దేశంలో 657కు పెరిగిన కరోనా కేసులు

దేశంలో 657కు పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య 657కు పెరిగింది. నిన్న ఒక్కరోజే 86 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 602 మంది ఐసోలేషన్ వార్డుల్లో  చికిత్స పొందుతుండగా… 43 మంది వైరస్‌ను జయించి హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు దేశంలో 12 మంది చనిపోయారు. మహారాష్ట్ర, గుజరాత్‌లో ఇద్దరు చనిపోగా.. కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ , వెస్ట్ బెంగాల్, బీహార్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఒక్కొక్కరు కరోనా వైరస్ వల్ల మృతి చెందారు.

దేశంలో మహారాష్ట్ర కరోనా కేసులలో మొదటి స్థానంలో ఉంది. అక్కడ కరోనా కేసుల సంఖ్య 122కి  పెరిగింది. నిన్న కొత్తగా  15 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి.  ఇక కేరళలో నిన్న 9 కొత్త  కేసులు రావడంతో..  ఆ రాష్ట్రంలో  మొత్తం కేసుల  సంఖ్య 118కి చేరింది.  కర్ణాటకలో గత 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు  వచ్చాయి. దీంతో  కర్ణాటకలో ఇప్పటి వరకు 51 మందికి వైరస్ సోకింది.  మన రాష్ట్రంలో 41 కేసులు నమోదుకాగా.. గుజరాత్‌లో 38, రాజస్థాన్‌లో 38 కేసులు నమోదయ్యాయి.  ఉత్తర్ ప్రదేశ్‌లో 38, ఢిల్లీలో 35, హర్యానాలో 31 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.  పంజాబ్‌లో 31, తమిళనాడులో 26, మధ్యప్రదేశ్‌లో 15కు  కేసుల సంఖ్య పెరిగింది.  మధ్యప్రదేశ్‌లో నిన్న ఏడు  కొత్త పాజిటివ్  కేసులు నమోదయ్యాయి.  ఇప్పటి వరకు లడఖ్‌లో 13,  జమ్మూ కశ్మీర్‌లో 11 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న రెండు కొత్త కేసులు రావడంతో..  మొత్తం కేసుల సంఖ్య  10కి చేరింది. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాంలలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా కట్టడి కోసం అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.  అయితే పుదుచ్చేరిలో  జనాలకు నిత్యావసరాలు అందించే క్రమంలో  ఓ  కాంగ్రెస్ ఎమ్మెల్యే  అత్యాత్సాహం చూపించారు.  జనాలను గుంపులుగా నిలబెట్టి  బ్యాగులు పంపిణీ చేశారు.  దీంతో  ఆ ఎమ్మెల్యేపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కూలీలకు వెయ్యి  రూపాయలు  రిలీజ్ చేసింది. అందులో భాగంగా మొత్తం మూడున్నర  లక్షల మందికి కశ్మీర్ సర్కార్ డబ్బులు ఇవ్వనుంది.