వ్యాక్సిన్ స్టోరేజ్ సవాలే..పేద దేశాలపైనే ఎఫెక్ట్

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 4 కోట్ల మందికి అంటుకున్నది. 11 లక్షల మందిని పైగా బలితీసుకున్నది. వీలైనంత త్వరగా పవర్ ఫుల్ వ్యాక్సిన్ లు తయారు చేయడంతో పాటు వాటిని అన్ని దేశాల్లోని ప్రజలకూ వేస్తే తప్ప.. ఈ మహమ్మారిని అంతం చేసే అవకాశం లేదు. అయితే.. ఇప్పటికిప్పుడు కరోనా వ్యాక్సిన్ లు రెడీ అయినా.. ప్రపంచ దేశాలన్నింటికీ సప్లయ్​ చేయడం సవాలేనట. పేద దేశాలతో పాటు రిచ్ కంట్రీస్ లోనూ వ్యాక్సిన్ లను స్టోర్ చేసేందుకు తగినన్ని రిఫ్రిజిరేషన్ సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమట. వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నా.. 780 కోట్ల ప్రపంచ జనాభాలో దాదాపు 300 కోట్ల మందికి వ్యాక్సిన్ లు అందించడం కష్టంగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు.

అది బుర్కినా ఫాసోలోని గంపెలా టౌన్ లోని ఓ సర్కార్ దవాఖాన. ఇక్కడ ఉన్న రిఫ్రిజిరేటర్ ఏడాది కింద పాడైపోయింది. దీంతో సాధారణ వ్యాక్సిన్ లు, మందులు స్టోర్ చేసేందుకు కూడా అవకాశం లేకపోయింది. ఇక్కడికొచ్చే ప్రజల కోసం ఇతర ప్రాంతాల్లోని దవాఖాన్లకు సిబ్బంది పరుగులు పెట్టాల్సి వస్తోంది. చాలాసార్లు సమయానికి వ్యాక్సిన్ లు, మందులు తీసుకోకుండానే జనం ఇంటిముఖం పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ప్రాంతాల్లోనే కరోనా వ్యాక్సిన్ ల కోల్డ్ చైన్ తెగిపోతుందని, వ్యాక్సిన్ లు కావాల్సినన్ని అందుబాటులో ఉన్నా.. ఆ ప్రాంతాల ప్రజలకు వాటిని వేయడం కష్టమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42 రకాల కరోనా వైరస్ వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నయి. మరో 151 రకాల వ్యాక్సిన్ లు ప్రీ క్లినికల్ ఎవాల్యుయేషన్ దశలో ఉన్నయి. ఇవన్నీ ఇప్పటికిప్పుడు తయారీకి సిద్ధమైనా.. వీటిని జనం వద్దకు చేర్చడం ఇప్పుడు ప్రభుత్వాలకు సవాల్​గా మారింది. వీటిని సురక్షితంగా ఎలా అందించాలనే దానిపై సర్కారులన్నీ దృష్టి పెట్టాయి.

మైనస్ 70 డిగ్రీల వద్ద స్టోర్ చేయాలె

చాలా వ్యాక్సిన్ లను తప్పనిసరిగా లో టెంపరేచర్ల వద్దనే స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీలో తయారైనప్పటి నుంచి సిరంజీలోకి ఎక్కించేదాకా.. నాన్ స్టాప్ గా కూలింగ్ లో ఉండాలి. కొన్నింటిని మైనస్15 డిగ్రీ సెంటీగ్రేడ్ల కంటే తక్కువ టెంపరేచర్ల వద్ద, మరికొన్నింటిని 2 నుంచి 8 డిగ్రీలలోపు టెంపరేచర్ల వద్దే స్టోర్ చేయాలి. మోడెర్నా, ఫైజర్, తదితర కంపెనీలు తమ కరోనా వ్యాక్సిన్ లను ఎంఆర్ఎన్ఏ బేస్డ్ గా తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ లు మరీ వేడెక్కినా, మరీ చల్లబడినా.. వేస్ట్ అయిపోతాయి. వాటిని పారేయటం తప్ప ఎందుకూ పనికిరావు. కొన్ని కరోనా వ్యాక్సిన్ లను మైనస్ 70 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే.. జీరో కన్నా తక్కువ టెంపరేచర్ల వద్ద ఉంచుతూ కరోనా వ్యాక్సిన్ లను ప్రపంచమంతా సప్లై చేయడం అనేది అతిపెద్ద సవాల్ గా మారింది.

కోల్డ్ చైన్ తెగితే కష్టం

కరోనా వ్యాక్సిన్ లు తయారైనప్పటి నుంచి వాటిని సిరంజీలోకి ఎక్కించి జనానికి వేసే వరకూ.. ఎక్కడా కూలింగ్ తగ్గిపోకుండా చూడాల్సి ఉంటుంది. ఏ కారణం వల్లనైనా ఈ కోల్డ్ చైన్ తెగిపోతే.. ఇక ఆ వ్యాక్సిన్ లు మొత్తం వేస్ట్ అయిపోతాయి. అయితే వెనెజులా, బుర్కినా ఫాసో వంటి పేదదేశాలు, ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలే కాకుండా.. అమెరికా వంటి రిచ్ కంట్రీస్ లోనూ పూర్తిస్థాయి కోల్డ్ చైన్ ను మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్ తయారీకి పెద్ద ఎత్తున ఫండ్స్ ఖర్చు చేస్తున్నా.. కూలింగ్ టెక్నాలజీ, ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి దిశగా మాత్రం సరైన పెట్టుబడులు లేవని, వ్యాక్సిన్ రెడీ అయ్యేలోగా కూలింగ్ సౌకర్యాలను సిద్ధం చేయాలని సూచిస్తున్నారు.

మల్టీ డోస్ వెయిల్స్ కు యునిసెఫ్​ యోచన

కరోనా వ్యాక్సిన్ లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉన్నందున 20 డోసులు పట్టేంత పెద్దగా.. మల్టీ డోస్ వెయిల్స్ తో సప్లై చేస్తే.. ట్రాన్స్ పోర్ట్, స్టోరేజ్ కు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని యునిసెఫ్ ఆలోచిస్తోంది. అయితే ఎక్కడైనా కోల్డ్ చైన్ తెగిపోతే గనక.. వ్యాక్సిన్ డోసులు కూడా భారీ ఎత్తున వేస్ట్ అవుతాయని, దాంతో నష్టం కూడా భారీగా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే మల్టీ డోస్ వెయిల్స్ ను ఓపెన్ చేసిన వెంటనే వేయకపోతే.. సమయం గడిచినకొద్దీ వాటి లైఫ్ టైం తగ్గిపోతుందని.. ఇలా ఈ వెయిల్స్ 15% వరకూ వేస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ఏటా 25% వ్యాక్సిన్ లు వేస్ట్ అవుతున్నయ్

ప్రపంచవ్యాప్తంగా సరైన స్టోరేజ్ సౌకర్యాలు లేకపోవడం వల్లే ఏటా 25% వ్యాక్సిన్లు వేస్ట్ అయిపోతున్నాయని 2019లో జరిగిన ఓ స్టడీలో వెల్లడైంది. చాలా వ్యాక్సిన్ లు గమ్యస్థానాలకు చేరేసరికే పాడైపోతున్నాయని తేలింది. కొన్నిసార్లు వేడెక్కిన విషయాన్ని గ్రహించకుండా వ్యాక్సిన్ లు వేసినా, ప్రజల ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదని, కానీ ఆ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం మాత్రం ఉండదని చెప్తున్నారు.

మనదేశంలో 30% కెపాసిటీ తక్కువ

మన దేశంలో గత కొన్నేళ్లలో రోటా వైరస్ వ్యాక్సిన్ ను కూడా కోల్డ్ స్టోరేజ్ లో ఉంచుతూనే పిల్లలకు వేశారు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న సౌకర్యాలను బట్టి చూస్తే.. కరోనా వ్యాక్సిన్ లను కోల్డ్ స్టోరేజ్ లో ఉంచుతూ సప్లై చేసేందుకు దాదాపు30% కెపాసిటీ తక్కువగా ఉందని కరోనాపై రీసెర్చ్ లో పాల్గొంటున్న డాక్టర్ గగన్ దీప్ కాంగ్ అంచనా వేశారు. దేశంలోని చాలా మారుమూల ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్ ను చేర్చడం సవాల్ తో కూడుకున్నదని ఆమె చెప్తున్నారు.

1500 కోట్ల డోసులు అవసరం

  • కరోనా వ్యాక్సిన్ లను ప్రతి ఒక్కరికీ రెండు సార్లు ఒక్కో డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా1200 కోట్ల నుంచి1500 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అవసరమని నిపుణుల అంచనా.
  • ప్రపంచవ్యాప్తంగా ఏటా 640 కోట్ల డోసుల ఫ్లూ వ్యాక్సిన్ లను సప్లై చేయగలుగుతున్నారు. కరోనా వ్యాక్సిన్ లకు వచ్చేసరికి.. ఏటా 900 కోట్ల డోసులను ఉత్పత్తి చేయొచ్చని చెప్తున్నారు.
  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కరోనా వ్యాక్సిన్ ల కోసం ఈ ఏడాది చివరినాటికి 52 కోట్ల సిరంజీలను సిద్ధం చేసుకోవాల్సి ఉందని యునిసెఫ్ అంచనా.
  • ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ లను సప్లై చేసేందుకు కనీసం 15 వేల కార్గో ఫ్లైట్స్ అవసరమని జర్మన్ కంపెనీ డీహెచ్ఎల్ అంచనా వేస్తోంది.
  • మోడెర్నా కరోనా వ్యాక్సిన్ ను మైనస్ 15, ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 34 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్దనే స్టోర్ చేయాలి. ఈ టెంపరేచర్లను కచ్చితంగా మెంటైన్ చేయకపోతే వ్యాక్సిన్ లు పని చేయవు.
  • పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాదు.. అమెరికా, యూరోపియన్ హాస్పిటళ్లలో కూడా మైనస్ 70 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్లకు కూల్ చేసే ఫ్రిజ్ లు చాలా తక్కువగా ఉన్నాయి.