అదానీపై అవినీతి కేసు.. మోదీ పర్సనల్ మ్యాటర్ కాదు

అదానీపై అవినీతి కేసు.. మోదీ పర్సనల్ మ్యాటర్ కాదు
  •  ఇది దేశానికి సంబంధించిన అంశం: రాహుల్ ​గాంధీ

న్యూఢిల్లీ: అదానీ అవినీతి కేసును వ్యక్తిగత అంశంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా మీడియాతో పేర్కొనడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పు పట్టారు. అది ఎట్టిపరిస్థితుల్లో ప్రధాని మోదీ పర్సనల్ మ్యాటర్ కాదని.. దేశ ప్రజలందరికి సంబంధించిన అంశమని అన్నారు. 

శుక్రవారం తన ఎంపీ నియోజకవర్గంలో పర్యటించిన రాహుల్​గాంధీ లాల్ గంజ్ పట్టణంలో యవకులతో నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడారు. అమెరికాలో అదానీపై అవినీతి కేసు పెండింగ్​లో ఉందని రాహుల్​ పేర్కొన్నారు. గతవారం అమెరికా పర్యటనలో ప్రెసిడెంట్​ డోనాల్డ్​ ట్రంప్ తో భేటీ సమయంలో అదానీ అంశం గురించి చర్చించారా? అని   మీడియా మోదీని ప్రశ్నించిందన్నారు. 

అయితే మన ప్రధాని దీనిపై స్పందిసత్తూ.. అది పర్సనల్ మ్యాటర్ దానిపై మేము చర్చించమని అన్నారు. ‘‘నరేంద్రమోదీ గారు ఇది వ్యక్తిగత అంశం కాదు.. ఇది దేశానికి సంబంధించిన విషయం” అని రాహుల్ అన్నారు. మోదీ నిజమైన భారత ప్రధాని అయితే ఈ విషయం గురించి ట్రంప్​ను అడిగి విచారణ కోరేవారని.. అవసరమైతేనే అదానీని అమెరికాకు పంపుతామని చెప్పేవారన్నారు. కానీ ఇది పర్సనల్​ మ్యాటర్​ అని చెప్పారని విమర్శించారు. 

ఇండియాలో  కాంట్రాక్టులకు సంబంధించి  ఏపీ, ఒడిశా రాష్ట్రాలలోని నేతలు, అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారని ఆరోపిస్తూ గతేడాది నవంబర్ 20న గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్, ఇతర సహచరులపై యూఎస్ డిపార్ట్​మెంట్ ఆఫ్ జస్టిస్ నేరారోపణ చేయగా, దీనిని అదానీ గ్రూప్ ఖండించింది.