భారత్ ఉత్పత్తిదారుల దేశంగా ఉండాలి.. పెట్టుబడిదారుల దేశంగా కాదు: మీనాక్షి నటరాజన్

భారత్ ఉత్పత్తిదారుల దేశంగా ఉండాలి.. పెట్టుబడిదారుల దేశంగా కాదు: మీనాక్షి నటరాజన్

హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ సమస్యలపై ప్రభుత్వాలను, పాలకులను ప్రశ్నించే హక్కు ఉందని.. ఇందుకోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. మంగళవారం (మార్చి 4)  హైద్రాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‎లో  ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహా సభలకు మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ ఉద్యమకారురాలు మేధాపాట్కర్ లాంటి వారు మూసీ నది పరివాహక ప్రాంతంలో పర్యటించడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. 

పోలీసులు అలా అడ్డుకోవడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఉద్యమాల్లో నేను మేధా పాట్కర్ లాంటి వారి నుంచి స్ఫూర్తి పొంది ప్రజా ఉద్యమాలు, రాజకీయాల్లోకి వచ్చి పని చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నలు లేవనేత్తే హక్కులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోందని.. కానీ గాంధీ కోరుకున్న దేశంగా భారత్ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. భారత్ ఉత్పత్తిదారుల దేశంగా ఉండాలి కానీ.. ప్రస్తుతం పెట్టుబడిదారుల దేశంగా ఉందని.. ఈ పద్దతి మారాలని అన్నారు. 

ALSO READ | గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం: అప్పట్లో ఐఎంజీ భూములే ఇవి.. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం

అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీ తరుపున కృషి చేస్తానన్నారు. దేశంలో కోటీశ్వరుడు, సామాన్యులు ఒకే టాక్స్ కడుతున్నారు. అంబానీ, అదానీ, చివరకు పాల పాకెట్ కొనుకునే సామాన్యులు సమానంగా టాక్స్‎లు కడుతున్నారు.. ఈ విధానాలు మారాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు పరిమితమైన అధికారులతో ఎన్నుకున్నారు.. కానీ ప్రభుత్వాలు రాజులుగా వ్యవహరించకూడదని సూచించారు.