ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలను కరోనావైరస్ వణికిస్తోంది. నిన్న ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో 32 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 310 దాటింది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో డిప్యూటీ మేయర్ తో పాటు, ఆమె భర్తకు, పిల్లలకు వైరస్ సోకింది. బీజేపీకి చెందిన ఓ కార్పోరేటర్ భర్తతో పాటు మరో బీజేపీ నేత కుటుంబానికి కరోనా అంటుకుంది. నాయకులు ఎక్కువగా ప్రజల్లో తిరగడం, వారితో ప్రైమరీ కాంటాక్టులు, సెకండరీ కాంటాక్టుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. వైరస్ ఎవరి నుంచి ఎవరికి సోకిందనే విషయంలో స్పష్టత లేక జనం ఆందోళన చెందుతున్నారు.
కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేయడంతో.. ఇదే అదనుగా వైరస్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కరీంనగర్ జిల్లాలో పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా దీని జాడలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 310కి పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలో 132 మంది వైరస్ బారినపడగా.. జగిత్యాల జిల్లాలో 57, రాజన్న సిరిసిల్లలో 51 మందికి, పెద్దపల్లి జిల్లాలో 46 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో ఐదుగురు చొప్పున.. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోయారు. కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం మందిలో వైరస్ ఎక్కడి నుంచి సోకిందన్న విషయం తెలియడం లేదు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఎక్కువ కేసులు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికుల ద్వారా వచ్చినప్పటికీ.. కరీంనగర్ జిల్లాలో మాత్రం హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ల ద్వారా మరియు ఆస్పత్రులకు వెళ్లి వచ్చిన వాళ్ల ద్వారా వచ్చాయి. వాళ్ల ద్వారా ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు వైరస్ విస్తరించి ఆందోళన కలిగిస్తోంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో నేతలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. మొదట కరీంనగర్ డిప్యూటీ మేయర్ భర్తకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ కు, ఆమె పిల్లలిద్దరికీ కూడా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత నిన్న బీజేపీకి చెందిన ఓ కార్పోరేటర్ భర్త కరోనా భారిన పడ్డారు. అంతకు ముందు కూడా ఓ బీజేపీ నేతకు మరియు అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అధికార పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్ కుటుంబంతో కాంటాక్టు అయిన వారిలో చాలా మంది కార్పోరేటర్లు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. వీరిలో మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి లాంటి వాళ్లు ఉన్నారు. వీరిలో మంత్రి గంగుల మాత్రం కొద్ది రోజులు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉన్నారు. కానీ కలెక్టర్ సహా చాలా మంది బయట తిరుగుతూనే ఉన్నారు. వీరిలో కొంతమంది మాత్రమే పరీక్షలు చేయించుకుని హోం క్వారంటైన్ లో ఉండగా.. మిగతా వాళ్లు బయట తిరుగుతూనే ఉన్నారు. సాధారణ పౌరులకు కరోనా సోకితే కాంటాక్టు లిస్టు తొందరగా ట్రేస్ చేయొచ్చు. కానీ నేతలకు సోకితే వారితో ఉన్న ప్రైమరీ సెకండరీ కాంటాక్టులు గుర్తించడం చాలా కష్టమేనని చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి తాము నేతలను కలిసినట్లు కూడా గుర్తుండదు. ఒకవేళ గుర్తున్నా.. మాకెందుకు సోకుతుందిలే అన్న నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇక కరోనా లెక్కల విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న బులిటెన్ కు.. స్థానికంగా విడుదల చేస్తున్న వివరాలకు పొంతన ఉండటం లేదు. ఉదాహరణకు నిన్న సిరిసిల్ల జిల్లాలో ఏడుగురికి కరోనా సోకినట్లు ప్రకటించగా.. స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్ మూడు కేసులు మాత్రమే చూపించింది. పెద్దపల్లి జిల్లాలో నాలుగు కేసులు వచ్చినట్లు అక్కడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించగా.. స్టేట్ బులిటెన్ లో పెద్దపల్లి జిల్లా పేరే కనిపించలేదు. ఇక కరీంనగర్ జిల్లాలో ఎన్ని కేసులొచ్చాయన్న కనీస సమాచారం కూడా జిల్లా అధికారులు విడుదల చేయలేదు. స్టేట్ బులిటెన్ లో మాత్రం 18 మందికి కరోనా సోకినట్లు ప్రకటించారు. మరి ఈ 18 మంది ఏ ప్రాంతం వాళ్లు? ఏ ఊరివాళ్లు? వాళ్లను ఇంట్లోనే ఉంచారా? ఆస్పత్రికి తరలించారా? వంటి కనీస సమాచారం స్థానికులకు తెలియకుండా పోయింది. ఇలాంటి వివరాలు అధికారులు ప్రకటిస్తే.. కనీసం ఆ ఏరియా ప్రజలు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు మాత్రం ఏమీ జరగనట్లే వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్ల ద్వారా కరోనా వెలుగు చూసినప్పుడు మాత్రం చాలా పకడ్బందీ చర్యలు చేపట్టి వైరస్ ను కట్టడి చేశారు. ఆనాటి శ్రద్ధ ఇప్పుడేమైందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో చాలా గ్రామాల్లో ఇప్పటికే సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. వీణవంక మండలం వల్భాపూర్, మానకొండూరు మండల కేంద్రం, గంగాధర మండలం గర్షకుర్తి, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామ పంచాయితీలు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించాయి. కొన్ని చోట్ల డప్పు చాటింపులతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ప్రభుత్వం పనితీరు ఎలా ఉన్నా.. ఇప్పుడు వైరస్ సోకకుండా జాగ్రత్త పడాల్సింది ప్రజలు మాత్రమే. అయితే అధికారులు కూడా కరోనా పేషెంట్ల వివరాలు ప్రకటించి.. కనీసం కేసులు వెలుగు చూసిన ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుకుంటున్నారు జిల్లా వాసులు. ప్రజలు బయటకు వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. వైరస్ మాత్రం ఏదో రూపంలో మనుషులకు సోకుతూనే ఉండటం అందోళన కలిగిస్తోంది.
For More News..