బస్తీమే సవాల్
2,700 బస్తీల్లోని ఓటర్లపైనే కార్పొరేటర్ క్యాండిడేట్ల ఫోకస్
ఆ ఓట్లు పడితే గెలుపు ఖాయమన్న ధీమా..
బస్తీల్లో ప్రచారం చేసేందుకు స్పెషల్ ప్లాన్లు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తున్న క్యాండిడేట్లు బస్తీలపై ఫోకస్ పెట్టారు. బస్తీ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీల వాళ్లు స్పెషల్ ప్లాన్లను రెడీ చేస్తున్నారు. ‘బస్తీ మే సవాల్’ అంటూ చాలెంజ్‌కు సిద్ధమవుతున్నారు. బస్తీల్లో దాదాపు 90% దాకా పోలింగ్ నమోదవుతుండడంతో.. అక్కడి ఓట్లు పడితే గెలుపు ఖాయమని భావిస్తున్నారు.
500 నుంచి 5 వేల ఓట్లు
గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో మొత్తంగా 2,700 దాకా బస్తీలున్నట్టు చెబుతున్నారు. అందులో అధికారికంగా 1,500 బస్తీలుంటే.. అనధికారికంగా మరో 1,200 దాకా ఉన్నాయి. కొన్ని డివిజన్లలో సగం ఓట్లు బస్తీల్లోనే ఉన్నాయి. ఒక్కో బస్తీలో కనీసం 500 వందల నుంచి 5 వేల వరకు ఓటర్లున్నారు. దాదాపు 25 శాతం ఓట్లు వాళ్లవే ఉన్నాయి. పోష్ ఏరియాలు, అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఓటర్లు చాలా మంది ఓట్లేసేందుకు ఇష్టపడట్లేదు. అందుకే కార్పొరేటర్ క్యాండిడేట్లు బస్తీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
నమ్మిన పార్టీకే ఓట్లు!
బస్తీల్లో ఉండే వాళ్లందరికీ కామన్ సమస్యలుంటున్నాయి. దీంతో ఆ సమస్యలు ఎవరు తీరుస్తారని నమ్ముతారో.. ఆ పార్టీ వాళ్లకే ఓట్లు వేస్తున్నారు. సిటీలోని సైదాబాద్ డివిజన్లో ఉన్న సింగరేణి బస్తీ అతి పెద్దది. పారిశుధ్య కార్మికులు, అడ్డా కూలీలు ఎక్కువగా ఉంటారు. అక్కడ 1,800 పక్కా ఇళ్లతో పాటు 1,200 గుడిసెలు ఉన్నాయి. 18 వేల ఓట్లు వీరివే. యూసుఫ్‌గూడ డివిజన్‌లోనూ దాదాపు 20 వేల ఓట్లున్నాయి. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, బౌద్ధ నగర్, అంబర్‌పేట్‌లోని పటేల్‌నగర్, రామాంతాపూర్‌లోని కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్ వంటి బస్తీలు, సోమాజీగూడలోని ఎంఎస్ మక్తా, కుమ్మరి బస్తీలలో భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్
అధికార పార్టీపై బస్తీల్లో మొదలైన వ్యతిరేకతను బీజేపీ, కాంగ్రెస్‌లు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాము గెలిస్తే వరద సాయం టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఇస్తమని చెబుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా.. అవి పేదలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ లీడర్లు కూడా సిటీలో బస్తీలకు అన్ని సౌకర్యాలు కల్పించిందీ తామేనని చెబుతున్నారు.
For More News..