రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా ఫీజులు
ఫీజులో రాయితీ ఇస్తామంటూ ముందస్తు అడ్మిషన్లు
పట్టించుకోని విద్యాశాఖ ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీల అడ్మిషన్ల దందా మొదలైంది. ఇంకా పదో తరగతి పరీక్షలు జరగలేదు.. అప్పుడే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. పేరెంట్స్ బలహీనతను ఆసరా చేసుకొని 2025–26 విద్యాసంవత్సరం ప్రారంభానికి ఆరేడు నెలల ముందు నుంచే ప్రవేశాలు చేపడ్తున్నారు. ముందే అడ్మిషన్లు తీసుకుంటే.. ఫీజులో రాయితీ ఉంటుందని మభ్యపెడుతున్నారు.
ఇదంతా ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జామ్ ఫీజు గడువు రూ.వెయ్యి ఫైన్ తో ఈ నెల 22 వరకు ఉన్నది. మొత్తంగా సుమారు 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు అటెండ్ కానున్నారు. పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ కావాలనేదానిపైనే విద్యార్థులు, పేరెంట్స్ ధ్యాసంతా ఉన్నది.
కానీ, రాష్ట్రంలో పేరుమోసిన కార్పొరేట్ కాలేజీలు మాత్రం అడ్మిషన్ల దందాకు తెరలేపాయి. పదో తరగతి పరీక్షా తేదీలు ప్రకటించకంటే ముందే.. ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. అక్టోబర్ నుంచే పేరెంట్స్ తో సీట్ల బేరాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే పలు కాలేజీల్లో 50 శాతం వరకు అడ్మిషన్లు పూర్తయ్యాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే ప్రవేశాలు చేపట్టాలనే నిబంధన ఉన్నా.. కార్పొరేట్ కాలేజీలు అవేవీ పట్టించుకోవడం లేదు.
మెజార్టీ కాలేజీలు గ్రేటర్ హైదరాబాద్ చుట్టే..
రాష్ట్రంలో 200లకు పైగా ఇంటర్ కార్పొరేట్ కాలేజీలున్నాయి. వీటిలో దాదాపు మెజార్టీగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల్లోనే ఉన్నాయి. ఆయా కాలేజీలు పీఆర్వోలను నియమించుకున్నాయి. జేఈఈ, నీట్, ఎప్ సెట్ లో స్పెషల్ కోచింగ్ అంటూ పేరెంట్స్ కు పీఆర్వోలు ఎర వేస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్ కాలేజీల్లో సీట్లు కావాలంటే రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా ఫీజులు నిర్ణయించారు.
ముందుస్తు అడ్మిషన్లు తీసుకుంటే.. రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా ఉంటుందని పేరెంట్స్ కు ఆశ చూపుతున్నారు. కార్పొరేట్ కాలేజీలే కృత్రిమ కొరతను సృష్టించి.. చివరికి సీట్లు కేటాయిస్తున్నారు. వాస్తవానికి ఇంటర్ అకాడమిక్ ఇయర్.. జూన్ లో మొదలై, మార్చిలో ముగుస్తుంది. కానీ.. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసేందుకు ఇంకా ఆరు నెలల గడువు ఉన్నా.. ఇప్పటి నుంచే అడ్మిషన్ల దందా నిర్వహించడం గమనార్హం.
స్కూళ్ల నుంచి ఫోన్ నంబర్లు.
ఇంటర్ లో అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కాలేజీలు పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులతో పాటు సర్కారు టీచర్లూ ఉన్నారనే ఆరోపణలున్నాయి. వీరంతా ఆయా మండల, ఏరియాల్లోని ప్రైవేటు, సర్కారు స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థుల పేరెంట్స్ ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. దీనికిగానూ స్కూల్ వాళ్లకు కార్పొరేట్ కాలేజీలు నగదు లేదంటే గిఫ్టులు ఇస్తున్నాయి.
ఏసీ, నాన్ ఏసీ పేర్లతో అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఒక్కో పేరెంట్ నుంచి రూ.25వేల నుంచి రూ.50వేల వరకూ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. అయితే, టెన్త్ రిజల్ట్స్ వచ్చాక ఆ కాలేజీలో చేరేందుకు విద్యార్థి నిరాకరిస్తే.. తిరిగి డబ్బులు ఇవ్వడంపై గతంలోనూ అనేక ఘటనలు వెలుగుచూశాయి. అయితే, వీటిలో కొన్ని కాలేజీలకు గుర్తింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు, విద్యాశాఖ అధికారులు స్పందించి, కార్పొరేట్ కాలేజీల ముందస్తు అడ్మిషన్ల దందాకు చెక్ పెట్టాలని పేరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.