
- లంక పొగాకుకు గిట్టుబాటు ధరపై కిరికిరి
- మొదట కాండంతో సహా కొంటామని హామీ
- ఇప్పుడు ఆకు మాత్రమే కోయాలని మెలిక
- ఇప్పటికే సగం పంట కోసి ఎండబెట్టిన రైతులు
- మళ్లీ కాండం వేరు చేయాలంటే పెరగనున్న కూలీల భారం
- 10 క్వింటాళ్లు వచ్చే చోట 7 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని ఆందోళన
- ఆకులు విడిగా కోస్తే క్వింటాకు రూ.18 వేలు కాకుండా రూ.25వేలు ఇవ్వాలని రైతుల డిమాండ్
భద్రాచలం, వెలుగు : ఆంధ్రాలోని ఓ కార్పొరేట్ పొగాకు కంపెనీ తీరు భద్రాచలం మన్యంలోని రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. లంక పొగాకు విషయంలో రైతులతో కంపెనీ గతంలో చేసుకున్న ఒప్పందాన్ని మార్చిపోయి ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదట గిట్టుబాటు ధర ఇస్తాం సాగు చేయండంటూ భద్రాచలం నియోజకవర్గంతో పాటు విలీన ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాలలో లంకపొగాకు రైతులను ప్రోత్సహించింది. ఇప్పుడేమో కొనేందుకు కొర్రీలు పెడుతోంది. ఈసారి రైతులు గోదావరి పరివాహక ప్రాంతంలో మిర్చి పంటకు ప్రత్యామ్నాయంగా 6 వేల ఎకరాల్లో లంకపొగాకును సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చాక కంపెనీ పెట్టే ఆంక్షలతో అతలాకుతలమవుతున్నారు.
అప్పుడో మాట.. ఇప్పుడు మరోమాట..
లంకపొగాకు సాగు చేయమని రైతుల వద్దకు కంపెనీ ప్రతినిధులు వచ్చినప్పుడు ఆకు కోసేటప్పుడు లింకు కోతే కావాలని చెప్పారు. అలా చేస్తే తూకం కూడా ఎక్కువగా వస్తుందని, క్వింటాకు రూ.18వేలు ఇస్తామని ఆశచూపించారు. కాడతో సహా ఆకులు కోస్తే కాంటా ఎక్కువగా వస్తుందని రైతులు సరే అన్నారు. ఇప్పుడు పంట కోసే సమయంలో కంపెనీ అసలు కుట్రను బయటపెట్టింది. కాండంతో సహా కోయొద్దని, కేవలం ఆకులను మాత్రమే కోసి ఇవ్వాలని మెలిక పెట్టింది. ఇప్పటికే సగం వరకు పంటను కోసి ఎండబెట్టిన రైతులకు కాండం నుంచి తిరిగి ఆకును వేరు చేయాలంటే కూలీల భారం పెరుగుతోంది. 10 క్వింటాళ్లు వచ్చే చోట 7 క్వింటాళ్లు మాత్రమే తూకం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎదురు తిరిగిన రైతులు
తమకు నష్టం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరించడంతో కొందరు రైతులను కార్పొరేట్ కంపెనీ ఆంధ్రాలోని ఒంగోలుకు పిలిపించి సమావేశం నిర్వహించింది. ఆకులు విడిగా కోసి ఇస్తే క్వింటాకు రూ.25వేలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఆ సమావేశంలో ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఎట్టకేలకు విలీన ఆంధ్రలోని వీఆర్పురం మండలం రేఖపల్లిలో కంపెనీ ప్రతినిధులు మరోసారి మీటింగ్పెట్టి రైతుల నష్టాన్ని పూడ్చేందుకు గిట్టుబాటు ధరను క్వింటాకు రూ.23,500 కు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఎంత వరకు ఈ హామీకి కట్టుబడి ఉంటుందనే దానిపైనే రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆలస్యంతో ఆగమాగం..
ఏటా మార్చి నెలలోనే లంకపొగాకు కొనుగోళ్లను కంపెనీలు ముగించేవి. కానీ ఇప్పుడిప్పుడే రైతుల నుంచి పంటను అరకొరగా తీసుకుంటున్నారు. దీనితో రైతులంతా ఆగమాగమవుతున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్లు డబ్బులు చెల్లించాలంటూ వారిపై ఒత్తిడి తెస్తున్నారు.
కొర్రీలు పెడుతున్నారు.
మూడేళ్ల పాటు కంపెనీ మంచిగానే కొన్నది. ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే సరికి కొర్రీలు పెడుతోంది. గిట్టుబాటు ధర రూ.18వేలు క్వింటాకు ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ పేపర్లు మాత్రం ఇవ్వలేదు. లింకు కోత కోశాక ఇప్పుడు విడిగా ఆకులు కోసి ఇవ్వమని షరతు పెడుతోంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం.
అన్నె సత్యనారాయణమూర్తి, రైతు, సీతారాంపురం, దుమ్ముగూడెం
మోసం చేస్తే సహించేది లేదు
లంక పొగాకు రైతులను మోసం చేస్తే సహించేది లేదు. ఒప్పందం ప్రకారం ముందు చెప్పినట్లుగానే కాండంతో కోసిన పంటనే కొనుగోలు చేయాలి. ఎటువంటి షరతులు లేకుండా తీసుకోవాలి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. లేకపోతే కంపెనీ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.
గడ్డం స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి