యాదగిరిగుట్టను టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం : పటేల్ రమేశ్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు :  రాష్ట్రంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంతాన్ని అన్నిహంగులతో టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామని టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రమేశ్​రెడ్డి మాట్లాడుతూ యాదగిరిగుట్ట, కొలనుపాకతోపాటు పలు ముఖ్యమైన ప్రాంతాలతో 'టెంపుల్ సర్క్యూట్' ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 

ప్రత్యేక నిధులతో యాదగిరిగుట్ట ఆలయం చుట్టూ ఉన్న ప్రముఖ ఆలయాలు, కొలనుపాకలోని సోమేశ్వరాలయం, జైన్ మందిర్ ను అభివృద్ధి చేసి టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు, టూరిస్టులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు, వసతులు కల్పిస్తామని తెలిపారు. అనంతరం యాదగిరిగుట్టలో ఉన్న హరిత టూరిజం హోటల్​ను పరిశీలించారు. హరిత టూరిజం హోటల్ రెనొవేషన్ కోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట హరిత హోటల్ మేనేజర్ జంగయ్య, శ్రీను నాయక్ తదితరులు ఉన్నారు.