ప్రపంచ వ్యాప్తంగా గత నెలలో ప్రతి రోజూ సగటున 80 వేల చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు చెప్పారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్. అనేక దేశాల్లో వైరస్ వ్యాప్తి విజృంభణ కొనసాగుతూనే ఉందని అన్నారు. కొద్ది రోజులుగా వెస్ట్రన్ యూరప్ దేశాల్లో కేసులు క్రమంగా తగ్గుతున్నాయని, భారత్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. భారత్ వంటి దేశాల్లో కొత్త పీక్స్ టచ్ అవుతున్నాయన్నారు టెడ్రోస్. అయితే ప్రస్తుతం ఇతర దేశాల నుంచి వైరస్ వచ్చే ముప్పు తప్పిందని అన్నారు. అన్ని ప్రభుత్వాలు.. ప్రజలకు కరోనా గురించి పూర్తిగా అవగాహన కల్పించాలని, ఈ వైరస్ ను ఎదుర్కొంటూ ఎలా బతకాలన్నది తెలియజేయాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలన్నారు. ఉమ్మడిగా వైరస్ పై పోరాడాలని పిలుపునిచ్చారు.
టెస్టులు పెరగడంతో కొన్ని దేశాల్లో భారీగా కేసులు
బుధవారం వరకు 35 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. రెండున్నర లక్షల మంది మరణించినట్లు తెలిపారు టెడ్రోస్. ఏప్రిల్ నెల మొదటి నుంచి ప్రతి రోజు సగటున 80 వేల కొత్త కేసులు నమోదైనట్లు చెప్పారు. వైరస్ కేసులను కేవలం నంబర్లుగా చూడలేమని, ప్రతి బాధితుడూ ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు, ఒక ఫ్రెండ్ ఇలా ఏదో ఒక బంధమన్న విషయం గుర్తించాలని అన్నారు. కరోనా వైరస్ సోకడాన్ని తేలికగా తీసుకోకుండా వ్యాప్తిని కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటించడం లాంటివి తప్పక పాటించాలని సూచించారు. కొద్ది రోజులుగా పశ్చిమ ఐరోపాలో కేసులు తగ్గుతుండగా.. తూర్పు ఐరోపా, ఆప్రికా, ఆసియా దేశాలు సహా అమెరికాల్లో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగతోందని అన్నారు. అయితే కొన్ని దేశాల్లో ఇటీవల టెస్టుల సంఖ్య బాగా పెరగడంతో భారీగా కొత్త కేసులు బయటపడుతున్నాయని అన్నారు టెడ్రోస్.