దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇటీవల వరుసగా రోజూ వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు అత్యధికంగా మంగళవారం ఒక్క రోజులో 1463 మంది వైరస్ బారినపడగా.. గడిచిన 24 గంటల్లో 1118 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు గుర్తించారు. అలాగే 39 మంది కరోనాతో మరణించారు. దీంతో బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,933కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 392 మంది మరణించగా.. 1344 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఆస్పత్రుల్లో 10197 మంది చికిత్స పొందుతున్నారని చెప్పింది. మహారాష్ట్రలో అత్యధికంగా 2687 మంది వైరస్ బారినపడ్డారు. ఢిల్లీలో 1561, తమిళనాడులో 1204, రాజస్థాన్ లో 1005 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశాన్ని మూడు కేటగిరీలుగా..
కరోనా వైరస్ కేసుల ఆధారంగా దేశాన్ని హాట్ స్పాట్, నాన్ హాట్ స్పాట్, గ్రీన్ జోన్ జిల్లాలు అని మూడు కేటగిరీలుగా విభజిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. ఇప్పటి వరకు 170 హాట్ స్పాట్, 207 నాన్ హాట్ స్పాట్, మిగిలినవి గ్రీన్ జోన్ జిల్లాలుగా గుర్తించినట్లు తెలిపారు. హాట్ స్పాట్స్ లో డోర్ టూ డోర్ సర్వే చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదని, కొన్ని ప్రాంతాల్లో లోకల్ ఔట్ బ్రేక్ మాత్రమే ఉందని చెప్పారాయన.