కోతుల నుంచి నీళ్ల ద్వారా మనుషులకు సోకిందట
2019 సమ్మర్ లోనే ఇండియాలో వ్యాపించి.. చైనాకు పాకిందంటూ వాదనలు
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సైంటిస్టుల వింత వాదన
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా పుట్టుకపై చైనా మరో వింత వాదన షురూ చేసింది. చైనాలోని వుహాన్ లోనే ఈ వైరస్ పుట్టిందని ప్రపంచమంతా దుమ్మెత్తి పోయడంతో.. ఆ వైరస్ యూరప్ లోని ఇటలీలోనే పుట్టిందంటూ చైనా మొదట్లో చెప్పింది. ఆ తర్వాత అమెరికాలోనే ఇది పుట్టిందంటూ మాట మార్చింది. అయితే.. కరోనా పుట్టింది ఇండియాలోనే కావచ్చు అంటూ ఇప్పుడు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సైంటిస్టులు కొత్త పాట మొదలుపెట్టారు. గతేడాది ఎండాకాలంలో ఇండియాలోనే కరోనా పుట్టిందని వాళ్లు అంటున్నారు. ‘‘ఇండియాలో పుట్టిన కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు కలుషిత నీటి ద్వారా వ్యాపించింది. అక్కడి నుంచి ఎవరికీ తెలియకుండానే వుహాన్ కు చేరింది. వుహాన్లోనే ఈ వైరస్ సంగతి తొలిసారి ప్రపంచానికి తెలిసింది..” అని వారు చెప్తున్నారు.
కోతుల నుంచి వచ్చిందట..
కరోనాపై తాము ఫైలోజెనెటిక్ అనలైసిస్ చేయగా, అది ఇండియాలోనే పుట్టినట్లు తేలిందని చైనీస్ సైంటిస్టులు ఓ రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు. వైరస్ రీప్రొడ్యూస్ అయినప్పుడల్లా దాని డీఎన్ఏలో స్వల్ప మార్పులు జరుగుతాయని, ఈ మ్యుటేషన్ల ఆధారంగా చూస్తే.. వుహాన్ లో దొరికిన వైరస్ ఒరిజినల్ కాదని వారు పేర్కొన్నారు. అసలు వైరస్ ఇండియాలో లేదా బంగ్లాదేశ్, అమెరికా, గ్రీస్, ఆస్ట్రేలియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, రష్యా, సెర్బియా దేశాల్లో పుట్టి ఉండొచ్చని వివరించారు. అయితే ఇండియా, బంగ్లాదేశ్ లో దొరికిన కరోనా వైరస్ శాంపిళ్లలో తక్కువ మ్యుటేషన్లు ఉన్నాయని, అందుకే వైరస్ మొదటగా అక్కడే వ్యాపించి ఉండొచ్చన్నారు. అడవుల్లో నీటి కొరతతో కోతులు, ఇతర జంతువులు జనావాసాల్లోకి రావడం వల్ల మనుషులకు ఈ వైరస్ సోకి ఉండొచ్చని తాము ఊహిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఇండియాలో వైద్య సౌకర్యాలు సరిగ్గా ఉండకపోవడం, యువత ద్వారా ఈ వైరస్ కొన్ని నెలల పాటు సైలెంట్ గా వ్యాపించింది. అందువల్ల 2019 డిసెంబర్ లో వుహాన్ లోనే ఇది పుట్టిందనడం అబద్ధం” అని పేర్కొన్నారు. చైనా వాదనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) శుక్రవారం స్పందించింది. కరోనా వైరస్ చైనాలో కాకుండా ఇతర దేశాల్లో పుట్టిందనడం ‘కేవలం ఊహాగానమే’ అని స్పష్టం చేసింది.
For More News..