న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ వేవ్ ను నియంత్రించడంలో రాబోయే నాలుగు వారాలు కీలకమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెకండ్ వేవ్ లో కరోనా లక్షణాలు కూడా మారుతున్నాయి.
గ్యాస్ట్రిక్ ను లైట్ తీసుకోవద్దు
గుజరాత్ లో నమోదవుతున్న కరోనా కేసుల్లో వైవిధ్యమైన లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు లాంటి సింప్టమ్స్ ను గుర్తించామని వైద్యులు తెలిపారు. కొత్త మూటేషన్ ఊపిరితిత్తులకు త్వరగా అటాక్ అవుతోంది. అలాగే శ్వాస వ్యవస్థ పై ప్రభావం చూపిస్తోంది. సాధారణంగా వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యను లైట్ తీసుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
యువతనూ వదలట్లే
మంచి ఆరోగ్యంతో ఉన్నవారు, యువకులకూ కరోనా సోకడం సెకండ్ వేవ్ లో ఎక్కువగా జరుగుతోంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారినీ కరోనా వదలట్లేదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. కొత్త మ్యూటెంట్ల మీద వ్యాక్సిన్ లు అంతగా పని చేయకపోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయినా సరే టీకా వేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీని వల్ల వైరల్ లోడ్ తగ్గడంతో పాటు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. దీంతోపాటు మాస్కులను కట్టుకుంటూ.. చేతులను, ముట్టుకున్న వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండాలని సలహాలు ఇస్తున్నారు.