మ‌హారాష్ట్ర‌లో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు: దేశంలో మూడో వంతు..

మ‌హారాష్ట్ర‌లో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు: దేశంలో మూడో వంతు..

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండం చేస్తోంది. దేశంలోనే అత్య‌ధిక కేసుల‌తో రోజు రోజుకీ భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లోనే రాష్ట్రంలో 3493 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో మ‌హారాష్ట్ర‌లో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష దాటిపోయింది. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై శుక్ర‌వారం రాత్రి మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,493 కొత్త క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య 1,01,141కి చేరింది. క‌రోనాతో పోరాడుతూ ఇవాళ‌ 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3717కు పెరిగింది. అయితే ఆస్ప‌త్రుల్లో చికిత్స త‌ర్వాత క‌రోనా నుంచి కోలుకుని ఇప్ప‌టి వ‌ర‌కు 47,793 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 51,455 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. మ‌హారాష్ట్ర‌లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో స‌గానికి పైగా ఒక్క‌ ముంబైలోనే ఉన్నాయి. ముంబై సిటీలో ఇప్ప‌టి వ‌ర‌కు 55,451 మంది వైర‌స్ సోక‌గా.. వారిలో 1954 మంది మ‌ర‌ణించారు. కాగా, దేశంలో మొత్తం క‌రోనా కేసులు దాదాపు మూడు ల‌క్ష‌ల‌కు చేర‌గా.. అందులో మూడో వంతు మ‌హారాష్ట్ర‌లోనే ఉన్నాయి.