- చిన్న, సన్నకారు రైతులనురోడ్డున పడేశారు
- లిఫ్టులన్నింటినీ ఐడీసీ పరిధిలోకి తెచ్చేలా సీఎం రేవంత్‌కు లేఖ రాస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ)ని గత బీఆర్‌ఎస్ సర్కారు నిర్వీర్యం చేసిందని కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐడీసీకి ఎంతో ప్రాధాన్యం ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ దానిని నాశనం చేశారని మండిపడ్డారు. చిన్న, సన్నకారు రైతులను రోడ్డున పడేసే స్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు.
గురువారం కార్పొరేషన్ ఆఫీసులో బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ 9 ప్రకారం ఐడీసీని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో విలీనం చేసేందుకు చాన్స్ లేదని, కానీ, ఒక జీవోను తెచ్చి విలీనం చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. అయితే, డిపార్ట్‌మెంట్‌లో కార్పొరేషన్‌ను విలీనం చేయకపోగా.. దాని స్వయం ప్రతిపత్తి పోయేలా చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని 643 లిఫ్టుల్లో చాలా వరకు లిఫ్టులు పనిచేయడం లేదన్నారు.
వాటిని బాగుచేసి పునరుద్ధరించాలంటే రూ.400 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. లిఫ్టుల పునరుద్ధరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. చాలా లిఫ్టుల వద్ద మహారాష్ట్ర, ఏపీల నుంచి వస్తున్న కొందరు వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేస్తున్నారన్నారు. చోరీలను అరికట్టేందుకు లిఫ్టుల నిర్వహణకు లష్కర్లను నియమించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించిన లిఫ్టులను మళ్లీ ఐడీసీకి అప్పగించేలా, ఐడీసీకి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని కార్పొరేషన్ బోర్డు మీటింగ్‌లో తీర్మానించినట్టు ఆయన చెప్పారు. ఐడీసీ బిల్డింగ్, ఆస్తులపైనా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్ బిల్డింగ్‌లో 52 శాతం వాటా ఏపీకి ఉందని, పదేండ్లుగా ఈ రాష్ట్ర సర్కార్ కనీసం ట్యాక్స్ కూడా కట్టలేదని, పైగా బిల్డింగ్‌కు తాళాలు వేసుకుని వెళ్లిపోయారన్నారు. ఆ ట్యాక్స్‌ల భారం కూడా తెలంగాణ కార్పొరేషన్‌పైనే పడిందన్నారు.