
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో పార్కింగ్పేరిట దోపిడీ కొనసాగుతోంది. షాపింగ్‌మాల్స్ తో పాటు కార్పొరేట్హాస్పిటల్స్, సర్కారు దవాఖానలు ప్రభుత్వ జీఓను పట్టించుకోకుండా వాహనదారుల దగ్గర పార్కింగ్‌ఫీజు వసూలు చేస్తున్నాయి. మాల్స్, హాస్పిటల్స్, కమర్షియల్కాంప్లెక్స్లకు వచ్చే వాహనదారులకు పార్కింగ్సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులదే అంటూ హైకోర్టు మొట్టికాయలు వేయడంతో అప్పటి ప్రభుత్వం 2018లో జీఓ63ని జారీ చేసింది. బిల్డింగ్నిర్మించే టైంలో బిల్డింగ్ స్పేస్‌లో 40 శాతం పార్కింగ్‌కు స్పేస్ కేటాయిస్తున్నట్టు చూపి పర్మిషన్తీసుకుంటారు కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా పార్కింగ్‌ఫీజు తీసుకోకూడదని జీఓ చెప్తున్నది. జీఓలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించి విధి విధానాలను పొందుపరిచింది. కానీ, ఆ జీఓను ఎవరూ పట్టించుకోవడం లేదు.
జీఓ 63 ఏం చెప్తుందంటే..
షాపింగ్‌మాల్స్, ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లలో ఎవరైనా తమ వెహికల్పార్క్చేస్తే మొదటి అరగంట ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. 30 నిమిషాలు దాటి గంటలోపు అయితే ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్టు బిల్లు చూపిస్తే సరిపోతుంది. ఆ వస్తువు విలువ ఎంత ఉన్నా అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ పార్కింగ్సమయం గంట దాటితే పార్కింగ్‌ఫీజు కంటే ఎక్కువ మొత్తం కొనుగోలు చేసిన బిల్లు చూపిస్తే సరిపోతుంది. ఈ రూల్స్‌కు విరుద్ధంగా ఎవరైనా వసుళ్లకు పాల్పడుతున్నట్టయితే జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ లేదా టౌన్ ప్లానింగ్ ఏసీపీలకు ఫిర్యాదు చేయొచ్చు. వారు కూడా నిర్లక్ష్యం వహిస్తే నేరుగా బల్దియా హెడ్ ఆఫీసులో కమిషనర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. కాగా, ఈ రూల్స్సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రం వర్తించవు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో..
జూబ్లీహిల్స్ లోని పేరు మోసిన ఓ కార్పొరేట్దవాఖానలో పార్కింగ్పేరిట అందినకాడికి దండుకుంటున్నారు. ఇక్కడ ఫోర్ వీలర్ కు 3 గంటల్లోపు మినిమం రూ.50, టూ వీలర్ అయితే 5 గంటల్లోపు మినిమం రూ.30 తీసుకుంటున్నారు. ఈ సమయం దాటిన తర్వాత కారుకు అదనంగా గంటకు రూ.20, టూవీలర్ కు రూ.10 చొప్పున కలెక్ట్చేస్తున్నారు. కారుకు12 గంటలకు పాస్ తీసుకునే ఫెసిలిటీ కూడా కల్పించి రూ.100, బైక్ పాస్ అయితే రోజుకు రూ.50 వసూలు చేస్తున్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లో ఉన్న ఓ పిల్లల కార్పొరేట్దవాఖానలోనూ పార్కింగ్ పేరిట బాదుతున్నారు.
సారీ సర్.. మాకు అథారిటీ లేదు
హైడ్రా రాక ముందు బల్దియాలో భాగమైన ఈవీడీఎం పార్కింగ్ కి సంబంధించి కంప్లయింట్స్వస్తే చర్యలు తీసుకునేది. పెనాల్టీలు వేసి కంప్లయింట్చేసిన వారికి సమాధానం ఇచ్చేవారు. హైడ్రా వచ్చాక ఈవీడీఎంలోని కొన్ని బాధ్యతలను వారికి అప్పగించింది. పార్కింగ్ కు సంబంధించిన సమస్యలను బల్దియాకే అప్పజెప్పడంతో వారు లైట్తీసుకుంటున్నారు. పార్కింగ్ ఫీజులపై ఎవరు ఫిర్యాదు చేస్తున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. గతంలో హెల్ప్ లైన్ నెంబర్ 040–21111111 కి కాల్ చేస్తే ఫిర్యాదులు తీసుకునేవారు.
కానీ, ఇప్పుడు ఈ నంబర్‌కు కాల్ చేస్తే తమకు పార్కింగ్ కి సంబంధించి ఫిర్యాదు తీసుకునే అథారిటీ లేదని చెప్తున్నారు. గత నెల 20న జూబ్లీహిల్స్ లోని ఓ హాస్పిటల్లో పార్కింగ్‌ఫీజు తీసుకోగా, సాయంత్రం 5.32 గంటలకు కాల్ చేయగా తమకు ఫిర్యాదు తీసుకునే అవకాశం లేదని సుహాసిని అనే టెలీకాలర్సమాధానం ఇచ్చారు. కొంతమంది నేరుగా డిప్యూటీ కమిషనర్‌కు కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
ఇటీవల బంజారాహిల్స్ లోని ఓ పిల్లల దవాఖానలో జీవో రూల్స్‌కు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారని నేరుగా జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ కి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. టౌన్ ప్లానింగ్ వాళ్లను పంపి విచారిస్తామని చెప్పి వదిలేశారు. అంతలోనే ఆ డిప్యూటీ కమిషనర్ బదిలీ అయ్యారు.