లంచం.. లంచం.. ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులు

ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు అవినీతి తిమింగలాలను పట్టుకొని జైలుకు తరలిస్తున్నా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం చలనం రావడం లేదు. చేతులు తడవనిదే ఫైళ్లు కదలవు అన్నట్లుగా కాసులకు కక్కుర్తి పడుతున్నారు. పక్కా ఆధారాలతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులనుసంప్రదిస్తుండడంతో వారి పాపం పండుతోంది. తాజాగా, ఒకేరోజు ఇద్దరు అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ వలకు చిక్కారు. 

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ గ్రామం పంచాయితీ కార్యదర్శి సచిన్ కుమార్ రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఫిర్యాదుదారు తన ఇంటికి నెంబర్ కేటాయించాలని పంచాయితీ కార్యదర్శి సచిన్‌ను సంప్రదించగా.. అతను రూ.30వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని అనడంతో ఆ మొత్తాన్ని రూ.15వేలకు తగ్గించాడు. అందులో భాగంగా మొదటి విడతగా రూ. 10వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

నక్ష కోసం రూ. 20 వేలు లంచం డిమాండ్‌..

మరో ఘటనలో మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ సీనియర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ జ్యోతీక్షేమాబాయి ఏసీబీకి చిక్కింది. వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ పిర్యాదుదారు వ్యవసాయ భూమికి సంబంధించి నక్షకు దరఖాస్తు చేయగా.. జ్యోతీక్షేమాబాయి రూ. రూ.20 వేలు ఇస్తేనే మ్యాప్‌ వస్తుందని చెప్పింది. ఫిర్యాదుదారు లంచం ఇవ్వడం ఇష్టం ఏసీబీ అధికారులను సంప్రదించడంతో ఆమె అవినీతి బాగోతం బయటపడింది.

ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064 నంబర్ ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు. ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.