హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించిన కార్పొరేటర్ల స్పోర్ట్స్ మీట్ శనివారం ఘనంగా ముగిసింది. కార్పొరేటర్లు వివిధ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పీజేఆర్ విక్టరీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి పాల్గొని గెలుపొందిన కార్పొరేటర్లకు ప్రైజ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై తీరిక లేకుండా కృషి చేస్తున్న కార్పొరేటర్ల మానసిక ఉల్లాసం కోసం జీహెచ్ఎంసీ క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, మ్యూజికల్ చైర్ పోటీల్లో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, స్పోర్ట్స్ డైరెక్టర్ భాషా, ఫిజికల్ డైరెక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మూడ్రోజుల పాటు జరిగిన 5వ సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్‌అండ్ గేమ్స్ మీట్ కూడాశనివారం ముగిసింది. టెన్నిస్‌లో మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచారు. రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జితేందర్, సీపీ స్టీఫెన్ రవీంద్ర చీఫ్ గెస్ట్లుగా హాజరై గెలుపొందిన వారికి పతకాలు అందజేశారు.