- అక్రమాలకు అడ్డాగా మారిన బాలసదనాలు
- మైనర్లను పేరెంట్స్‌కు అప్పగించేందుకు డబ్బులు వసూలు
- మార్చిలో ఓ మైనర్‌పై మహబూబ్‌నగర్ కమిటీ మెంబర్ లైంగిక వేధింపులు
- అధికార దుర్వినియోగం చేశారని వనపర్తిలో చైర్‌పర్సన్, మెంబర్ టర్మినేట్
మహబూబ్‌నగర్, వెలుగు : చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (సీడబ్ల్యూసీ) రోజురోజుకు అవినీతిలో కూరుకుపోతున్నాయి. వివిధ కారణాలతో స్టేట్ హోమ్, చిల్డ్రన్స్ హోమ్‌కు వస్తున్న మైనర్లను పేరెంట్స్‌కు, బంధువులకు అప్పగించే విషయంలో సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులోని ఓ జిల్లాకు చెందిన సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్, మెంబర్ అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో వారిని టర్మినేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
పిల్లల రక్షణ కంటే.. డబ్బు వసూళ్లపైనే ధ్యాస
వివిధ కారణాలతో ఇండ్ల నుంచి వెళ్లిపోయిన వారు, పేరెంట్స్ చనిపోతే అనాథలుగా మారిన మైనర్ల సంరక్షణ బాధ్యతలను సీడబ్ల్యూసీ కమిటీలు చూసుకోవాల్సి ఉంటుంది. మైనర్లను వారి ఏజ్‌ను బట్టి చిల్డ్రన్ లేదా స్టేట్ హోమ్‌కు తరలించి ఆశ్రయం కల్పిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇల్లు విడిచిపెట్టి వెళ్లిన వారిని పట్టుకున్నాక వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించాలి.
కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సీడబ్ల్యూసీల్లో పని చేస్తున్న కొందరు సభ్యులు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రేమ వ్యవహారాల్లో పట్టుబడిన మైనర్లను తల్లిదండ్రులకు అప్పగించకుండా నేరుగా హోమ్స్‌కు తరలిస్తున్నారు. తమ పిల్లలను అప్పగించాలని తల్లిదండ్రులు కమిటీల వద్దకు వస్తే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మైనర్లపై లైంగిక వేధింపులు
తల్లి లేని ఓ మైనర్ తండ్రి వద్ద ఉండలేక చిల్ర్డన్ హోమ్‌కు వచ్చింది. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ కేజీబీవీలో చదువుకుంటూ అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. కేజీబీవీకి సెలవులు ఇచ్చినప్పుడు తిరిగి చిల్ర్డన్ హోమ్‌కు వచ్చి తలదాచుకునేది. మార్చిలో కేజీబీవీకి సెలవులు ఇవ్వడంతో సదరు మైనర్ ఎప్పటిలాగే చిల్ర్డన్ హోమ్‌కు వచ్చింది.
ఇక్కడి సీడబ్ల్యూసీలోని ఓ వ్యక్తి బాలికను తరచూ లైంగికంగా వేధించేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు వేధింపులు నిజమేనని తేల్చి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిని కేసు నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి.
ఇద్దరిపై వేటు
వనపర్తి జిల్లాకు చెందిన సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ అలివేలమ్మ, కమిటీ సభ్యురాలు నళినిని ఉన్నతాధికారులు టర్మినేట్ చేశారు. ఈ మేరకు మే 21నే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆలస్యంగా బయటపడింది. వీరిద్దరూ అధికార దుర్వినియోగం చేస్తున్నారన్న ఉమెన్ డెవలప్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. దీంతో ఆరోపణలపై ఎంక్వైరీ చేయాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)ని ఆదేశించారు.
ఆయన వనపర్తి జిల్లా అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. అలివేలమ్మ, నళిని వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందజేశారు. దీంతో వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, వారిని పోస్టుల నుంచి టర్మినేట్ చేస్తున్నట్లు ఆర్డర్స్ జారీ చేశారు. కొత్త చైర్మన్‌ను నియమించే వరకు వనపర్తి డీడబ్ల్యూవోను చైర్‌పర్సన్‌గా కొనసాగాలని
ఆదేశించింది.
చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు పరార్
మహబూబ్‌నగర్‌లోని చిల్ర్డన్ హోమ్ నుంచి ఐదు రోజుల కిందట ఇద్దరు మైనర్లు పారిపోయారు. వివిధ కారణాలతో నెల రోజుల కింద ఒకరు, ఇటీవల మరో మైనర్ హోమ్‌కు వచ్చారు. చిల్డ్రన్ హోమ్, డైట్ కాలేజీకి మధ్య ఉన్న గోడ గతంలో కూలిపోగా దానిని తిరిగి నిర్మించలేదు.ఈ ఇద్దరు మైనర్లు ఆ గోడను దాటి డైట్ కాలేజీ మీదుగా బయటకు వచ్చి పరార్ అయినట్లు పలువురు చెబుతున్నారు. పోలీసులు మాత్రం హోమ్ నుంచి పారిపోయిన ఇద్దరిలో ఓ బాలిక క్షేమంగాబంధువుల ఇంటికి చేరగా, మరో మైనర్ కోసం గాలిస్తున్నామని చెప్పారు.