైకాలజీ హాస్పిటళ్లు, క్లినిక్​లు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో రోగులు డాక్టర్లను కలుస్తున్నారు. హైదరాబాద్​కు చెందిన ప్రదీప్(32)(పేరు మార్చాం) ఇంటి దగ్గర్లో కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రులు ఉన్నాయి. ప్రతిరోజు వచ్చిపోయే అంబులెన్స్ ల సైరన్లు వినిపించేవి. అట్ల రోజుకు ఎన్ని అంబులెన్స్ లు వచ్చి పోతున్నాయో లెక్క పెట్టేవాడు. ఒకరోజు ఆ లెక్కలు చూసి సడెన్​గా ఊపిరి ఆడటం లేదని ఛాతీలో గట్టిగా పట్టినట్లు ఉందని, చెమటలు పోస్తున్నాయని.. తనకు కరోనా సోకిందని, విపరీతంగా వణికిపోయాడు. ‘నావల్ల ఇంటి వాళ్లకు కరోనా సోకితే ఎట్ల? అమ్మానాన్నలకు బీపీ షుగర్ ఉన్నాయి. వాళ్లు డేంజర్ లో పడతారు. ఆక్సిజన్, మందులు, హాస్పిటల్స్​లో బెడ్లు దొరకటం లేదని ఇలాంటి పరిస్థితిలో బతకడం అసాధ్యం’ అని తీవ్రంగా భయపడిపోయాడు. ఆ తర్వాత నుంచి పదే పదే అన్ని రకాల టెస్టులు చేసుకుంటున్నాడు. కరోనా సహా ఏజబ్బు లేదని రిపోర్టులు వస్తున్నా అతనిలో భయం తగ్గడం లేదు. కుటుంబసభ్యులు, బంధువులు అతడిని దగ్గర్లోని సైకాలజిస్ట్​ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స ఇప్పిస్తున్నారు. ఇట్ల తమ చుట్టుపక్కల ఇండ్లలో కరోనాతో ఇబ్బందులు పడిన వారిని, చనిపోయిన వారిని చూసి ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. తమకు, తమవారికి ఎమవుతుందో అని విపరీతంగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు. అయితే వారిలో కొద్ది మంది మాత్రమే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకోగలుగుతున్నారు.
కరోనా ఆందోళన (Covid anxiety) కారణాలు

  • కరోనా ఎప్పుడు పోతుందో తెలియని అయోమయం. కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరగడం.
  • వైరస్ సోకితే చనిపోతామనే భయం, ఆక్సిజన్, మందుల లభ్యత బ్లాక్ మార్కెట్​లో కూడా లేదని, హాస్పిటల్స్​లో బెడ్ల్ దొరకడం లేదనే వార్తలు.    చికిత్సకు లక్షలు ఖర్చు అవడం.
  • తమ వారిని కాపాడుకునేందుకు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్న వారి దృశ్యాలు.
  • కుటుంబ పోషకులు చనిపోయి పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు అనాథలుగా మారుతున్న వార్తలు.
  • శ్మశానంలో పెద్ద సంఖ్యలో శవ దహనాలు జరుగుతున్న దృశ్యాలు.
  • కరోనాతో అల్లకల్లోలమైన కుటుంబాల, జీవితాల కథనాలు.

కరోనా ఆందోళన లక్షణాలు ఇవీ

  •     కరోనా వచ్చి చనిపోతానని పదే పదే భయపడడం. 
  •     సోషల్ మీడియాలో వారు వీరు పెట్టే పోస్టులు, మీడియాలో వార్తలతో ఎక్కువగా ఆలోచించడం.
  •     భయం, ఆందోళన, ఆదుర్దా, నిద్రలేమి, ఆకలి, అనాసక్తి. 
  •     చెమటలు పట్టడం, గుండె దడ, ఊపిరి ఆడటం లేదని ఆందోళన చెందడం.
  •     దేని మీదా మనసు లగ్నం కాకపోవడం, ఏదో కోల్పోయినట్లు ఉండడం.
  •     విచారం, దిగులు, తొందరగా చిరాకు పడడం.
  •     నిరాశ, నిస్పృహలు, నిస్సత్తువ, ఆత్మహత్య ఆలోచనలు.
  •     తమకు ఏదో చెడు జరగుతుందని ఊహించుకోవడం.
  •     ఒంటరిగా ఉండటం, ఎవరితో కలవలేక పోవడం.

ఆందోళన ఎట్ల కంట్రోల్ చేసుకోవచ్చు 

  •     కరోనా వార్తలు చూడడం, చర్చించడం బంద్ చేయాలి.
  •     వైరస్ సోకిన వారిలో 2 శాతం మంది మాత్రమే చనిపోతున్నారనే విషయాన్ని గ్రహించండి.
  •     మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అనవసర విషయాలపై ఆందోళన పడకండి.
  •     ఒత్తిడి, ఆందోళనగా ఉన్నప్పుడు స్నేహితులు, ఆత్మీయులతో మాట్లాడండి.
  •     మంచి నిద్ర, సమతుల ఆహారం తీసుకోండి.
  •     బోర్ గా అనిపిస్తే ఇష్టమైన మ్యూజిక్ తో సమయం గడపండి.
  •     యోగ, వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోండి. 
  •     సోషల్ మీడియాను కాకుండా డాక్టర్ల సలహాలను మాత్రమే పాటించండి.

- డాక్టర్​ బి.కేశవులు,
సీనియర్ మానసిక వైద్య నిపుణుడు,నిజామాబాద్