కరోనా వైరస్ కారణంగా ప్రజలందరికీ ప్రభుత్వం ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొందరు అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కోవిడ్ సెకండ్ డోస్ తీసుకున్నట్టుగా ఆన్లైన్ ఎంట్రీ అయ్యింది. కోవిడ్ పోర్టల్ నుంచి సర్టిఫికెట్ డౌన్ లోడ్ అయ్యింది. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కొడిశాల రాజశేఖర్ ఏప్రిల్ 27, 2021లో కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో మృతి చెందాడు. గత ఏప్రిల్ 10న రాజశేఖర్ మొదటి డోస్ తీసుకున్నాడు. టీకా తీసుకున్న 10 రోజులకే రాజశేఖర్ కోవిడ్ బారిన పడ్డాడు. హైదరాబాద్ లోని మదీనగూడ అర్చన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 27న మృతి చెందాడు.
రాజశేఖర్ మృతి చెందినట్టుగా డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్. నేడు సెకండ్ డోస్ విజయవంతంగా పూర్తయినట్టుగా రాజశేఖర్ మొబైల్ కు మెసేజ్ వచ్చింది. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు కోవిడ్ పోర్టల్ లో చూడగా సర్టిఫికెట్ డౌన్ లోడ్ అయ్యింది. దీంతో 9 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి టీకా ఎలా తీసుకుంటాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ టార్గెట్ రీచ్ కావడం కోసమే వైద్యాధికారులు ఆన్లైన్లో ఎంట్రీ చేశారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. జిల్లాలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.