కరోనాను కట్టడి చేయరు కానీ.. కరెంటు బిల్లులు పెంచుతరా?

కరోనాను కట్టడి చేయరు కానీ.. కరెంటు బిల్లులు పెంచుతరా?

రాష్ట్ర సర్కారుపై ఉత్తమ్‌‌ ఫైర్‌‌
బీపీఎల్‌‌ కుటుంబాలకు ‘లాక్‌డౌన్‌’ టైమ్‌‌ బిల్లులు మాఫీ చేయాలె
ఎంఎస్ఎంఈలనూ మినహాయించాలె
చాలా మంది జీవనోపాధి కోల్పోయారు.. కిస్తీలన్నా కట్టలేరన్న పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: ‘డబ్ల్యూహెచ్‌‌వో ప్రకటించిన ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానం రాష్ట్రంలో అమలు చేయట్లేదు. దీంతో ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులను చుస్తున్నాం. కరోనా కట్టడిలో ఫెయిలైన సర్కారు.. కరెంటు బిల్లులు పెంచి సామాన్య ప్రజలపై పైసల భారం మోపింది’ అని పీసీసీ చీఫ్‌‌ ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి విమర్శించారు. బీపీఎల్‌‌ కుటుంబాలు, ఎంఎస్‌‌ఎంఈలకు లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌ బిల్లు మొత్తాన్ని మాఫీ చేయాలని డిమాండ్‌‌ చేశారు. ఇతర వినియోగదారులకూ తగిన విధంగా తగ్గించాలన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. ‘జూన్ నెలలో వినియోగదారులకు ఇచ్చిన విద్యుత్ బిల్లులు చాలా అన్యాయం. అవి అతిగా ఉన్నాయి. పైగా తప్పుడు పద్ధతిలో తీశారు. రాష్ట్రంలోని 95 లక్షల మంది విద్యుత్ వినియోగదారుల్లో దాదాపు 75 లక్షల మంది దేశీయ విభాగంలో ఉన్నారు. వీళ్లలో 80 శాతం మంది నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నారు. నెలవారీ ప్రాతిపదికన బిల్లును టీఎస్ ఈఆర్‌‌సీ ఆమోదిస్తే దాన్ని ఉల్లంఘిస్తూ టీఎస్ ఎస్‌‌పీడీసీఎల్ 90 రోజుల వినియోగం ప్రకారం బిల్లులు రూపొందించింది. దీంతో వినియోగదారులకు యూనిట్‌‌కు రూ. 4.3కు బదులు రూ. 9 పడింది. ప్రస్తుత టెలిస్కోపిక్ రహిత పద్ధతికి బదులు టెలిస్కోపిక్ పద్ధతిని బిల్లింగ్‌‌కు వాడాలి’ అని ఉత్తమ్‌‌ డిమాండ్‌‌ చేశారు.

కరెంటు తీసేస్తమని బెదిరిస్తరా?
‘కరోనా వల్ల రాష్ట్రం సహా ప్రపంచమంతా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. లాక్‌‌డౌన్ వల్ల సమాజంలోని అన్ని వర్గాలూ ప్రభావితమయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తమ పౌరులకు సహాయపడటానికి వాటి ప్రాధాన్యతలు మార్చుకుంటున్నాయి. రాష్ట్ర సర్కారు మాత్రం తన విధానాన్ని మార్చుకునే మానసిక స్థితిలో కనిపించడం లేదు’ అని ఉత్తమ్‌‌ విమర్శించారు. విద్యుత్ బిల్లుల్లో లోపాలపై లక్షలాది మంది వినియోగదారులు ఫిర్యాదు చేసినా టీఎస్ ఎస్‌‌పీడీసీఎల్, ఇంధన శాఖ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు. పైగా బిల్లులను కరెక్టు టైమ్‌‌కు కట్టకపోతే కరెంటు తీసేస్తామని చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ‘చాలా మంది తమ జీవనోపాధి కోల్పోయారు. కరెంటు బిల్లులు వాయిదాల్లో చెల్లించే చాన్స్‌‌ ఇచ్చినా బకాయిలను క్లియర్ చేయలేరు’ అన్నారు. నిధులు, డిమాండ్ లేక చాలా ఎంఎస్‌‌ఎంఈలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించలేదని చెప్పారు. వ్యాపారంపై లాక్‌‌డౌన్ ప్రభావాన్ని అధ్యయనం చేయాలని, పరిశ్రమలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
కరెంటు బిల్లుల పెంపుకు వ్యతిరేకంగా జులై 6న అన్ని పట్టణ, మండల విద్యుత్ ఆఫీసుల ముందు నల్ల జెండాలు, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని పార్టీశ్రేణులకు ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. బీపీఎల్ కుటుంబాలను కరెంటు బిల్లుల నుంచి మినహాయించాలని, టెలిస్కోపిక్ పద్ధతిలో బిల్లింగ్‌‌ చేయాలని, చిన్న వ్యాపారస్తులను బిల్లుల నుంచి మినహాయించాలనే డిమాండ్లతో ఆందోళన చేపడుతున్నామన్నారు.

For More News..

గల్ఫ్ కార్మికులకు పెయిడ్ క్వారంటైన్

రోజూ 24 కి.మి. సైకిల్‌‌పై బడికి.. టెన్త్‌‌లో టాప్‌‌ సాధించిన రైతు బిడ్డ

పట్నం కొలువు పాయె.. ఊర్ల పనులే ఆసరాయె..

కరోనా ఎఫెక్ట్: స్కూల్ సిలబస్ లో 30% తగ్గింపు