పశ్చిమ బెంగాల్లో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మీడియాలో కేవలం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వార్తలే కనిపిస్తాయి. దశాబ్దాలుగా రాష్ట్రాన్నిపాలించిన లెఫ్ట్ ఫ్రంట్ వార్తల ఊసే మీడియాలో ఉండదు. అసలు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ పోటీ చేయడం లేదన్న అనుమానం కూడా కలుగుతోం ది. మీడియా పోకడలపై మేధావులు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.
పేరు ఏదైనా కావచ్చు …. అది పశ్చిమ బెంగాల్లోని ఓ పట్టణం. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేతుల్లో ఎర్రజెండాలు పట్టుకుని వందలాది మంది లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తలు ఉదయం నుంచి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తారు. లెఫ్ట్ కు ఓటేయమని స్థానికులను అడుగుతారు. సాయంత్రానికి పట్టణంలోని ఓ చౌరస్తాలో మీటింగ్ పెడతారు. వేదికపై లెఫ్ట్ నాయకులు ఉపన్యాసాలిస్తారు. సభకు పెద్ద ఎత్తున జనం వస్తారు. మీటింగ్ సక్సెస్ అవుతుంది. ‘ మాస్ మొబిలైజేషన్ ’ పేరుతో లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ తరహా ప్రచారాన్ని చేస్తున్నారు. అయితే మర్నాడు ఎక్కడా ఈ వార్త కనపడదు. ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ కవరేజ్ కాదు కదా కనీసం ఫలానా లోక్ సభ నియోజకవర్గంలో లెఫ్ట్ ఎన్నికల ప్రచారం జరిగిందన్న వార్త కూడా ఇవ్వదు. పశ్చిమ బెంగాల్లో ఇదొక విచిత్రమైన పరిస్థితి. గతంలో ఏ ఎన్నికల సందర్భంలోనూ కనిపించని పరిస్థితి. ఇది ఏ ఒక్కరోజుకో పరిమితం కాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇదే సీన్ కొనసాగుతోంది.
తృణమూల్, బీజేపీకే టాప్ ప్రయారిటీ
ఎలక్ట్రానిక్ మీడియా లో ఎప్పుడు చూసినా తృణమూల్ కాంగ్రెస్ , బీజేపీ వార్తలే కనిపిస్తున్నాయంటున్నారు సామాజిక కార్యకర్తలు. ఏప్రిల్ 22న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ పాల్గొన్న ఒక ఎన్నికల ప్రచార సభకు కేవలం వెయ్యిమంది హాజరైతే అన్ని టీవీ చానళ్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే తిష్టవేసి లైవ్ ఇచ్చిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు కుప్పలుతెప్పలుగా జనం వచ్చారని ప్రచారం చేశారన్నారు.
అదే ఐదారు వేల మందితో సీపీఎం సభ జరిగితే కనీసం కవరేజ్ కు కూడా ఆ వార్త నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార వార్తలన్నీ తృణమూల్ వర్సెస్ బీజేపీ చుట్టూనే తిరుగుతున్నాయని అంటున్నారు.
కీలక అంశాల కవరేజీయే లేదు
బెంగాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీడియాలో ఈ సమస్యల ప్రస్తావన కనపడదన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వం యంత్రాంగంలో అవినీతి, శారదా వంటి కుంభకోణాలు, సీపీఎం కార్యకర్తలపై దాడుల వంటి కీలక అంశాలు కూడా ఉన్నాయి. వీటిని ఫోకస్ చేయడానికి మీడియా ఎలాంటి ప్రయత్నం చేయలేదన్న ఆరోపణ పొలిటికల్ ఎనలిస్టుల నుంచి వినిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు దశల్లో పోలింగ్ జరిగింది. వీటిలో తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసుల సాయంతో తృణమూల్ కాంగ్రెస్ రిగ్గింగ్ కు పాల్పడిందన్న ఆరోపణలు లెఫ్ట్ పార్టీలు చేశాయి. మీడియాలో కనీసం ఈ ఆరోపణలకు కూడా కాస్తంత చోటు దొరకలేదంటున్నారు లెఫ్ట్ ఫ్రంట్ లీడర్లు. మొత్తం మీద బెంగాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచార కవరేజ్ విషయంలో మీడియా అన్ని రాజకీయ పార్టీల పట్ల ఒక న్యాయం పాటించలేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఆ రెండు పార్టీల వెనుకే పరుగు
మీడియా వార్తలను జాగ్రత్తగా పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్లో కేవలం రెండు పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఇవే లోక్ సభ ఎన్నికల పోరులో ఉన్నాయా అనే అనుమానం వస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఎదురులేకుండా ఏలిన లెఫ్ట్ ఫ్రంట్ వార్తలు ఎక్కడా కనిపించవు. అసలు లెఫ్ట్ ఫ్రంట్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నవిషయం కూడా ఎక్కడా ఉండదు. లెఫ్ట్ ఫ్రంట్ లోఇవాళ జ్యోతి బసు, సోమ్ నాథ్ ఛటర్జీ వంటి లీడర్లు ఉండకపోవచ్చు … అది వేరే విషయం. అధికారంలోఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుండవచ్చు. కానీ ఒకప్పుడు ఎర్రకోటగా పేరున్న పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఉనికినే ప్రశ్నించేలా కమ్యూనిస్టు పార్టీలను మీడియా పక్కన పెట్టిన ఇష్యూ తాజాగా తెరమీదకు వచ్చింది.
మీడియా పోకడలపై సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు, మేధావులు మండిపడుతున్నారు.ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కవరేజ్ లో మీడియా ఆబ్జెక్టి విటీ కోల్పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నా యి. కేవలం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకే కొమ్ముకాస్తుం దన్న ఆరోపణలు అనేక వర్గాల నుంచి వస్తున్నాయి. మమతా బెనర్జీ దూకుడుకు లెఫ్ట్ ఫ్రంట్ హవా తగ్గిం దన్న విషయం ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే తృణమూల్ వైఖరితో విసుగెత్తిన బెంగాల్ ప్రజలు మళ్లీ లెఫ్ట్ వైపు ఆశగా చూస్తున్నారంటున్నారు రాజకీయ పండితులు. ముఖ్యం గా బెంగాల్ పల్లెల్లో ని రైతులు, మైనారిటీలు ఇప్పటికీ లెఫ్ట్ ఫ్రంట్ వైపే ఉన్నారంటున్నారు. డార్జిలింగ్,జల్పా య్ గురి, రాయ్ గంజ్, ముర్షీదాబాద్, బుర్ద్వాన్, బంకురా, బోల్ పూర్, అసన్ సోల్, జాదవ్ పూర్,హౌరా లోక్ సభ నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ కు పట్టుం ది. బలమైన కేడర్ ఉంది.
మమతా బెనర్జీ విధానాలు నచ్చని చాలా మందికి లెఫ్ట్ ఫ్రంటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందన్న వాదన కూడా కొన్ని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీపీఎం, ఆ పార్టీ మిత్రపక్షాలు కొంతకాలంగా పుంజుకున్నా యి. అయితే ఈ విషయాన్నిమీడియా గుర్తించడం లేదన్నది మేధావుల ఆవేదన.
మొత్తం ఏడు దశల్లో పోలింగ్
రాష్ట్రంలోని మొత్తం 42 లోక్ సభ నియోజకవర్గాలకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల్లో 18 సెగ్మెంట్ల కు పోలింగ్ ముగిసింది. మే ఆరో తేదీన జరిగే ఐదో దశలో ఏడు సెగ్మెంట్లకు, మే 12న జరిగే ఆరో దశ లో ఎనిమిది సెగ్మెంట్లకు,మే 19న జరిగే ఏడో దశ లో తొమ్మిది నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది.
2014 లోక్ సభ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు ?
2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశమంతా నరేంద్ర మోడీ ప్రభంజనం వీచినా, పశ్చిమ బెంగాల్లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ హవాయే నడిచింది. మొత్తం 42 సెగ్మెంట్లలో తృణమూల్ కాంగ్రెస్ 34 గెలుచుకుంది. కాంగ్రెస్ కు నాలుగు నియోజకవర్గాలే దక్కాయి. లెఫ్ట్ ఫ్రంట్ కు రెండు సీట్లు రాయ్ గంజ్, ముర్షీదాబాద్, బీజేపీకి రెండు సీట్లు దక్కాయి.
–సందీప్ చక్రవర్తి