కష్టపడి పనిచేస్తూ.. తన రక్తాన్ని చెమటగా మార్చినా నెలకు కనీసం పాతిక వేలు జీతం లేని శ్రామికులు దేశవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. రోజుకు లక్షల్లో, ఏటా కోట్లలో జీతం సంపాదించుకునే కంపెనీల సీఈఓలకు, బ్యూరోక్రాట్లు కార్మికవర్గాన్ని విస్మరిస్తున్నారు. మొన్నటికి మొన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని పేర్కొంటే, తాజాగా ఎల్అండ్ టీ సీఈఓ సుబ్రమణ్యన్ మాట్లాడుతూ ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని కోరారు. ఆదివారాలు కూడా పని చేయాలని అస్తమాను భార్య ముఖం చూస్తూ ఏమి కూర్చుంటారని కామెంట్ చేశారు.
ఏడాదికి 51 కోట్ల రూపాయలు తీసుకుంటున్న సుబ్రమణ్యన్ మాటలు శ్రామికవర్గంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో గని కార్మికులు సుబ్రమణ్యన్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మలను దహనం చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు శ్రామికులకు పనిగంటలు పెరిగాయి. పని గంటలు రోజుకు ఆరు గంటలే ఉండాలని ఐఎల్‌లో ప్రతిపాదనలు వస్తున్నాయి. గృహిణులను సుబ్రమణ్యన్ అవమానించేవిధంగా మాట్లాడటం సరికాదు. ఒక్కో గృహిణి ప్రతిరోజూ16 నుంచి 18 గంటలు పని చేస్తున్న విషయం ఆయన గమనించాలి.
ప్రైవేట్ సెక్టార్లో పెరిగిన పని గంటలు
ప్రైవేట్ సెక్టార్లోని చాలా కంపెనీలు, సర్వీస్ సెంటర్స్‌లో 8 గంటలు బదులు 12 గంటలపాటు ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. గార్మెంట్ కంపెనీలు, స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్స్‌లో, ఆసుపత్రులలో, షాప్స్, మాల్స్లలోనూ పనిగంటలు పెరిగాయి. ఒక్క ప్రభుత్వ రంగంలో తప్ప ప్రైవేట్సెక్టార్లో అన్నిచోట్లా పనిగంటలు రోజుకు 8 గంటలు అనే నిబంధనలు లేవు. కార్మిక చట్టాలు అన్ని కార్పొరేట్లకు అనుకూలంగా మార్చారు. వెల్ఫేర్ స్కీంలు తగ్గించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి వెలుగును అందిస్తున్న బొగ్గు గని కార్మికుల పెన్షన్ 1998 నుంచి పెరగనే లేదు. గత 20 ఏండ్ల క్రితం రిటైర్ అయిన కార్మికులకు వెయ్యి నుంచి రెండువేలు మాత్రమే పెన్షన్ వస్తున్నది. దేశంలో ఉద్యోగులకు, కార్మికులకు, అధికారులకు వేతనాల్లో అసమానతలు నింగికి, నేలకు అనేవిధంగా అంతరం ఉన్నది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మీద సైతం పనిభారం పెరిగింది.
పెరిగిన అప్పుల భారం..
గతంలో మాదిరి ఉత్పత్తి, రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల జీతాలు వారి అవసరాలకు సరిపడేంత లేవు. పెరిగిన, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగటం లేదు. కోట్లాది మధ్యతరగతి కుటుంబాల్లో 18శాతం మంది అప్పులపాలు అవుతున్నారు. 8 కోట్ల మంది ఉద్యోగులు రుణం తీసుకుని తిరిగి కట్టలేక ఆగం అవుతున్న పరిస్థితి ఉన్నది. గోల్డ్ లోన్ గత పదేండ్లలో డబుల్ అయ్యింది. బంగారం కుదువ బెట్టినవాళ్ళు తీసుకున్న ఋణం కట్టలేక, బంగారం విడిపించలేక ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఉపాధి అవకాశం లేక ఇజ్రాయెల్, రష్యాకు ఏదో ఒక రూపంలో వెళ్లి సైన్యంలో సైతం చేరిపోతున్నారు. అక్రమంగా అమెరికా, కెనడాకు కూడ ఉపాధి కోసం వెళుతున్నారు.
మిడిల్ క్లాస్ కుటుంబాల ఆర్థికస్థితి ఏమాత్రం బాగా లేదు. పీఎం నరేంద్ర మోదీ చౌకబారుగా ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్ లకు అమ్మి వేయడం, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను ప్రోత్సహించడం జరుగుతున్నది. రాజ్యాంగం కార్మికవర్గాలకు ఇచ్చిన హక్కులను ఏదో ఒక రకంగా హరించే కుట్ర జరుగుతోంది. దేశానికిపట్టెడు అన్నం పెడుతున్న రైతులు, కార్మికులు అణచివేతకు గురవుతున్నారు.
కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగింపులు, నిరసన పోరాటాలు, ఉద్యమాలు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరి గోస వారిదే. మోదీ సర్కారు అదానీ, అంబానీలకు వత్తాసు పలికి వారు వేల నుంచి లక్షల కోట్లకు ఆస్తులు పెరగడానికి సహకరిస్తోంది. శ్రమకు తగిన ఫలితమే లేని ప్రస్తుత పరిస్థితుల్లో 90 గంటలు పని చేయాలని మాట్లాడడం శోచనీయం.
- ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్-