అర్హతలేనోళ్లతో ఐసీయూ డ్యూటీలు..కార్పొరేట్​ హాస్పిటల్స్​లో కొనసాగుతున్న దందా

అర్హతలేనోళ్లతో ఐసీయూ డ్యూటీలు..కార్పొరేట్​ హాస్పిటల్స్​లో కొనసాగుతున్న దందా
  • గుట్టుగా డీఎంహెచ్‌‌‌‌ఓలతో సెటిల్మెంట్లు
  • మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో బయటపడ్డ నిజాలు
  • కార్పొరేట్ల కక్కుర్తికి రిస్క్​లో పేషెంట్ల ప్రాణాలు
  • నష్టపోతున్న ఒరిజినల్ ఎంబీబీఎస్ డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు : అడ్డగోలు ఫీజులతో జనాలను దోస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్లు అర్హత లేని డాక్టర్లతో పేషెంట్లకు వైద్యం చేయిస్తున్నాయి. కనీసం ఎంబీబీఎస్ కూడా పాస్  అవ్వని వారితో ఐసీయూలో డ్యూటీలు చేయిస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రాష్ట్రంలో అనేక కార్పొరేట్‌‌‌‌, బడా ప్రైవేటు హాస్పిటళ్లలో నకిలీ డాక్టర్ల దందా యథేచ్చగా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లోని కొన్ని ఆసుపత్రుల్లో స్టేట్  మెడికల్  కౌన్సిల్  బృందాలు ఇటీవల తనిఖీలు నిర్వహించాయి.

బడా హాస్పిటళ్లలో నాన్ ఎంబీబీఎస్‌‌‌‌  డాక్టర్లు ఉన్నట్లు  తనిఖీ బృందాలు గుర్తించాయి. డ్యూటీ మెడికల్  ఆఫీసర్లుగా వారిని నియమించుకుని పేషెంట్లకు ట్రీట్‌‌‌‌మెంట్  చేయిస్తున్నట్లు బృందం సభ్యులు గుర్తించారు. దీంతో ఆయా హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేశారు. ఇలాంటి చర్యలను సహించేదిలేదని అన్ని ఆసుపత్రులకు కౌన్సిల్  సర్క్యులర్  జారీ చేసింది. జూన్  చివరి నుంచి రెండో రౌండ్  తనిఖీలు నిర్వహిస్తామని, ఈసారి అదే తప్పు రిపీట్  చేసిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని కౌన్సిల్  మెంబర్  ఒకరు ‘వెలుగు’ కు తెలిపారు.

ఇచ్చేది తక్కువ..చార్జ్‌‌‌‌  చేసేది ఎక్కువ

కార్పొరేట్  హాస్పిటళ్లలో డాక్టర్  విజిటింగ్ చార్జీలు వేలల్లో ఉంటాయి. వార్డులో లేదా ఐసీయూలో ఉన్న పేషెంట్‌‌‌‌ను ఒక్కసారి వచ్చి చూసి పోయినందుకు రూ.2 వేల నుంచి పది వేల వరకూ చార్జ్  చేస్తున్నారు. ఇన్నేసి వేలు చెల్లించేది ఏ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌  కోసమో అని పేషెంట్లు అనుకుంటారు. కానీ, కనీసం ఎంబీబీఎస్  కూడా పాస్  అవ్వని వాళ్లను డాక్టర్లుగా పెట్టి, పేషెంట్ల వద్ద అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. బీఏఎంఎస్‌‌‌‌, బీహెచ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌, బీయూఎంఎస్‌‌‌‌, ఫార్మ్‌‌‌‌ డీ వంటి కోర్సులు చేసిన వాళ్లను తీసుకొచ్చి అల్లోపతి స్పెషలిస్ట్‌‌‌‌  డాక్టర్లుగా పేషెంట్లకు ట్రీట్‌‌‌‌మెంట్  చేయిస్తున్నారు.

ఆయుర్వేద కోర్సులు పూర్తిచేసిన వారికి పెద్దగా డిమాండ్  లేకపోవడంతో తక్కువ జీతాలకు పనిచేయడానికి వాళ్లు సిద్ధపడుతున్నారు. దీంతో ఇలాంటి వాళ్లకు కార్పొరేట్  హాస్పిటళ్లు తక్కువ జీతాలు చెల్లించి డాక్టర్లుగా నియమించుకుంటున్నాయి. వారితో పాటు తజకిస్తాన్, చైనా, ఫిలిప్పీన్స్  తదితర దేశాల్లో మెడికల్  కోర్సులు చేసి ఎఫ్‌‌‌‌ఎంజీ (ఫారిన్  మెడికల్  గ్రాడ్యుయేట్స్‌‌‌‌) ఎగ్జామ్‌‌‌‌  పాస్  అవ్వని వాళ్లను కూడా నియమించుకుంటున్నాయి. ఇతర దేశాల్లో మెడికల్  కోర్సులు చదివిన వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత ఎఫ్‌‌‌‌ఎంజీ ఎగ్జామ్ రాసి పాస్  కావాలి.

అనంతరం ఇక్కడి ఆసుపత్రుల్లో ఇంటర్న్‌‌‌‌షిప్  చేయాలి. ఆ తర్వాతే వారిని డాక్టర్లుగా గుర్తిస్తారు. కానీ, చాలా మంది ఎఫ్‌‌‌‌ఎంజీ  ఎగ్జామ్ పాస్ కావడం లేదు. అలాంటి వారితో ఎమర్జెన్సీ యూనిట్, ఐసీయూల్లో డ్యూటీలు వేస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌లోని ప్రముఖ హాస్పిటళ్లలో  నైట్‌‌‌‌  డ్యూటీలు చేసేదంతా అలాంటి సగం డాక్టర్లే ఉన్నారు. ఇంకా కొన్ని హాస్పిటళ్లైతే ప్రభుత్వ, ప్రైవేటు ఆయుర్వేద కాలేజీల్లో స్టూడెంట్లను నైట్  డ్యూటీ మెడికల్  ఆఫీసర్లుగా నియమించుకుంటున్నాయి. నైట్ వార్డుల్లో పేషెంట్లను చూసుకోవడం, ఎమర్జెన్సీలో వచ్చే పేషెంట్లకు ట్రీట్‌‌‌‌మెంట్  చేయడం

కేసు షీట్లు రాయడం వంటి పనులు వారితో చేయిస్తున్నారు. ఇవన్నీ ఆయా జిల్లాల మెడికల్  ఆఫీసర్లు, డిప్యూటీ మెడికల్  ఆఫీసర్లకు తెలిసే జరుగుతున్నాయని, వారు ఆ హాస్పిటళ్లతో కుమ్మక్కవడం వల్లే నకిలీ దందా యథేచ్చగా సాగుతోందని డాక్టర్లు చెబుతున్నారు.

అసలు డాక్టర్లకు నష్టం

హాస్పిటల్  యాజమాన్యాలు చేస్తున్న దందాతో అసలు డాక్టర్లు నష్టపోతున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎంబీబీఎస్  సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. మన రాష్ట్రంలో 8,490 ఎంబీబీఎస్  సీట్లు ఉన్నాయి. వాటితో పాటు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్య కూడా పెరిగింది. జనాలు కూడా ఎంబీబీఎస్  డాక్టర్ల కన్నా  స్పెషలిస్ట్  డాక్టర్లతో ట్రీట్‌‌‌‌మెంట్  చేయించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎంబీబీఎస్  డాక్టర్లకు సరైన ప్రాక్టీస్  దొరకడం లేదు.

దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేయడానికి, ప్రైవేటు హాస్పిటళ్లలో డ్యూటీ డాక్టర్లుగా పని చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఎంబీబీఎస్ డాక్టర్లకైతే ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో నకిలీ డాక్టర్లను  ప్రైవేటు హాస్పిటళ్లు నియమించుకుంటున్నాయి. దీంతో ఎంబీబీఎస్‌‌‌‌ డాక్టర్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి.

చర్యలు తీసుకుంటాం

చాలా దవాఖాన్లు నాన్ ఎంబీబీఎస్‌‌‌‌  వ్యక్తులను డ్యూటీ మెడికల్  ఆఫీసర్లుగా నియమించుకుంటున్నాయి. మార్చి, ఏప్రిల్‌‌‌‌లో మేము హాస్పిటళ్లలో చేసిన తనిఖీల్లో అలాంటి వారిని గుర్తించాం. వారితో పేషెంట్లకు ట్రీట్‌‌‌‌మెంట్  చేయించడం లేదని, హాస్పిటల్  అడ్మినిస్ట్రేషన్‌‌‌‌  పనులకు వినియోగించుకుంటున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ, వారితో కేసు షీట్లు రాయించడం, నైట్ డ్యూటీలు చేయించడం మేము గుర్తించాం.

ఇవన్నీ చట్ట వ్యతిరేక పనులు. ఐఎంఏ, మెడికల్  కౌన్సిల్  యాక్ట్‌‌‌‌ ప్రకారం నాన్ ఎంబీబీఎస్‌‌‌‌లను నియమించుకోవడం నేరం. ఇప్పటికే అన్ని హాస్పిటళ్లకు సర్క్యులర్  ఇచ్చాం. భవిష్యత్తులో జరగబోయే తనిఖీల్లో నాన్ ఎంబీబీఎస్‌‌‌‌లతో పనిచేయించుకున్నట్లు తేలితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 

– డాక్టర్ మహేశ్‌‌‌‌, చైర్మన్, 
తెలంగాణ స్టేట్  మెడికల్  కౌన్సిల్