- గ్రేటర్ హైదరాబాద్,నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో కరోనా చైన్
- 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌లో కేసులు
- 7 జిల్లాల్లో కంట్రోల్‌లోకి వైరస్
- రాష్ట్రంలో సగానికి పైగా కేసులు జీహెచ్‌ఎంసీలోనే
- సూర్యాపేటలో కూరగాయల మార్కెట్ నుంచి వ్యాప్తి
- వైరస్ వ్యాప్తిని సక్సెస్‌ఫుల్‌గా ఆపిన కరీంనగర్, వరంగల్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్‌లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సగానికిపైగా (430) జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మర్కజ్ వ్యవహారం తర్వాత ఇక్కడ కేసులు బాగా పెరిగాయి. ఆ తర్వాత ఎక్కువ కేసులు నిజామాబాద్‌లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 59 మందికి వైరస్ సోకింది. ఇక్కడి చాలా వరకు కేసులు మర్కజ్‌తో లింకున్నవే. సూర్యాపేటలో ఇప్పటివరకు 54 మందికి వైరస్ అంటుకుంది. ఇక్కడ గత రెండ్రోజుల్లోనే 31 కేసులు నమోదయ్యాయి. వీళ్లలో చాలా మందికి మర్కజ్ లింక్ లేదు. వికారాబాద్‌లోనూ ఇప్పటికే 34 కేసులున్నాయి. 15 జిల్లాల్లో మాత్రం సింగిల్ డిజిట్ దగ్గరే కేసులు ఆగిపోయాయి. 7 జిల్లాల్లో వారం రోజులుగా ఒక్క కేసు కూడా నమోదవలేదు. మొదట్లో ఎక్కువ కేసులు నమోదైన కరీంనగర్, వరంగల్ జిల్లాలు కరోనాను బాగా కట్టడి చేశాయి.
సూర్యాపేటలో మర్కజ్ లింక్ లేకుండానే..
సూర్యాపేటలో గత రెండ్రోజుల్లో వైరస్ సోకిన వాళ్లలో చాలా మందికి మర్కజ్ లింక్ లేదు. మర్కజ్ పోయొచ్చినోళ్లతో కూడా కాంటాక్ట్ కాలేదు. లోకల్‌గానే ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకింది. సూర్యాపేటలోని ఓ కూరగాయల మార్కెట్ కేంద్రంగా వ్యాపించింది. నిత్యం పదుల మందిని కలిసే కూరగాయల వ్యాపారులు, ఫార్మాసిస్ట్, చికెన్ షాపులో పనిచేసే వ్యక్తి, ఎంపీడీవో ఆఫీసులో కంప్యుటర్ ఆపరేటర్ వైరస్ బారిన పడ్డారు. మర్కజ్ వెళ్లొచ్చిన ఓ వ్యక్తి నుంచి మార్కెట్ దగ్గర కిరాణ షాపు యజమానికి సోకితే, అతని ద్వారా మరో పది మందికి సోకినట్టు అధికారులు చెబుతున్నరు. తాజాగా నమోదైన కేసుల్లో మార్కెట్‌తో సంబంధమున్న మరికొంతమందికి వైరస్ ఉన్నట్టు తేలింది. ఇక్కడ కమ్యునిటీలోకి వైరస్ వెళ్లిపోయిందని, రానున్న 10 రోజుల్లో భారీగా కేసులు నమోదయ్యే అవకాశముందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని, రెడ్ జోన్లుగా ప్రకటించి ఇండ్లలో నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నామని చెప్పారు.
ఎట్లొచ్చిందో తెలుస్తలె
గ్రేటర్‌లో మర్కజ్‌తో సంబంధం లేని బయటి వ్యక్తులకూ వైరస్ వ్యాపించింది. ఇక్కడి సుమారు 5 శాతం కేసుల్లో స్పష్టమైన లింక్ దొరకడం లేదని సర్వైలెన్స్ అధికారి వివరించారు. నార్సింగిలో ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్ వచ్చి వారం అవుతోందని, ఆయనకెలా వచ్చిందో ఇప్పటికీ తెలియలేదన్నారు. తుక్కుగూడలో కూడా ఓ వ్యక్తికి ఎట్లొచ్చిందో స్పష్టత లేదన్నారు. సిటీలోని పలు ప్రాంతాలో ఇలాంటి కేసులున్నాయని తెలిపారు. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి ఇన్‌ఫెక్ట్ అయ్యారని మరో అధికారి చెప్పారు. దీన్ని కమ్యూనిటీ స్ర్పెడ్ అనలేమని, ఒకేసారి ఒకే ఏరియాలో పదుల సంఖ్యలో కేసులు నమోదైతేనే కమ్యునిటీ స్ర్పెడ్ అంటారని చెప్పారు.
నిజామాబాద్‌లో ఏప్రిల్ 1 నుంచి
హైదరాబాద్ తర్వాత ఎక్కువ కేసులు నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. చాలా కేసులు మర్కజ్ లింక్‌వే కావడం గమనార్హం. ఏప్రిల్ ఒకటి నుంచి దాదాపు ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కేసులు 60కి దగ్గర్లో ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి. శుక్రవారం ఒక్క రోజే 305 మంది అనుమానితులను గుర్తించి శాంపిల్స్ సేకరించారు. ఇక్కడి నుంచి మర్కజ్ వెళ్లొచ్చిన ముగ్గురు వ్యక్తులు విషయం దాచి పెట్టారు. వారం క్రితం పోలీసులు గుర్తించి టెస్టులు చేయిస్తే పాజిటివ్ వచ్చింది. వాళ్ల కుటుంబీకులకూ వైరస్ అంటుకుంది. 20 రోజుల పాటు వాళ్లు ఎవరెవరిని కలిశారో అధికారులు ఆరా తీస్తున్నారు.
కరీంనగర్, వరంగల్ గ్రేట్
కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాలు కరోనాను సక్సెస్ ఫుల్‌గా కట్టడి చేశాయి. ఇండోనేషియా టీమ్‌కి పాజిటివ్ అని తేలగానే వాళ్లు తిరిగిన ప్రాంతాలన్నింటినీ లాక్‌డౌన్ చేశారు. జనాలను బయటకు రానివ్వలేదు. వరంగల్ అర్బన్ జిల్లాలో వారం రోజుల్లోనే 24 కేసులు నమోదయ్యాయి. ఆ కాలనీలన్నింటినీ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. కంటెయిన్మెంట్ చేశారు. ఈ 2 జిల్లాలో ఇప్పటికైతే కొత్త కేసులు నమోదు కాలేదు.
సింగిల్ డిజిట్ దగ్గరే ఆగింది
రాష్ర్టంలోని 29 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. 15 జిల్లాలు సింగిల్ డిజిట్ దగ్గరే ఆగాయి. 7 జిల్లాల్లో కొత్త కేసులు నమోదై వారం దాటింది. కొత్తగూడెంలో 14 రోజుల క్రితం చివరి కేసు నమోదైంది. ములుగు, సిద్దిపేట, పెద్దపల్లి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జనగాం జిల్లాల్లో వారం రోజులుగా కొత్త కేసులు నమోదవలేదు. క్వారంటైన్‌లో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులకూ టెస్టులు పూర్తయ్యాయి. నారాయణపేట్, వనపర్తి, భువనగరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.